మిజోరం గవర్నర్‌గా హరిబాబు మిజోరం ప్రథమ పౌరుడిగా నియమించిన కేంద్రం హరియాణాకు దత్తాత్రేయ బదిలీ 8 రాష్ట్రాలకు గవర్నర్లు ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇందులో నలుగుర్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయగా, మరో నలుగురికి కొత్తగా అవకాశం కల్పించింది. విశాఖపట్నం మాజీ ఎంపీ, భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమించింది. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హరియాణాకు బదిలీ చేసింది. ఏకకాలంలో ఇద్దరు తెలుగు నేతలు రాజకీయంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు గవర్నర్ వ్యవస్థలో తెలంగాణకు ప్రాతినిధ్యం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు లేకపోవడంతో ఆ లోటును భర్తీచేయడానికి కంభంపాటి హరిబాబుకు ఈసారి అవకాశం కల్పించినట్లు అంచనా. ఒకే ప్రభుత్వంలో ఇద్దరు తెలుగు వ్యక్తులు రెండు రాష్ట్రాలకు ఏకకాలంలో గవర్నర్లుగా బాధ్యతలు చేపట్టబోతుండటం బహుశా ఇదే తొలిసారి. గతంలో కొణిజేటి రోశయ్య, సిహెచ్.విద్యాసాగర్‌రావు ఏకకాలంలో వేర్వేరు రాష్ట్రాలకు గవర్నర్లుగా సేవలందించారు. అయితే రోశయ్య యూపీఏ హయాంలో, విద్యాసాగర్‌రావు ఎన్డీయే సర్కారులో నియమితులయ్యారు. రోశయ్య తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కంభంపాటి హరిబాబుకు గవర్నర్‌గా అవకాశం దక్కింది. ఎన్డీయే-1 ప్రభుత్వం చివరిసారి చేసిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కుతుందని అందరూ భావించారు. చివరికి అవకాశం రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన హుందాగా వ్యవహరించి పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం- ఎన్డీయే మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేంద్రం నుంచి ఆ రాష్ట్రానికి వాటిల్లిన ప్రయోజనాల గురించి బలమైన వాదన వినిపించి, పార్టీ పట్ల విధేయత చాటుకున్నారు. తొలినుంచి ప్రతి అంశంలో పార్టీ మాట జవదాటని తత్వం ఆయనకు మరోసారి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ నుంచి హరియాణాకు గవర్నర్‌గా బదిలీ కావడం ఆయనను దిల్లీకి మరింత దగ్గర చేయనుంది. కేబినెట్ మంత్రి నుంచి గవర్నర్‌గా కేంద్ర మంత్రివర్గ విస్తరణను దృష్టిలో ఉంచుకొని భాజపాలో అత్యంత సీనియర్ దళిత నాయకుడు, రాజ్యసభాపక్ష నేత అయిన థావర్‌చంద్ గహ్లోత్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. ఆయన వయసు 75 ఏళ్లకు సమీపించడంతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పించారు. పనితీరు అనుకున్నంత స్థాయిలో లేకపోవడమూ దీనికి ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్ని వర్గాలకు పెద్దపీట గవర్నర్ల నియామకంలో ప్రభుత్వం అన్ని కోణాలనూ దృష్టిలో పెట్టుకుంది. వివిధ రాష్ట్రాలకు, సామాజిక వర్గాలకు చోటు కల్పించేందుకు ప్రయత్నించింది. గతంలో ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంతమంది మహిళా గవర్నర్లు మోదీ హయాంలో వచ్చినట్లు భాజపా వర్గాలు పేర్కొన్నాయి. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆరుగురు మహిళలు గవర్నర్లుగా చేస్తే మోదీ హయాంలో 8 మందికి ఆ గౌరవం దక్కినట్లు తెలిపాయి. గవర్నర్ల నియామకంపై రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. Tags :