హక్కుల నేత స్టాన్ స్వామి కన్నుమూత
ఎల్గార్ పరిషద్ కేసులో అక్టోబరులో అరెస్టు
అనారోగ్యంతో మే 29న ఆసుపత్రిలో చేరిక
గుండెపోటుతో కన్నుమూత
ప్రభుత్వ హత్యేనంటూ సామాజిక ఉద్యమకారుల ఆగ్రహం
ముంబయి: అడవి బిడ్డల హక్కుల కోసం మూడు దశాబ్దాలకు పైగా ఉద్యమిస్తున్న స్టాన్ స్వామి(84) సోమవారం ముంబయిలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. మావోయిస్టులతో సంబంధాలు, బీమా-కోరేగావ్ కేసులో నేరారోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తొమ్మిది నెలల క్రితం ఆయనను అరెస్టుచేసి జైలులో ఉంచింది. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో బాంబే హైకోర్టు ఆదేశాలతో మే 29న ముంబయిలోని ఆసుపత్రిలో చేరిన స్టాన్ స్వామికి ఆదివారం గుండెపోటు వచ్చింది. అప్పటికే పార్కిన్‌సన్ వ్యాధి, కొవిడ్ అనంతర సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన సోమవారం మధ్యాహ్నం 1.24 గంలకు మృతి చెందారని చికిత్సనందించిన హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఇయాన్ డిసౌజా, న్యాయవాది మిహిర్ దేశాయ్ బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. అనారోగ్యం రీత్యా బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ధర్మాసనం.. తాజా వైద్య నివేదిక గురించి ఆరా తీస్తున్న సమయంలోనే స్టాన్ స్వామి మృతి విషయాన్ని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆకస్మిక మరణం పట్ల న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎస్.శిందే, జస్టిస్ ఎన్.జె.జమదార్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. కొవిడ్ సోకిన స్టాన్ స్వామికి సకాలంలో, సరైన వైద్యం అందకుండా ఎన్‌ఐఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన తరఫు న్యాయవాది మిహిర్ దేశాయ్ ఆరోపించారు. న్యాయవిచారణ జరిపించాలని ధర్మాసనాన్ని కోరారు. కుటుంబ సభ్యులెవరూ లేనందున భౌతిక కాయాన్ని స్టాన్ స్వామి సహచరుడు ఫాదర్ ఫ్రేజర్ మస్‌కారెన్హాస్‌కు అప్పగించాలని ధర్మాసనం ఆదేశించింది. కొవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలను ముంబయిలోనే నిర్వహించాలని సూచించింది.
ఎన్‌ఐఏ తీరుపై తీవ్ర నిరసన
స్టాన్ స్వామి మరణంపై పలువురు రాజకీయ నేతలు, హక్కుల సంఘాల నాయకులు, మేధావులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. స్వామి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేశారు. కుట్ర పూరితంగా స్టాన్ స్వామిని కేసులో ఇరికించి, బెయిల్ రాకుండా చేసిందని ఎన్‌ఐఏపై, కేంద్ర ప్రభుత్వంపై పలువురు ధ్వజమెత్తారు. స్వామి మృతిపై ఐరోపా సమాజ మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి ఎమాన్ గిల్మోర్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల వ్యవహారాల ప్రత్యేక రిపోర్టర్ మేరీ లావ్లర్‌తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ, సీపీఐ(ఎం.ఎల్) నేతలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఆదివాసీయులు, దళితులు, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజల అభ్యున్నతి కోసం స్టాన్ స్వామి జీవితాంతం కృషి చేశారని రోమన్ కాథలిక్కులకు చెందిన జెసూట్ ప్రొవిన్షియల్ నివాళులర్పించింది.
ఎవరీ స్టాన్ స్వామి?
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన స్టాన్ స్వామి రోమన్ కాథలిక్ (క్రైస్తవ) మతాచార్యుడు. ఇండియన్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ అనే ప్రభుత్వేతర సంస్థకు 1975-1986 మధ్య కాలంలో డైరెక్టర్‌గా కొనసాగారు. అనంతరం ఝార్ఖండ్‌కు వచ్చి 30 ఏళ్లకు పైగా గిరిజనుల అటవీ, భూమి హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. వందల మంది ఆదివాసి ప్రజలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆరోపిస్తూ న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన పిటిషన్లు దాఖలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)ను నిరసిస్తూ తుదిశ్వాస విడిచే వరకూ పోరాడారు.
ఎన్‌ఐఏ ఆరోపణలు ఏమిటంటే..
మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరి 1న చోటుచేసుకున్న ఘర్షణల వెనుక మావోయిస్టుల కుట్ర ఉందన్నది ఎన్‌ఐఏ ప్రధాన ఆరోపణ. అంతకు ఒక్క రోజు ముందు (2017 డిసెంబరు 31న) పుణెలో నిర్వహించిన ఎల్గార్ పరిషద్ సమావేశంలో పాల్గొన్న వక్తల ప్రసంగాలే హింసాత్మక ఘటనలకు కారణమంటూ ఎన్‌ఐఏ ఇప్పటి వరకూ 16 మందిని అరెస్టు చేసింది. ఉపా కింద అరెస్టు అయిన వారిలో స్టాన్ స్వామి, వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ టేల్‌తుంబ్డే, సురేంద్ర గాడ్లింగ్, హానీబాబు తదితరులు నిందితులు. వీరిలో వరవరరావు(81) ఒక్కరికే అనారోగ్య కారణాలతో బెయిల్ లభించింది.
తుది వరకూ లభించని బెయిల్..
స్టాన్ స్వామిని 2020 అక్టోబరు 8న రాంచీలో అదుపులోకి తీసుకొన్న ఎన్‌ఐఏ ముంబయికి తరలించింది. అప్పటి నుంచి తలోజా జైలులోనే ఉన్న హక్కుల నేత మే నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నించినా దర్యాప్తు సంస్థ అభ్యంతరాలతో మంజూరు కాలేదు. తన ప్రాణాలు జైలులోనే పోయేటట్లున్నాయని వీడియో విచారణ సమయంలో కోర్టుకు తెలిపారు. చివరిగా శుక్రవారం కూడా బెయిల్ పిటిషన్ బాంబే హైకోర్టు ధర్మాసనం ముందుకు రాగా విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఆ విచారణ కొనసాగుతుండగానే మరణ వార్త న్యాయస్థానానికి చేరింది.
‘స్టాన్ స్వామిది ప్రభుత్వ హత్యే’
ఈనాడు, హైదరాబాద్: ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన స్టాన్ స్వామిది ప్రభుత్వం చేసిన హత్యేనని సీపీఐఎంల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు పోటు రంగారావు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భీమా కోరేగావ్ కేసులో 9 నెలల క్రితం ఆయనను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారని, 90 ఏళ్ల వృద్ధుడైన స్వామికి జైల్లో కరోనా సోకినా బెయిల్ రాకుండా ఎన్‌ఐఏ అడ్డుకుందని, కరోనా తదనంతర సమస్యలతో సోమవారం ఆయన చనిపోయారన్నారు. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని రంగారావు అన్నారు.
Tags :