గెలుపు... మీదీ నాదీ!
కెరియర్ ఉన్నతికి జీవన నైపుణ్యాలు
విన్-విన్ రిలేషన్లు
విలువైన జీవన నైపుణ్యాలను సముపార్జించడం చాలా ముఖ్యం. దీనితోపాటు పరస్పర గెలుపు సంబంధాలు (విన్-విన్ రిలేషన్స్) ఏర్పరచుకోవాలి. ఇలా చేయగలిగితే మనకు కెరియర్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ విజయాలు వరిస్తాయి!
కార్పొరేట్ ఆఫీస్ లంచ్ హాల్‌లో బ్లాక్ చెయిన్ టీమ్ అంతా మధ్యాహ్న భోజనానికి కూర్చుకున్నారు. అది ఆరుగురు సభ్యులున్న బృందం. అందరూ ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్‌లు తెరిచారు. తమ బృందంలో నలుగురు లంచ్ బాక్స్‌ల లోపల చూసి నిరాశగా ముఖాలు పెట్టడాన్ని శశాంక్ గమనించాడు. ఆ నలుగురు కొలీగ్స్‌కి తమ ఇంటి నుంచి ఆ రోజు వచ్చిన మెనూ నచ్చలేదు. లంచ్ బాక్స్‌లు మూసేసి కెఫెటేరియాకు వెళ్దామనుకున్న ఆ నలుగురినీ శశాంక్ కాస్త ఆగమన్నట్టు సైగ చేశాడు. నలుగురికీ ఏమేమి ఇష్టమో కనుక్కొని... వాళ్ల బాక్స్‌లు పరిశీలించాడు. ఆపై కొద్దిసేపు ఆలోచించి ఒకరి బాక్స్ మరొకరికి మార్చి వాళ్ల ముందు నెట్టాడు. ఇప్పుడు వాళ్ల ముఖాలు విప్పారాయి. ఇష్టమైన వంటకాలు కళ్ల ముందు కనిపించేసరికి ఆవురావురుమంటూ తినేశారు.
నిజానికి శశాంక్ పెద్ద కష్టపడిందేమీ లేదు. ఒకరి లంచ్‌బాక్స్‌ను మరొకరికి మార్చాడు. వారికి ఇష్టమైన వంటకాల రీత్యా మార్చడం వల్ల ఎవరికివారు ఆనందం పొందగలిగారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సీనియర్ మేనేజర్ ఒకరు శశాంక్‌లోని విన్-విన్ దృక్పథాన్ని అభినందించారు. కంపెనీలకు ఈ రకమైన దృక్పథం ఎంతో అవసరమని మెచ్చుకున్నారు.
కెరియర్ ఉన్నతికి దోహదపడే పరస్పర గెలుపు దృష్టి సామర్థ్యాన్ని సాధనతో పెంపొందించుకునేందుకు మార్గాలున్నాయి.
*
ఇతరుల దృష్టి నుంచి చూడటం: ఏ విషయాన్నయినా సాధారణంగా మన దృష్టి నుంచే చూస్తాం. మనమేదైనా కోరుకుంటే అది మనకు దక్కితే చాలనుకుంటాం. ఇది మానవ స్వభావం. ఇది కాకుండా మనతోపాటు దానిని ఆశిస్తున్న ఇతరులకూ సొంతం కావాలన్న దృష్టిని అలవరచుకోగలిగితే ఇక అన్నీ మారిపోతాయి.
*
ఇతరుల భావోద్వేగాలను గుర్తించడం: ఏ విషయంలోనైనా సరే మన చట్టూ ఉన్నవారి భావోద్వేగాలను గుర్తించడం మొదలుపెట్టాలి. మనకు భోజన సమయమైతే మనతో ఉన్న వారికీ ఆకలి అవుతుంది. మనకు నిద్ర సమయమైతే మన చుట్టూ ఉన్నవారు కూడా అదే స్థితిలో ఉంటారన్న నిజాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించడం అలవర్చుకోవాలి.
*
స్వార్థపూరిత ఆలోచనను అధిగమించడం: సహజసిద్ధంగా మనకు వచ్చిన స్వార్థపూరిత ఆలోచనను వదిలించుకోవడం కోసం తగిన మానసిక కసరత్తును నిరంతరం చేయాలి. ఇది అంత త్వరగా వదిలేది కాదు. ఒకసారి స్వార్థాన్ని వదలి ఇతరులకు మేలు చేసినందుకు వారు చూపే కృతజ్ఞతను ఆస్వాదిస్తే చాలు. ఆపై నిస్వార్థ్ధంగా ఉండటాన్ని అలవాటు చేసుకుంటాం.
*
జీవితం పట్ల విశాల దృక్పథం: కెరియర్ అన్వేషణలో ఉన్నా...దానిలో కొత్తగా ప్రవేశించినా జీవితం పట్ల విశాల దృక్పథం ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి. దీని కోసం మంచి పుస్తకాలు, ప్రముఖుల ఉపన్యాసాలు ఉపకరిస్తాయి. జీవితాన్ని హ్రస్వ దృష్టితో చూస్తున్నప్పుడు అన్నీ స్వార్థపూరితంగా అనిపిస్తాయి. అదే విశాల దృక్పథంతో వీక్షిస్తే మనతోపాటుగా అందరినీ కలుపుకోవాలన్న ఆకాంక్ష మొలకెత్తుతుంది.
*
తోటివారిలో సంతోషం: మనం నిరంతరం మసలే వారిలో సంతోషం చూడాలన్న దృష్టి అంతర్లీనంగా ఏర్పరచుకుంటే సంబంధాలలో నాణ్యత పెరుగుతుంది. ఎదుటివారి కోసం మీరు ఆరాటపడుతున్నారన్న భావన వారిలో మీ పట్ల కొత్త భావాలను ఏర్పరుస్తుంది. బంధం దృఢమవుతుంది.
మానవ సంబంధాలు ఎన్ని రకాలు?
* ర నేను గెలవాలి - నువ్వు ఓడాలి: ఎక్కువగా అన్ని జీవన పార్శ్వాల్లోనూ తటస్థపడే ఆలోచన ఇది. నువ్వేమైనా సరే... నేను గెలిచి తీరాలి అన్న ధోరణి.
*
నేను ఓడినా నువ్వు గెలవాలి: చాలా అరుదుగా బహుశా సినిమాలు, నవలల్లో మాత్రమే తారసపడే సందర్భం. నేను చతికిలపడినా సరే, నువ్వు పరుగెత్తాలి అన్న దృక్పథం.
*
నేనూ నువ్వూ ఇద్దరం నాశనమైపోదాం: ఇదొక ప్రమాదకరమైన ధోరణి. నేను ఓడిపోతా. నాతోపాటే నువ్వూ ఓడిపోవాలన్న ఆలోచన.
* గెలుపే లక్ష్యం: గెలుపే తప్ప పర్యవసానాలపై దృష్టిలేని ఆలోచన. వారికి గెలుపే లక్ష్యం. ఆపై ఏం జరుగుతుందో, ఎంత అనర్థం జరుగుతుందో వారికి అనవసరం.
*
ఇద్దరి గెలుపు లేదా వద్దు: ఎక్కువగా వ్యాపార ఒప్పందాల్లో ఈ ధోరణిని చూడవచ్చు. పరస్పర ప్రయోజనాలుంటేనే కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. లేదా ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటారు.
*
అందరం గెలుద్దాం: ఇదొక విశిష్ట దృక్పథం. దీన్ని పెంపొందించుకుంటే కంపెనీలో ఉద్యోగిగా, జీవితంలో అన్ని సందర్భాల్లోనూ ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలవొచ్చు. అందరికీ ఇష్టుడిగా మారి ఊహించని విజయాలు, ఆనందాలను సొంతం చేసుకోవచ్చు.
ఏమిటీ దృక్పథం?
ముందువాడిని తోసేసి తాను ముందు నిలవాలని మనిషి తహతహలాడ తాడు. అవసరమైతే పదిమందిని తొక్కేసైనా తనకు కావలసింది దక్కించుకోవాలని చూస్తుంటాడు. అర్హతలు, అధికారం, అంతస్తు, అన్నీ కూడా పోటీ ద్వారానే సంప్రాప్తిస్తాయి. కాబట్టి మనిషి అవసరమైతే దేనికైనా తెగించేందుకు సిద్ధపడుతుంటాడు.
అయితే సంస్థలకు కావలసింది ఉద్యోగుల మధ్య సహకారమే తప్ప పోటీ పేరుతో స్పర్థలు కాదు. ఆనారోగ్యకర పోటీ పెరిగిన కొద్దీ సంస్థలు అథఃపాతాళానికి వెళ్లిపోతాయి. అందుకే ఒకరు గెలవడం, మరొకరు ఓడటం స్థానంలో పరస్పర సహకారంతో తాను గెలుస్తూ తోటివారినీ గెలిపించగలవాడే కంపెనీలకు తరగని ఆస్తి. సంస్థలు అటువంటి దృక్పథం ఉన్నవారి కోసం అన్వేషిస్తాయి. లేదా ఈ సామర్థ్యం పెంపొందించేందుకు ఆసక్తి చూపుతాయి. అందుకే విన్-విన్ విజయ సూత్రంగా నిలిచింది.
గెలిచారు-గెలిపించారు
‘నువ్వు గెలువు - నేనూ గెలుస్తా. ఇద్దరం గెలుద్దాం’ అనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల ఉపయోగం ఏమిటంటే... ఈ తరహా వ్యక్తులు తాము గెలవడమే కాదు.. చుట్టూ ఉన్నవారిని గెలిపిస్తూ కొత్త దారులకు పునాదులేస్తారు.
*
కె.వి.కె. రాజు: నాగార్జున గ్రూపు అధినేత. కాకినాడ దగ్గర అతిపెద్ద ఎరువుల ఫ్యాక్టరీని నెలకొల్పే సమయంలో గొప్ప ఆలోచన చేశారు. అదే తెలుగునాట సాధారణ రైతాంగం కేపిటల్ మార్కెట్ పెట్టుబడులలోకి అడుగిడేందుకు దోహదం చేసింది. ఎరువులు కొనుగోలు చేసే రైతులను కేవలం కొనుగోలుదారులుగా చూడకుండా వారిని పెట్టుబడిలో భాగస్వాములను చేసి లాభాల ఫలాలు వారికే చెందాలన్న ఆయన పరస్పర విజయ ఆలోచన... కర్షకుల పెట్టుబడి సంస్కృతికి దారితీసింది.
* బి.వి. రావు: కోళ్ల వ్యాపారం (పౌల్ట్రీ) చేయాలనే ఉద్దేశంతో వెంకటేశ్వర హ్యాచరీస్‌ని స్థాపించిన పద్మశ్రీ బి.వి.రావు సాధారణ వ్యాపారవేత్తగానే మిగిలిపోలేదు. పెరటి వ్యాపారంగా ఉన్న కోళ్ల పెంపకాన్ని వ్యాపారంగా మార్చే క్రమంలో లక్షలాది చిన్నకారు రైతులకూ ప్రయోజనం చేకూర్చాలన్న లక్ష్యంతో గ్రామ గ్రామానికీ తిరిగారు. పౌల్ట్రీ పరిశ్రమకు పునాదులు వేశారు. చిన్నకారు రైతుల గెలుపులో తన గెలుపును కలుపుకున్నారు. కాబట్టే ఆయన భారతదేశ పౌల్ట్ర్టీ పితామహుడిగా గుర్తుండిపోయారు.
Tags :