బాల సాహిత్యం తేలికేంకాదు!
బాల సాహిత్యంలో అలుపెరుగని అక్షర సేద్యం చేస్తున్నారు రచయిత్రి కన్నెగంటి అనసూయ. పిల్లల కోసం వందల కథలు రాసిన ఆవిడ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజ సేవలోనూ ముందుండే ఆమె తన సాహిత్య, సమాజ సేవ గురించి ఏమంటున్నారంటే..
మా స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల. సీఆర్ రెడ్డి కాలేజీలో గ్రంథాలయాధికారిగా 11 ఏళ్లు పనిచేశా. పౌరశాస్త్ర అధ్యాపకురాలిగా పాఠాలు చెప్పా. తర్వాత వ్యాపార రంగంలోకి వచ్చా. 1977లో పదో తరగతిలో తొలి కథ రాశా. చిన్నప్పటి నుంచి వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేదాన్ని. వాటిలో బహుమతిగా వచ్చిన పుస్తకాలతో బడిలో గ్రంథాలయం ఏర్పాటుచేశా. స్కూల్, కాలేజీ మ్యాగజీన్లకు కూడా రచనలు చేసేదాన్ని. డిగ్రీలో కళాశాల మహిళా ప్రతినిధిగా ఎన్నికయ్యా. అప్పుడు పత్రికలకు వ్యాసాలు, ఇంటర్వ్యూలు చేసేదాన్ని. వాళ్లిచ్చే పారితోషికంతో కాలేజీ వెయిటింగ్ రూంలో మహిళలకు వసతులు కల్పించా.
అదో తపస్సు..
గ్రంథాలయాధికారిగా పనిచేస్తున్నప్పుడు పుస్తకాలతో అనుబంధం పెరిగింది. కథలు, కవితలు రాయడంలో పరిణతి వచ్చింది. మూడు వందలకు పైగా పెద్దల కథలు, దాదాపు ఆరువందల చిన్న పిల్లల కథలు రాశా. ఐదు కథా సంపుటాలు, నవలలు వెలువరించా. ఇప్పటి వరకూ 24 పురస్కారాలు అందుకున్నాను. ప్రస్తుతం పురస్కారం వచ్చిన ‘స్నేహితులు’ పుస్తకం 2018లో ప్రచురితమైంది. రెండేళ్ల కిందట పిల్లల కోసం కథల వర్క్‌షాపులు నిర్వహించడం ప్రారంభించాను. చిన్న పిల్లలకు కథా పోటీలు పెట్టి బహుమతులు అందిస్తున్నా. బాలసాహిత్యంపై రచయితల్లో కూడా కాస్తంత చులకన భావం ఉంది. కానీ, బాల సాహిత్యం ఒక తపస్సు. పిల్లల కోసం పిల్లల్లాగే మారి రాయడం అంత తేలిక కాదు.
2009లో స్నేహితులతో కలిసి ‘మానస’ స్వచ్ఛంద సంస్థ స్థాపించా. దీని తరఫున ‘గుప్పెడు బియ్యం’ కార్యక్రమం ద్వారా వందల బస్తాలు సేకరించి పంచిపెట్టాం. ఫేస్‌బుక్ మిత్రుల నుంచి రూ.లక్షా పదివేలు సేకరించి చేర్యాల మండలంలో ఆత్మహత్య చేసుకున్న 11 మంది అన్నదాతల కుటుంబాలకు అందించాం. మావారు కన్నెగంటి రవికుమార్ చార్టర్డ్ అకౌంటెంట్. మాకు ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించకపోవడం ఇప్పుడు పెద్ద సమస్య. దీంతో చిన్నారులు టీవీలు, వీడియోగేముల్లో మునిగిపోయి హింసా ప్రవృత్తిని అలవరచుకుంటున్నారు. అందుకే అమ్మానాన్నలు పిల్లలకు తప్పకుండా కథలు చెప్పాలి. పిల్లలతోనే వారి కథల్ని రాయించడం నా లక్ష్యం. దీని కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్క్‌షాపులు నిర్వహిస్తా.
పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రచనలు చేస్తున్న నాకు ఈ పురస్కారం మంచి ప్రోత్సాహం. ప్రస్తుతం చిన్నపిల్లల్ని చూస్తుంటే జాలేస్తోంది. చదువుల ఒత్తిళ్లలో వాళ్లు తీవ్ర అలసటకి గురవుతున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవడం, తల్లిదండ్రులకు తీరిక దొరక్కపోవడంతో పిల్లలకు కథలు చెప్పేవాళ్లు కరవయ్యారు. కథల ద్వారా పిల్లల్లో ఊహాశక్తి, భాషా పరిజ్ఞానం పెరుగుతాయి.
- వేణుబాబు మన్నం
Tags :