వాసన్ ఐకేర్‌కు మ్యాక్సివిజన్ బిడ్ దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రగామి కావడమే లక్ష్యం ‘ఈనాడు’ తో డాక్టర్ జీఎస్‌కే వేలు ఈనాడు, హైదరాబాద్: నేత్ర వైద్య సేవల్లో నిమగ్నమైన మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూపు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని వివిధ నగరాలు/ పట్టణాల్లో మాక్సివిజన్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని, తదుపరి దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని మాక్సివిజన్ గ్రూపు ఛైర్మన్ డాక్టర్ జీఎస్‌కే వేలు ‘ఈనాడు’కు వివరించారు. ఇందుకు దశల వారీగా రూ.200 - 300 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. మ్యాక్సివిజన్ గ్రూపులో వైద్య పరికరాలు ఉత్పత్తి చేసే ట్రివిట్రాన్ హెల్త్‌కేర్, డయాగ్నోస్టిక్స్ సేవల్లో నిమగ్నమైన న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి. మ్యాక్సివిజన్ గ్రూపునకు ఏపీ, తెలంగాణాలో ప్రస్తుతం 17 ఆసుపత్రులు ఉన్నాయి. ఏడాది లోగా ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం తదితర 10 నగరాల్లో కొత్త ఆసుపత్రులు ప్రారంభించనున్నట్లు డాక్టర్ జీఎస్‌కే వేలు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆస్పత్రి నెలకొల్పాలనేది తమ ప్రణాళికగా చెప్పారు. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో నేత్ర వైద్యసేవల విభాగంలో అగ్రగామిగా నిలవాలనేది తమ ఉద్దేశమని వివరించారు. విస్తరణకు అవసరమైన నిధులను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ పద్దతిలో వివిధ సంస్థల సుంచి సమీకరిస్తామని అన్నారు. నిధుల కోసం తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కు వెళ్లే అంశాన్ని రెండేళ్ల తర్వాత పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం దక్షిణాదిలో, పశ్చిమ రాష్ట్రాల్లో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలుండగా, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్-19 ఉద్ధృతి సమయంలో ఎక్కువ మంది తమ చికిత్సను వాయిదా వేసుకున్నారని, మళ్లీ ఇప్పుడు నేత్ర చికిత్సలకు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని అన్నారు. తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన వాసన్ ఐకేర్‌ను మాక్సివిజన్ గ్రూపు సొంతం చేసుకోబోతోందనే వార్తలపై స్పందిస్తూ, దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు (ఈఓఐ) దాఖలు చేసినట్లు చెప్పారు. ‘వాసన్ ఐకేర్ వ్యవహారం ఎన్‌సీఎల్‌టీ పరిశీలనలో ఉంది. తొలుత దీనిపై మేం ఆసక్తి చూపలేదు. కానీ పరిస్థితులను విశ్లేషించి ఇప్పుడు ముందుకు వచ్చాం. దీనికోసం బిడ్లు దాఖలు చేశాం’ అన్నారాయన. దక్షిణాది రాష్ట్రాల్లో మరింతగా విస్తరించడానికి వాసన్ ఐకేర్ వీలుకల్పిస్తుంది కానీ ఈ విషయంలో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. Tags :