Updated : 28/06/2021 08:22 IST
TS News: పిల్లలకు ఉరేసి.. తల్లి బలవన్మరణం
క్షణికావేశంలో నిర్ణయం.. ముగ్గురి బలి
నడిగూడెం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలు, భర్త తన మాట వినకుండా పంచాయతీకి వెళ్లాడని.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆ కుటుంబంలో విషాదం నింపింది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడేనికి చెందిన పోలిశెట్టి శ్రీనాథ్‌కు నడిగూడెం మండలం చెన్నకేశవాపురానికి చెందిన మౌనికతో వివాహమైంది. రామాపురంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా శ్రీనాథ్ పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల లాక్షిత, ఏడాదిలోపు వయసున్న బాబు ఉన్నాడు. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గొడవలకు సంబంధించి సూర్యాపేటలో పంచాయతీకి రావాలని శ్రీనాథ్‌కు బంధువులు కబురు పంపారు. ఆ పంచాయతీకి వెళ్లొద్దని.. వెళ్తే తాను బలవన్మరణానికి పాల్పడతానని మౌనిక తేల్చిచెప్పింది. తనకు చెప్పకుండా శుక్ర, శనివారం పంచాయతీకి వెళ్లిన విషయంపై ఆదివారం భర్తను నిలదీసింది. వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన మౌనిక.. భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోని ఆర్చీకి రెండువైపులా పిల్లలకు కండువాతో ఉరేసింది. తర్వాత తానూ ఇద్దరి పిల్లల నడుమ చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనాథ్.. ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులను పగులగొట్టారు. భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా వేలాడుతుండటాన్ని గమనించాడు. తల్లి క్షణికావేశంతో ముక్కుపచ్చలారని చిన్నారుల ఉసురు తీసిందని స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్సై ఏడుకొండలు ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Tags :