అంతర్లీనంగా సానుకూలతలు ఒక శ్రేణికి లోబడే కదలికలు అమెరికా ఫెడ్ సమావేశం కీలకం ఐటీ, సిమెంటు షేర్లు రాణించొచ్చు విశ్లేషకుల అంచనాలు స్టాక్ మార్కెట్ ఈ వారం దేశీయ సూచీలు ఈ వారం ఒక శ్రేణికి లోబడి చలించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నుంచి మొదలయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమావేశం నుంచి వెలువడే నిర్ణయాల కోసం మదుపర్లు ఆసక్తిగా ఎదురు చూస్తారు. గత వారాంతంలో వెలువడ్డ రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ ఆర్థిక ఫలితాలు నేటి మార్కెట్‌పై ప్రభావం చూపించవచ్చు. అంతర్లీనంగా సెంటిమెంటు సానుకూలంగానే ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. నిఫ్టీ ఈ వారం 15,950 పైన కొనసాగితే మరిన్ని లాభాలకు అవకాశం ఉందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద 15,600-16,000 మధ్య ట్రేడవవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ బ్యాంక్ 35,000 పైన కొనసాగడం అత్యంత కీలకమని అంటున్నారు. ఈ వారంలో వెల్లడయ్యే యాక్సిస్ బ్యాంక్, డీఎల్‌ఎఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ లైఫ్, టాటా మోటార్స్ ఫలితాలను మదుపర్లు గమనించవచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.. * లోహ, గనుల రంగ షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు. సోమవారం ఫలితాలను వెల్లడించే వేదాంతాపై మదుపర్ల దృష్టి ఉండొచ్చు. గత శుక్రవారం మెరుగైన ఫలితాలను ప్రకటించిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సైతం వెలుగులోకి రావొచ్చు. * మదుపర్లు ముందు జాగ్రత్తగా తమ పెట్టుబడులను రొటేట్ చేస్తున్న నేపథ్యంలో ఔషధ షేర్లలో ట్రేడింగ్ చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించవచ్చు. అధిక విలువ ఔషధాలైన ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్స్ తయారీ సంస్థల షేర్లు రాణించవచ్చు. గ్లెన్‌మార్క్ లైఫ్ ఐపీఓ వైపూ కొన్ని నిధులు మళ్లొచ్చు. * శనివారం వెలువడిన ఐసీఐసీఐ బ్యాంక్, నేడు వెలువడే యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్; రేపు వెల్లడయ్యే ఇండస్ ఇండ్ ఫలితాల ఆధారంగా బ్యాంకు షేర్లు కదలాడవచ్చు. కరోనా మలి విడత కారణంగా బ్యాంకుల ఆస్తుల నాణ్యత దెబ్బతిన్నా.. ప్రైవేటు బ్యాంకులు ముందుగా కేటాయింపులు జరపడం వల్ల ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. * ఐటీ కంపెనీల షేర్లు వరుసగా మూడో వారమూ సానుకూలంగా చలించొచ్చు. ఇప్పటిదాకా వెల్లడైన జూన్ త్రైమాసిక ఫలితాలు చూస్తే గిరాకీ బలంగా ఉండబోతోందని వెల్లడవుతోంది. టెక్ మహీంద్రా, హాప్పియెస్ట్ మైండ్స్, కేపీఐటీ టెక్నాలజీస్ ఈ వారం ఫలితాలను ప్రకటించనున్నాయి. * టాటా మోటార్స్(సోమ), మారుతీ సుజుకీ(బుధ) ఫలితాల ఆధారంగా వాహన కంపెనీల షేర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. టాటా మోటార్స్ రూ.1310 కోట్ల నికర నష్టాన్ని; మారుతీ సుజుకీ రూ.830 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చనే అంచనాలున్నాయి. గిరాకీపై ఆయా కంపెనీల యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. * సిమెంటు కంపెనీల షేర్లు సానుకూలంగా చలించవచ్చు. మార్కెట్ అంచనాలను మించి అంబుజా సిమెంట్స్ ఫలితాలు వెలువడడం ఇందుకు నేపథ్యం. ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ ఫలితాలు దిశానిర్దేశం చేయొచ్చు. మంగళవారం దాల్మియా భారత్ ఇచ్చే ఫలితాలనూ మదుపర్లు గమనించొచ్చు. * ఎంపిక చేసిన టెలికాం కంపెనీల షేర్లలో కదలికలు కనిపించొచ్చు. శుక్రవారం మార్కెట్ అనంతరం ప్రకటించిన ఫలితాల్లో రిలయన్స్ జియో రాణించడంతో ఆ ప్రభావం ఆర్‌ఐఎల్ షేర్లపై కనిపించొచ్చు. కొద్ది త్రైమాసికాలుగా వినియోగదార్ల విషయంలో రాణిస్తున్న భారతీ ఎయిర్‌టెల్ షేర్లు రాణించొచ్చు. వొడాఫోన్ ఐడియా స్తబ్దుగా కనిపించొచ్చు. * యంత్ర పరికరాల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. నేడు ఎల్ అండ్ టీ వెలువరించే ఏప్రిల్-జూన్ ఫలితాలపై మార్కెట్ వర్గాలు కన్నేయవచ్చు. * ఆర్‌ఐఎల్ ఫలితాల ప్రభావం చమురు షేర్లపై కనిపించొచ్చు. అంతర్లీనంగా ప్రతికూల ధోరణితో మొత్తం మీద చమురు షేర్లు ఈ వారం స్థిరీకరణకు గురి కావొచ్చు. రిఫైనరీలతో పోలిస్తే అప్‌స్ట్రీమ్ కంపెనీలు రాణించొచ్చు. Tags :