సౌహార్దమ

సౌహార్దమా.. కొత్త సమీకరణమా?


సౌహార్దమా.. కొత్త సమీకరణమా?
మోదీతో శరద్‌ పవార్‌ భేటీ..
రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ
ఈనాడు, దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ శనివారం దిల్లీలో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చను రేకెత్తించింది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే యత్నాల్లో పవార్‌ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తారనీ ఊహాగానాలు వినిపించాయి. అలాంటిదేమీ లేదని మరాఠ్వాడ నేత స్పష్టతనిచ్చినప్పటికీ.. ఇప్పుడు అనూహ్యంగా మోదీతో భేటీ కావడం ఆశ్చర్యం కలిగించింది.
ఒకవైపున మహారాష్ట్రలో కాంగ్రెస్‌-ఎన్‌సీపీ-శివసేన కూటమి(మహావికాస్‌ అఘాడీ-ఎంవీఏ) ప్రభుత్వ భాగస్వామ్య పక్షాల్లో కలతలు తీవ్రమవుతున్న పరిస్థితులు.. మరోవైపున కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌సీపీ నేతల లక్ష్యంగా దాడులు, కేసులను ముమ్మరం చేసిన నేపథ్యంలో రాజకీయ చతురుడైన పవార్‌ మదిలో ఏదో వ్యూహం దాగి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇద్దరు నేతల సమావేశం వెనుక రాజకీయాలేమీ లేవని, కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ గురించే వారు చర్చించారని ఎన్‌సీపీ నాయకుడు ఒకరు తెలిపారు. మహారాష్ట్రలోని చక్కెర సహకార సంఘాలపై పవార్‌కు, ఎన్‌సీపీ నాయకులకు గట్టి పట్టున్న విషయం తెలిసిందే. ఈ సంఘాల ద్వారా భారీగా రుణాలు తీసుకొని చెల్లించలేదనే ఆరోపణలతో ఎన్‌సీపీ ముఖ్యనేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సమీప బంధువులపై కేసులు నమోదయ్యాయి. బకాయిల చెల్లింపుల కోసం ఎన్‌సీపీ నేతలపై ఒత్తిడి అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండే సహకార శాఖను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేయడం, దానిని అమిత్‌ షాకు అదనంగా అప్పగించడం కూడా ప్రధానితో భేటీకి తక్షణ కారణమై ఉండవచ్చన్నది రాజకీయ పండితుల అంచనా. మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు అనిల్‌ దేశ్‌పాండే, ఆ పార్టీకే చెందిన మరో నాయకుడు ఏక్‌నాథ్‌ ఖడ్సేలపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భాజపా నేతలతో తమ సంబంధాలను మెరుగుపరచుకొనేందుకు శరద్‌ పవార్‌ యత్నిస్తున్నారేమోననే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దిల్లీలో సుమారు గంట పాటు కొనసాగిన తమ భేటీపై నేతలిద్దరూ విడివిడిగా ట్వీట్‌ చేశారు. ఇద్దరు నేతల చిత్రాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్‌లో పోస్ట్‌ చేసినప్పటికీ వివరాలను పేర్కొనలేదు. శరద్‌ పవార్‌ తన ట్వీట్‌లో...‘దేశానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించి’నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీకి పవార్‌ రాసిన ఒక లేఖను కూడా ఎన్‌సీపీ విడుదల చేసింది. భాజపాతో సఖ్యతకు తాము ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఎన్‌సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ తోసిపుచ్చారు. మహారాష్ట్ర భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌తోనూ దిల్లీలో పవార్‌ భేటీ అయ్యారన్న వార్తలను ఖండించారు.
Tags :

Related Keywords

Dilli , Delhi , India , , Ministry The Department , Ministry Branch , Maharashtra Alliance , India Office , Central Farm The Department , Prime Minister , India Narendra Modi , Maharashtra Sub , Central Farm , Prime Minister Modi , Maharashtra Minister , டில்லி , டெல்ஹி , இந்தியா , அமைச்சகம் கிளை , மகாராஷ்டிரா கூட்டணி , இந்தியா அலுவலகம் , ப்ரைம் அமைச்சர் , இந்தியா நரேந்திர மோடி , மைய பண்ணை , ப்ரைம் அமைச்சர் மோடி , மகாராஷ்டிரா அமைச்சர் ,

© 2025 Vimarsana