బుమ్రా క్లీన్‌బౌల్డ్.. ఎందుకయ్యాడు?
మన యార్కర్ల వీరుడు బుమ్రా మనసు కొల్లగొట్టిన సంజన... గురించే ఇప్పుడు చర్చంతా. వ్యాఖ్యాతగా, టెలివిజన్ హోస్ట్‌గా మాటలతో మురిపించిన ఆమె కథ తెలుసుకోవాలనే ఆరాటమే అందరికీ... ఎవరీ అమ్మాయి? అంతలా ఏముంది తనలో అని మీరూ అనుకుంటున్నారా? అయితే ఈ ఆసక్తికర విషయాలు మీకోసమే.
సంజన స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వ్యాఖ్యాత, హోస్ట్. ఆమెకు అన్ని క్రీడల్లోనూ మంచి పట్టుంది. పలు ఐపీఎల్ సీజన్లకి హోస్ట్‌గా వ్యవహరించింది. మైదానాల్లోకి దిగి ఆటగాళ్లతో మాట కలిపే కొద్దిమందిలో సంజన ఒకరు. ఐపీఎల్ వేలం సమయంలో తన వ్యాఖ్యానంతో ఆకట్టుకుంది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్, ఇండియా సూపర్ వీక్ ఫుట్‌బాల్.. సందర్భాల్లోనూ సంజన సందడి షురూ చేస్తుంది. ఆ చలాకీతనమే బుమ్రా మనసు దోచేలా చేసింది.
అందాల భరిణె...
కొద్దిలో మిస్ ఇండియా కిరీటం మిస్ చేసుకుంది. అది ఆమె చిన్ననాటి కల. అందాల పోటీల్లో పాల్గొన్న తర్వాత జనాలకు కొద్దిగా పరిచయమైనా వెలుగులోకి వచ్చింది మాత్రం ఎంటీవీ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా 7 సీజన్‌లోనే. చేతికి గాయం కావడంతో షో నుంచి అర్థంతరంగా నిష్క్రమించినా ఉన్న కొద్దిరోజుల్లోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ప్రపంచకప్‌తో పైపైకి...
2019 క్రికెట్ వరల్డ్ కప్‌తో సంజన స్టార్ ప్రెజెంటర్ అయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించే ‘మ్యాచ్ పాయింట్’, ‘చీకీ సింగిల్స్’ కార్యక్రమాలు తన చలోక్తులతో పేలిపోయేవి. క్రికెట్ పండితులంతా తనని ‘బ్యూటీ విత్ మైండ్’ అని పొగిడేవాళ్లు.
చదువులో మెరిట్..
సంజన పుణె అమ్మాయి. అక్కడే పుట్టిపెరిగింది. మొదట్నుంచీ చదువుల్లో బాగా చురుకైన అమ్మాయి సంజన. సింబయాసిస్ నుంచి ఇంజినీరింగ్‌లో గోల్డ్ మెడల్ అందుకుంది. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసింది. కాలేజీలో ఉండగానే ఎప్పటికైనా నేను మిస్ ఇండియా అవుతానని స్నేహితులతో చెప్పేది. దానికి అనుగుణంగానే కాలేజీ పూర్తవగానే నడక, నడత, వ్యాయామం, ఆహారం అన్నింట్లో జాగ్రత్తలు తీసుకునేది. ఏడాదిపాటు ఉద్యోగం చేశాక ముంబయికి మకాం మార్చి మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఈ సంగతులన్నీ చెబుతూ వాషీ టెడెక్స్‌లో స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చింది.
అలా మొదలైంది...
బుమ్రా, సంజనా ప్రేమకథ విషయానికొస్తే వీళ్ల రొమాన్స్ క్రికెట్ మైదానంలోనే మొదలైందంటారు. సంజనా అప్పుడప్పుడే క్రీడా వ్యాఖ్యాతగా కెరీర్ మొదలుపెట్టింది. 2013-2014 ఐపీఎల్ సీజన్‌లో అతడిని ఇంటర్వ్యూ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం మొదలైంది. కొన్నాళ్లకే మంచి స్నేహితులయ్యారు. కెరీర్, ఫేమ్‌తోపాటు ఇద్దరి మధ్య ప్రేమ కూడా వేగం అందుకుంది. అవార్డుల కార్యక్రమం ‘నమన్’తో మరింత దగ్గరయ్యారు. పార్టీలు, చాటుమాటుగా కలుసుకోవడాలు మామూలయ్యాయి. ఎట్టకేలకు పెద్దల ఆమోదంతో ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు.