సంచైత నియామకం చెల్లదు

Card image cap


ప్రధానాంశాలు
AP High Court: సంచైత నియామకం చెల్లదు
మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల రద్దు
సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా నియామకమూ సరికాదు
హైకోర్టు కీలక తీర్పు
మాన్సాస్‌ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు పునరుద్ధరణ
ఈనాడు, అమరావతి: మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని స్పష్టం చేసింది. ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచైత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను గుర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మరో జీవోనూ రద్దు చేసింది. సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీవోనూ హైకోర్టు కొట్టేసింది. మొత్తం నాలుగు జీవోలను (71, 72, 73, 74) రద్దు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, ట్రస్టు పూర్వ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ట్రస్టీ/ ఛైర్మన్‌గా పునరుద్ధరించింది. ఆయన నియామకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవోలను సమర్ధించింది. మాన్సాస్‌ ట్రస్టు.. ట్రస్టు డీడ్‌, ప్రాపర్టీ రిజిస్టర్‌ ప్రకారం ‘కుటుంబంలో పెద్దవారయిన పురుషులు’ వంశపారంపర్య ఛైర్మన్‌/అధ్యక్షులుగా వ్యవహరించాలని స్పష్టంగా ఉందని, అందువల్ల అశోక్‌గజపతిరాజే ట్రస్టు ఛైర్మన్‌గా ఉండాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు సంచైత నియామకాన్ని రద్దు చేస్తూ అశోక్‌గజపతిరాజు నియామకాన్ని పునరుద్ధరించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ ఈ మేరకు సోమవారం కీలక తీర్పు ఇచ్చారు. అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలను అనుమతిచ్చారు.
ఇదీ నేపథ్యం.. మాన్సాస్‌ ట్రస్టు ‘వ్యవస్థాపక కుటుంబ సభ్యులు’గా సంచైత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను నియమిస్తూ రెవెన్యూ (దేవాదాయ)శాఖ ముఖ్య కార్యదర్శి గతేడాది మార్చి 3న జీవో జారీ చేశారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ అదే రోజు మరో జీవో ఇచ్చారు. శ్రీ వరాహ లక్షీ¨్మనరసింహ స్వామివారి దేవస్థానం (సింహాచలం) వంశపారంపర్య ట్రస్టీ/ ఛైర్మన్‌గా సంచైతను నియమిస్తూ ఇంకొక జీవో వెలువరించారు. వాటిని సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్టు పూర్వ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు.
వీలునామాకు విరుద్ధంగా ప్రభుత్వ జీవోలు: అశోక్‌గజపతిరాజు తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. అలక్‌ నారాయణ్‌ గజపతి పేరు మీద అశోక్‌గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు మాన్సాస్‌ ట్రస్టును ఏర్పాటు చేశారన్నారు. 1958లో ట్రస్టు ఏర్పాటు సమయంలో రాసిన ట్రస్టు డీడ్‌, ప్రాపర్టీ రిజిస్టర్‌ (38 రిజిస్టర్‌) ప్రకారం ‘కుటుంబంలో పెద్దవారయిన పురుషులు’ వంశపారంపర్య ఛైర్మన్‌/అధ్యక్షులుగా వ్యవహరించాలని స్పష్టంగా ఉందని చెప్పారు. ట్రస్టుకు ఛైర్మన్‌గా మొదట పీవీజీ రాజు, 1995లో ఆయన మరణానంతరం కుటుంబంలో పెద్దవారైన ఆనందగజపతిరాజు (సంచైత, ఊర్మిళల తండ్రి) 2016 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారన్నారు. ఆనందగజపతిరాజు మరణం తర్వాత ఆయన సోదరుడైన అశోక్‌గజపతిరాజు ట్రస్టుకు అధ్యక్షులు/ఛైర్మన్‌గా కొనసాగుతున్నారని చెప్పారు. దస్తావేజుల్లో రాసుకున్న నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చిందన్నారు. వీలునామా నిబంధనలను తోసిపుచ్చుతూ ఆనందగజపతిరాజు కుమార్తె సంచైతను ట్రస్టు ఛైర్మన్‌గా నియమించిందని పేర్కొన్నారు. ట్రస్టుకు అధ్యక్షులుగా ఆనందగజపతిరాజు 21 సంవత్సరాలు కొనసాగినప్పుడు లేని అభ్యంతరాన్ని.. పిటిషనరు ఆ పదవిలో ఉండగా సంచైత లేవనెత్తడం సరికాదని తెలిపారు. ఛైర్మన్‌గా పురుషుల అనువంశికత కొనసాగింపును.. చట్ట నిబంధనల ప్రకారం ట్రైబ్యునల్‌ మాత్రమే మార్చగలదు తప్ప రాష్ట్ర ప్రభుత్వం మార్చడానికి వీల్లేదన్నారు. అప్పటి వరకు మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజుకు ముందస్తు నోటీసివ్వకుండా.. ఆయన స్థానంలో సంచైతను నియమిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందని, వాటిని రద్దు చేయాలని కోరారు.
ఆ అధికారం మాకుంది: ప్రభుత్వం: ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సంచైత తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సంచైతను ట్రస్టు ఛైర్మన్‌గా నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొత్త దేవాదాయ చట్ట నిబంధనల ప్రకారం వారసత్వ ట్రస్టీ అనేది రద్దయిందన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ తననే మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా కొనసాగించాలని కోరడానికి వీల్లేదన్నారు. మహిళల నియామకంలో వివక్ష తగదన్నారు. మరోవైపు.. సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ట్రస్టీ/ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపకులు పీవీజీ రాజు కుమార్తె, అశోక్‌గజపతిరాజు సోదరి ఆర్‌వీ సునీతా ప్రసాద్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్నీ న్యాయమూర్తి కొట్టేశారు.  
మరోసారి కోర్టుకెళతాం: మంత్రి వెలంపల్లి
ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. అక్కడ అక్రమంగా ఉన్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపరచుకుని, క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పును పరిశీలించాక అప్పీల్‌కు వెళతామన్నారు.వీరబ్రహ్మేంద్ర స్వామి మఠాధిపతి నియామకంలో దేవాదాయ చట్టప్రకారం ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారన్నారు.
న్యాయమే గెలిచింది
హైకోర్టు తీర్పుపై అశోక్‌గజపతిరాజు 
ఈనాడు, విజయనగరం: మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచైత నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజ్యాంగం, చట్టాలు ఇంకా బతికే ఉన్నాయని చెబుతోందని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఈ కేసులో న్యాయమే గెలిచిందన్నారు. మాన్సాస్‌లో కొన్ని నష్టాలు జరిగాయని, వాటన్నింటినీ గుర్తించి సరిచేసి.. సంస్థను గాడిలో పెడతామని చెప్పారు. హైకోర్టు తీర్పు అనంతరం సోమవారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. మాన్సాస్‌ ట్రస్టు ప్రజల కోసం పుట్టిందని, కుటుంబ వ్యవహారం కాదని.. ఇది తెలియకుండా కార్యాలయాన్ని మరోచోటికి తరలించారని పేర్కొన్నారు. ట్రస్టులో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. సింహాచలం దేవస్థానంలోని గోశాల దేశానికే ఆదర్శమని.. అక్కడి గోవులను నిర్బంధించి, హింసించి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాన్సాస్‌ పరిధిలోని 105 ఆలయాల్లో ఎలాంటి నష్టం జరిగిందో తెలుసుకుని సరి చేస్తామన్నారు. పైడితల్లి ఆలయం, రామతీర్థం, సింహాచలం ఆలయాలకు వచ్చే ఆదాయంలో 17 శాతం పరిపాలన, నిర్వహణ, సంరక్షణకు దేవాదాయశాఖకు వెళ్తుందని, ఇవి ఏ మేరకు అమలు చేశారో పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. రామతీర్థం నుంచి రూ.34 లక్షలు, పైడితల్లి ఆలయం నుంచి రూ.65 లక్షలు చెల్లిస్తున్నారని తెలిపారు. రామతీర్థంలో బోడికొండపై కోదండరాముడి విగ్రహం శిరస్సును తొలగించారని, ఇది తమ పూర్వీకుల నుంచి ఉన్న ఆలయం కావడంతో విగ్రహ ఏర్పాటుకు భక్తిభావంతో రూ.1,00,016 ఇస్తే తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.54 వేలతో రెడీమేడ్‌ విగ్రహాలను తూతూమంత్రంగా చేయించారని విమర్శించారు. కోర్టు తీర్పు ప్రతి చూశాక అన్ని వివరాలు వెల్లడిస్తానని అశోక్‌గజపతిరాజు తెలిపారు.
Tags :

Related Keywords

Amravati , Maharashtra , India , Simhachalam Temple , Venugopal Rao , A High Court , Government Order High Court , His The , Court High , High Court , Trust President , His Place , Government Order , Minister Trust , Veerabrahmendra Swami , அமராவதி , மகாராஷ்டிரா , இந்தியா , சிம்ஹாச்சலம் கோயில் , வேணுகோபால் ராவ் , அவரது தி , நீதிமன்றம் உயர் , உயர் நீதிமன்றம் , நம்பிக்கை ப்ரெஸிடெஂட் , அவரது இடம் , அரசு ஆர்டர் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.