అగ్రస్థానంలో తెలంగాణ పోలీసులు హోం మంత్రి మహమూద్ అలీ మాదాపూర్, న్యూస్‌టుడే: పోలీసులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ఉన్నతమైన సేవలందించేలా ఆ శాఖను ఆధునికీకరించడానికి, పటిష్ఠపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. పోలీసు సేవలను మరింత మెరుగుపర్చాలనే ఉద్దేశంతో రాచకొండ, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్ కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం కొండాపూర్‌లోని టీఎస్‌ఎస్‌పీ 8వ పోలీసు పటాలంలో 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసిన 466 మంది కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహమూద్ అలీ కానిస్టేబుళ్ల కవాతును తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన పనితీరుతో దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారన్నారు. రాజధాని హైదరాబాద్‌ను దేశంలోనే సురక్షితమైన నగరంగా రూపొందించారని తెలిపారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 331 షీ టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. 14 జిల్లాల్లో కొత్త ఎస్‌పీ కార్యాలయాల భవనాల నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. రామగుండం, రాచకొండ కమిషనరేట్ భవనాల నిర్మాణం పూర్తి కావచ్చాయన్నారు. శిక్షణ పూర్తిచేసుకొని పోలీసు విధుల్లో చేరుతున్న వారంతా బాధ్యతాయుతంగా, క్రమశిక్షణ, అంకితభావంతోపాటు నిజాయతీగా పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌పీ అడిషనల్ డీజీపీ అభిలాష్‌బిస్త్, డీఐజీ సిద్దిఖి, పోలీసుపటాలం కమాండెంట్ మురళీకృష్ణ, అడిషనల్ కమాండెంట్ గంగారం తదితరులున్నారు. Tags :