మా మంచి బ్యాక్టీరియా... ఎక్కడున్నావ్? పిండిని రొట్టెగా మార్చేది ఒకటైతే... పాలను పెరుగుగా మార్చేది ఇంకొకటి... కంటికి కనిపించని సూక్ష్మజీవులు మనిషికి చేసే సహాయం అనంతం... అలాంటి మంచి బ్యాక్టీరియా జాడ కనిపెట్టడమే ఆమె పని. ఒకటి కాదు, రెండుకాదు ఏకంగా 200 రకాల కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ సీహెచ్.శశికళ. ఈ పరిశోధనలే ఆమెను ప్రతిష్ఠాత్మకమైన ‘జానకీ అమ్మాళ్ నేషనల్ అవార్డు’కు ఎంపిక చేశాయి. టొమాటో కెచప్ తెలుసుగా... ఎర్రగా, చూడగానే నోరూరిస్తుంటుంది. అదంత ఆకర్షణీయంగా ఉండడానికి తయారీదారులు రసాయన రంగులు ఉపయోగిస్తారు. రోడో స్పైరిల్లం సల్ఫ్యూరెక్సిజెంట్స్ అనే సూక్ష్మజీవులను శశికళ తన పరిశోధనలలో గుర్తించారు. ఇవి లైకోపిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయడాన్నీ గమనించారు. ఈ పదార్థం ప్రస్తుతం టొమాటో కెచప్‌లు, ఆహార ఉత్పత్తుల్లో సహజసిద్ధమైన వర్ణంగా ఉపయోగపడుతోంది. ఈ విధానంలో పలు సంస్థలు లైకోపిన్‌ను తయారుచేయడానికి ముందుకు రావడంతో శశికళ దానిపై పేటెంట్ హక్కును తీసుకున్నారు. ఇవే కాదు ఆక్వాకల్చర్‌లో మందులుగా ఉపయోగపడే సూక్ష్మజీవులను కూడా ఆమె గుర్తించారు. ఎన్నో ప్రఖ్యాత సంస్థలు ప్రస్తుతం దేశంలోని పలు చోట్ల చేపలు, రొయ్యల పెంపకంలో వాటిని ఉపయోగిస్తున్నారు. చేపల చెరువుల్లో వేసిన ఆహారంలో మిగిలింది కుళ్లిపోయి, హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా వంటి రసాయనాలుగా మారతాయి. ఇవి మత్య్స సంపదపై తీవ్రప్రభావం చూపిస్తాయి. ఈ పరిస్థితుల్లో సూక్ష్మజీవులు ఆ రసాయనాలను తినేసి నీటిలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. కోళ్లఫారంలో చేరే వ్యర్థాలకు ఈ బ్యాక్టీరియాలను కలిపితే దుర్వాసన దూరమవుతుంది. అలాగే గట్టిపడే క్రూడ్ ఆయిల్, పెట్రోలు, డీజిల్‌ను ఇవి పలుచగా చేస్తాయి. ఇక భవననిర్మాణాల్లో ఉపయోగించే కాంక్రీట్‌లో ‘బాసిల్లస్’ వంటి బ్యాక్టీరియాను కలిపితే క్యాల్షియం కార్బోనేట్ అనే క్రిస్టల్స్‌ను ఉత్పత్తి చేసి మధ్యలో ఏర్పడే రంధ్రాలను పూడ్చి, ఆ నిర్మాణానికి ధ్రుఢత్వాన్ని తెస్తుంది. ‘ఇలా రోజువారీ జీవితంలో మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులను కనిపెడుతున్నందుకు వచ్చే ప్రశంసలకన్నా అందరికీ ఉపయోగపడేదే చేస్తున్నా అనే సంతృప్తి ఎక్కువ ఉంటుంది’ అని అంటారీమె. అదో తపస్సు... సూక్ష్మజీవుల వర్గీకరణ సాధారణ విషయమేం కాదు. ఇవి కంటికి కనిపించవు. నిరంతరం వీటిపై నిఘా నేత్రం ఉండాల్సిందే. ఏ సందర్భంలో ఎలాంటి ఉత్పరివర్తనాలు వస్తున్నాయి. ఎప్పుడు ఎలా మార్పు చెందుతోందనేది అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైన విషయం. అనూహ్యంగా జరిగే అనేక మార్పులను గమనిస్తూ, నోట్ చేసుకుంటూ, గుర్తిస్తూ... ఇలా ఆమె జీవితం రోజూ ఓ తపస్సులా ఉంటుంది. ఈమె పరిశోధనశాల మొత్తం భద్రపరిచిన సూక్ష్మజీవులే ఉంటాయి. రెండు దశాబ్దాలుగా వేలకొలదీ సూక్ష్మజీవులను విడదీసి పరిశీలించి కొత్తవాటిని గుర్తించి నామకరణం చేస్తున్నారీమె. వీటిని పలు ప్రయోజనాలకు వినియోగించేలా చేసి వాటిపై పేటెంట్ హక్కునూ పొందారు. బ్యాక్టీరియాలను గుర్తించే పనిలో సహజసిద్ధంగా నీరు, మట్టి, నాచు వంటివాటినే శశికళ ఎంచుకుంటారు. గుర్తించిన వాటి ఎదుగుదలకు అవసరమయ్యే ప్రత్యేక పరిస్థితులను కల్పించి వాటిని వృద్ధి చేస్తారు. దీనికి రోజులు, నెలలు కూడా పట్టొచ్చు. రెండు దశాబ్దాలుగా ఈమె చేపడుతున్న ఈ పరిశోధనలలో ఇప్పటి వరకు 200 రకాల కొత్త బ్యాక్టీరియాలను గుర్తించారు. ఆమె ప్రస్తుతం జేఎన్‌టీయూలో సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్, బ్యాక్టీరియల్ డిస్కవరీ ల్యాబొరేటరీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. విశ్వవిద్యాలయం ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు ఛైర్‌పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. Tags :