Updated : 14/06/2021 11:25 IST
పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు: ఎల్.రమణ
జగిత్యాల: రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పులు వస్తున్నాయని తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. పార్టీలు ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటాయని.. ఈ నేపథ్యంలో తెరాస, భాజపాలు తనను ఆహ్వానించాయని చెప్పారు. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బలహీనవర్గాల బిడ్డగా తొలినాళ్ల నుంచే తెదేపా అభివృద్ధికి కృషి చేశానన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు తనను ప్రోత్సహించారని చెప్పారు. తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశానని.. ఎంపీగానూ అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు. ప్రజల్లో తెదేపా గౌరవం పెరిగేలా సిద్ధాంతాలను పాటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేశామన్నారు.
ఇప్పుడు తాను పదవుల కోసం ప్రతిపాదనలు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని.. వాటిని ఖండిస్తున్నట్లు రమణ స్పష్టం చేశారు. తెరాస, భాజపాలు తనకు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని.. తాను కూడా వారికి ఏమీ చెప్పలేదని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని చెప్పారు. పార్టీ కోసం పనిచేస్తూ ఆ క్రమంలో ఇచ్చే బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ముందుకెళ్తుంటానని తెలిపారు. ప్రజా జీవితంలో మరింత ముందుకెళ్లే విధంగా మంచి నిర్ణయంతో రావాలని పలువురు కోరుతున్నారన్నారు. రెండు పార్టీల ఆహ్వానంపై స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చిస్తున్నానని.. ఆ తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని రమణ చెప్పారు.
ఇవీ చదవండి