...ఆ నిస్సహాయత నుంచే ధాత్రి పుట్టింది!
‘నా ఒక్కదానికే ఎందుకు ఈ కష్టం వచ్చింది?’ అని ఆలోచించే వాళ్లుంటారు.. ‘నాలా ఇంకెంతమందికి ఈ కష్టం వచ్చిందో... వాళ్ల పరిస్థితి ఏంటి’.. అని యోచించేవాళ్లూ ఉంటారు. రెండో కోవకి చెందుతుంది డాక్టర్ శంకారపు స్వాతి. ఉపాధి కోసం కాళ్లరిగేలా తిరిగినా చిన్న ఉద్యోగం కూడా దొరక్క ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఆమె... నేడు వేలమంది మహిళలకు నైపుణ్యాలని అందించి వారికో దారి చూపిస్తోంది..
చిత్తూరు జిల్లా మదనపల్లె స్వాతి సొంతూరు. తెలుగులో పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని బెంగళూరులో అడుగుపెట్టింది. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి భర్త వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. చేతిలో చిల్లిగవ్వలేదు. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కూడా డబ్బు లేక అప్పు చేసి సంసారాన్ని నెట్టుకురావాల్సిన పరిస్థితి. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి పెరిగింది. దాంతో మరోదారిలేక డిగ్రీపట్టా చేతపట్టి ఉద్యోగవేటలో పడింది స్వాతి. కానీ ఎక్కడకు వెళ్లినా నిరాశే ఎదురయ్యిందామెకు. తన విద్యార్హతకి తగిన ఉద్యోగం బెంగళూరులో దొరకడం కష్టమని కొన్ని రోజులకే అర్థమైపోయింది. కానీ అప్పులిచ్చిన వాళ్ల నుంచి సూటిపోటి మాటలు, గొడవలు అంతకంతకూ ఎక్కువయ్యాయి. ‘సరిగా నిద్ర ఉండేది కాదు. కడుపు నిండా తినడానికి తిండి ఉండేది కాదు. మరోదారిలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ చదువుకుని, సమాజం గురించి తెలిసిన నేనే కష్టాలను ఎదుర్కోలేక చనిపోవాలనుకుంటే... చదువురాని, లోకజ్ఞానం లేని మహిళలు ఇన్నిన్ని కష్టాలను ఎదుర్కొంటూ జీవితానికి ఎలా ఎదురీదుతున్నారనే ఆలోచన వచ్చింది నాకు. చనిపోయి అందరికీ ఓ జ్ఞాపకంగా మిగిలేకంటే బతికే ధైర్యాన్ని నేర్పాలనిపించింది. నాలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడవాళ్లకు అండగా ఉండాలనుకున్నా. అలా నా ఆత్మహత్య ఆలోచన నుంచే ధాత్రి ఫౌండేషన్ పుట్టుకొచ్చింది’ అంటోంది స్వాతి.
ఆత్మవిశ్వాసమే ఆయుధం...
డబ్బు చెల్లించి నేర్చుకునే స్థోమత లేక టైలరింగ్, కుట్లు, అల్లికలు, శారీరోలింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడరీ వంటివాటిని ఆన్‌లైన్‌ద్వారా సొంతంగా నేర్చుకుంటూ ప్రతిభను పెంచుకుంది స్వాతి. అందమైన, ఆకట్టుకునే డిజైన్లతో వస్త్రాలను కుట్టిచ్చేది. దీంతో ఆమె పనితనానికి డిమాండ్ పెరిగింది. వచ్చిన డబ్బుతో బొతిక్, టైలరింగ్ షాపులను ప్రారంభించింది. నెమ్మదిగా అప్పులు తీర్చుకుంటూ సంసారాన్ని గట్టెక్కించింది. ఈక్రమంలోనే ఒంటరి మహిళలు, వితంతువులు సమాజంలో పడే కష్టాలను గమనించింది. అలాంటి వారితోపాటు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో మూడేళ్ల క్రితం ‘ధాత్రి ఫౌండేషన్’ కార్యక్రమాలు మొదలయ్యాయి. తొమ్మిది మందితో ప్రారంభమైన ఈ సంస్థలో నేడు వెయ్యిమందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ వ్యాపార నైపుణ్యాలను, మెలకువలని అందించి వాళ్లు తమ సొంతకాళ్లపై నిలబడేలా చేసింది స్వాతి.
‘ధాత్రి’ సేవా కార్యక్రమాలు...
ఆ రోజు అర్ధాకలితో తను పడిన కష్టం మరొకరు పడకూడదన్న ఉద్దేశంతో ‘ఆహార ధాత్రి’ పేరుతో ఏడాదిగా నిరాశ్రయులకు మూడుపూటలా ఆకలి తీరుస్తోంది. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వందమంది రోగులకు అన్నదానం చేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఏ అండా లేని ఆరు కుటుంబాలను దత్తత తీసుకుని.. వారికి నెలనెలా అవసరమైన సాయం అందిస్తుంది. ప్రతినెల రెండో శనివారం ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తోంది. ‘మాకు శ్రామిక ధాత్రి అనే విభాగం కూడా ఉంది. కూలీలకు డబ్బులివ్వలేక ఇబ్బంది పడుతున్న రైతుల పొలాల్లో మేమంతా కలిసి ప్రతి ఆదివారం కలుపు తీసి, వ్యవసాయ పనులు చేసిపెడుతుంటాం. ప్రభుత్వ పథకాల గురించి వాళ్లకు చెబుతాం. చదువు, ఉద్యోగం, పేరు, డబ్బు... వీటిల్లో ఆనందం పరిమితంగా ఉంటుంది. కానీ నిస్సహాయులకు సాయం చేసినప్పుడు వాళ్ల కళ్లలో కనిపించే ఆనందానికి మించిన సంపద మరొకటి ఉండదు’ అనే డాక్టర్ శంకారపు స్వాతి రాష్ట్రస్థాయిలో పలు అవార్డులనీ
అందుకుంది.
Tags :