comparemela.com


కష్టజీవుల గాడ్జెట్స్.. గ్రామీణుల కోసం సరికొత్త ఆవిష్కరణలు
ప్రపంచంలో ఏది గొప్ప ఆవిష్కరణ? అంటే ఏం చెబుతాం..? మారుమూల పల్లెల్లోని సామాన్యులకు అక్కరకొచ్చే వస్తువులు ఏవైనా గొప్ప ఆవిష్కరణలే అనిపిస్తుంది..! ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఎన్నెన్నో అద్భుతాలను చేస్తోంది. ఏవేవో కనిపెడుతున్నారు. కానీ మా కోసం... మా కష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే వస్తువుల్ని కనిపెడితే బావుంటుంది కదాని ఎదురుచూస్తున్నారు గ్రామీణులు. అలాంటి వాళ్ల కోసమే కనిపెట్టిన పరికరాలు, యంత్రాలు ఇవి. పసుపు యంత్రం, కొబ్బరి చెట్లు ఎక్కే స్కూటర్‌, ఇప్పగింజలను వలిచే మిషన్‌, చొప్ప బెండుతో చేసిన పెన్నులు... ఇలా ఎన్నో ఉన్నాయి... ఇవన్నీ కష్టజీవుల గాడ్జెట్స్‌. వీటిని చేసింది ఎవరో కాదు... ఇక్కడే పుట్టి పెరిగిన సామాన్యులు...
కొబ్బరి చెట్టు ఎక్కే స్కూటర్‌..
ఆ రోజు షెర్విన్‌ మనసును తొలిచేస్తోందా సంఘటన. తన బాల్య మిత్రుడు కొబ్బరి కాయలు తెంపేందుకు చెట్టు ఎక్కి కిందపడ్డాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలిశాక బాధపడ్డాడు. షెర్విన్‌ కె.మెబన్‌ సొంతూరు కర్ణాటకలోని మంగళూరు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివి టెక్‌ మహీంద్రాలో పనిచేసేవాడు. కొబ్బరిచెట్టు పైనుంచీ మిత్రుడు కింద పడిన సంఘటన ఒక కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోసింది. తన స్నేహితుడే కాదు, ఇలా చాలా మంది కొబ్బరి చెట్లు ఎక్కి కింద పడి, ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలు అనేకం. ఈ వ్యథలకు చెక్‌ పెట్టాలనుకున్నాడు షెర్విన్‌. ఉద్యోగం వదిలేసి, ఏడాది పాటు పరిశోధనలు చేసి... కొబ్బరి చెట్లు ఎక్కే స్కూటర్‌ను కనిపెట్టాడు. ఆ యంత్రాన్ని నడుముకు కట్టుకుని సురక్షితంగా కొబ్బరి, తాటి, వక్క చెట్లు ఎక్కవచ్చు. దాని పేరు‘ట్రీ క్లైంబర్‌’. కర్ణాటకలో అనేక మంది ఈ యంత్రాలను కొన్నారు. ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పరికరంతో కొబ్బరి చెట్లు ఎక్కడం, కాయలు దెబ్బతినకుండా నేలకు దింపడం సులభమైంది. ఈ పరికరం గురించి షెర్విన్‌ ఇలా చెప్పుకొచ్చాడు... ‘‘తరచూ జరిగే ప్రమాదాల వల్ల కొబ్బరి చెట్లపైకి ఎక్కి కాయలు తెంపేవాళ్లు తగ్గిపోతున్నారు. రాబోయే రోజుల్లో కూలీలకొరత మరింత తీవ్రం కావొచ్చు. దీనివల్ల కొబ్బరి రైతులు సకాలంలో కాయలను మార్కెట్‌ చేయలేకపోతున్నారు. నేను కనిపెట్టిన పరికరంతో లీటరు పెట్రోలుకు సుమారు 90 కొబ్బరి చెట్లు ఎక్కి దిగవచ్చు. దీనిని కొనడానికి ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఇదొక ఉపాధి అవకాశం’’. సాధారణంగా  కొబ్బరి దింపు కార్మికులు రోజుకు 30 నుంచి 40 చెట్ల కాయలు మాత్రమే తెంపగలరు. ట్రీ క్లైంబర్‌తో అయితే రోజుకు 200 చెట్లను ఎక్కవచ్చు. కూలీలు తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు సహాయపడుతుంది. ‘మబెన్‌ ఇంజనీరింగ్‌ సొల్యూషన్స్‌’ సంస్థ ద్వారా ఇలాంటి అనేక పరికరాలను అందుబాటులోకి తెచ్చాడు షెర్విన్‌.
ఇప్ప గింజల కోసం...
అవి తూర్పు కనుమలు. తెల్లవారుజామునే చిన్నాపెద్దా తట్టాబుట్టా నెత్తిన పెట్టుకుని అడవికి బయలుదేరిన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వాళ్లంతా అడవుల్లోకి వెళ్లేది ఎందుకో తెలుసా? ఇప్ప కాయలను సేకరించేందుకు! రంపచోడవరం మన్యంలో జూన్‌ నుంచి ఆగస్టు వరకు ఇప్పకాయలే గిరిజనులకు జీవనోపాధి. అలా సేకరించిన ఇప్పకాయలను సంతల్లో అమ్ముతారు కానీ వచ్చే ఆదాయం అంతంత మాత్రమే!. దానికి కారణం? కాయలు నాణ్యతగా లేకపోవడం. ఒక ఇప్ప చెట్టు నుండి వంద కిలోల గింజలు వస్తాయి. కాయల నుండి గింజలను వేరు చేయడం కష్టమైన పని.  ఈ పరిస్థితిని మార్చేసి, వారి అటవీ ఉత్పత్తులకు విలువను పెంచి, మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించేందుకు పూనుకుంది ఆశా స్వచ్ఛంద సంస్థ. అందుకు ఓ యంత్రాన్ని కనుక్కుంది. దాని పేరు మధు డకార్టికేర్‌. మనుషులు ఎనిమిది గంటల పాటు చేసే పనిని ఈ యంత్రం అరగంటలో చేసేస్తుంది. అందులోనూ దీనికి విద్యుత్‌ అవసరం లేదు. బరువు తక్కువ కావడంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. కేంద్రప్రభుత్వ గుర్తింపు పొందింది. ‘‘జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ల నుంచి కూడా మాకు ఆర్డర్లు వస్తున్నాయి. గిరిజనుల శ్రమను తగ్గించడానికే ఈ యంత్రాన్ని రూపొందించాం. ఇప్ప గింజల్లో నాణ్యత పెరగడంతో మంచి ధర వస్తున్నది..’’ అంటున్నారు ఆశా ప్రతినిధి సయ్యద్‌ సుభాని. ఇప్పగింజలకు ఎందుకంత డిమాండ్‌ అంటే? వీటి నుంచి తైలాన్ని తీస్తారు. దీనిని జుట్టుకు రాసుకోవడం వల్ల అంత త్వరగా నెరవదు. కీళ్ల నొప్పులను తగ్గించే గుణం ఇప్పకు ఉంది. అరుదైన ఆయుర్వేద ఔషధ గుణాలు ఉండటంతో మంచి మార్కెట్‌ ఉంది. 
పనస పొడిని తయారు చేస్తూ..
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కోస్తా ప్రాంతం పనస చెట్లకు ప్రసిద్ధి. ఏజెన్సీలో సుమారు మూడు లక్షల పనస వృక్షాలు ఉంటాయి. గిరిజన మహిళల స్వయం సహాయక బృందాలకు పనస మంచి ఉపాధి. పనస పండ్లను కేవలం తినడానికే కాదు.. వాటితో అప్పడాలు, పచ్చడి వంటి విభిన్నమైన ఆహార ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. పచ్చి పనస తొనలను ఉడకబెట్టి, పసుపు, కారం కలిపి తినడం గిరిజనుల సంప్రదాయం. దీనివల్ల మధుమేహం రాదన్నది వారి విశ్వాసం. ఇరవై స్వయం సహాయక బృందాలు కలిసి ‘లంబసింగి వనధన వికాస కేంద్రం’ ఏర్పాటు చేసుకున్నారు. వీరు తయారుచేసే పచ్చి పనస పొడికి గిరాకీ ఉంది. పనస గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తింటే అజీర్తి సమస్యలు ఉండవు అంటారు సంఘం సభ్యురాలు వంతల రాజేశ్వరి. ‘‘పచ్చి పనస కాయ పొడిని రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంతోపాటు 30 గ్రాముల చొప్పున రెండుసార్లు తీసుకుంటే షుగర్‌ అదుపులో ఉంటుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితం అయ్యింది..’’ అన్నారు ప్రొ.ఎ.గోపాలరావు. శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేస్తున్న ఆయన పరిశోధన కథనాన్ని అమెరికన్‌ డయాబెటిక్‌ జర్నల్‌ ప్రచురించింది.
పసుపు యంత్రం 
పసుపు పంటను పండించడం కష్టం కాదు కానీ శుద్ధి చేయడం క్లిష్టమైన ప్రక్రియ. చిన్న రైతులు ముఖ్యంగా కొండకోనల్లోని గిరిజనులు పసుపు సాగుకు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. భూమిలో నుంచి  దుంపలను తీశాక ఉడకబెట్టి, ఆరబెట్టి, పాలిష్‌ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. పంట సాగు చేయడమే పెద్ద పని, మళ్లీ శుద్ధి చేయడం రెట్టింపు శ్రమ. ఇంత కష్టపడినా చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. ఆఖరికి రైతులకు నష్టాలే మిగులుతాయి. పసుపు రైతుల సమస్యలను చాలా కాలం నుంచీ గమనిస్తున్న విశాఖ జిల్లా, చింతపల్లికి చెందిన శ్రీనివాసరావు పరిష్కారం దిశగా ఆలోచించాడు. ఆయనకు పలు స్వచ్ఛంద సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. పసుపు రైతుల కష్టాలను స్వయంగా చూశాడు. వారి శ్రమను తగ్గించి తగిన ఆదాయాన్ని తీసుకొచ్చే ‘టెర్మరిక్‌ బాయిలర్‌’ను కనుక్కొన్నాడు. అతని ఐడియాను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందించింది.
పొలాల్లో నుంచి తీసిన పచ్చి పసుపును పెద్ద పెద్ద డ్రమ్ముల్లో ఉడకబెడతారు రైతులు. ఇందుకు పెద్ద మొత్తంలో కలప అవసరం అవుతుంది. ఈలోపు వర్షాలు పడితే సరుకు దెబ్బతింటుంది. యాభై కిలోల పసుపును ఉడికించడానికి రెండు, మూడు గంటలు పడుతుంది. ఇప్పుడు శ్రీనివాసరావు తయారుచేసిన స్టీమ్‌ బాయిలర్‌ కంటైనర్‌లో 250 కిలోల పసుపును అరగంటలో ఆవిరిపై ఉడికించవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీలు, కలప ఖర్చు తగ్గుతాయి. కేవలం ఎనిమిది గంటల్లో సుమారు 2,400 కిలోల పసుపును ఉడికించవచ్చు. గతంలో పసుపును నేరుగా నీటిలో ఉడికించడం వల్ల నల్లగా మారేది. దాంతో నాణ్యత సమస్య వచ్చేది. ఇప్పుడు ఆవిరిపై ఉడికించడం వల్ల పసుపు నాణ్యత, రంగు బాగుంది. మార్కెట్‌లో డిమాండ్‌  పలుకుతోంది. ‘‘విశాఖ మన్యంలో పండిన పసుపుకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. అందుకనే ఇలాంటి కొత్త యంత్రాలు వాడి నాణ్యత పెంచుతున్నాం. రైతుల ఆదాయం కూడా పెరుగుతోంది’’ అన్నాడు శ్రీనివాసరావు. ప్రస్తుతం ఆయన ‘మన్యసీమ’ అనే స్వచ్ఛంద సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సహకారంతో ఈ యంత్రాన్ని తయారుచేశారు. పసుపును ఉడికించిన అనంతరం ఆరబెట్టి, పాలిష్‌ చేయాలి. అందుకని వాటిని సంచుల్లో వేసి రాళ్ల మీద కొట్టేవారు. అలా 50 కిలోల పసుపును పాలిష్‌ చేయడానికి రెండు గంటలు పట్టేది. ఈ శ్రమను తగ్గించడానికి పాలిషింగ్‌ మిషిన్‌ కూడా తయారుచేశాడు శ్రీనివాసరావు. దీని సహాయంతో కేవలం ఇరవై నిమిషాల్లో పాలిషింగ్‌ చేస్తున్నారిప్పుడు. ఈ రెండు యంత్రాలు అరకు, అనంతగిరి, చింతపల్లిలోని వందలాది రైతులకు వరంగా మారాయి.
చొప్పదండు పెన్నులు
పంజాబ్‌లో వరి కోతలయ్యాక మిగిలిన గడ్డిని పొలాల్లోనే కాల్చేస్తారు. దీంతో ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ఏటా చూస్తున్నదే!.  తెలంగాణలోని కొందరు రైతులు కూడా మొక్కజొన్న కంకులు కోశాక చొప్పను పొలాల్లోనే అంటిస్తారు. దీనివల్ల కొంతవరకు వాతావరణం పాడవుతుంది. ఇదంతా చిన్నప్పటి నుంచే గమనిస్తున్నాడు వరంగల్‌ గ్రామీణ జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పారపు రాజు. కాలుష్యాన్ని ఆపడానికి పర్యావరణ హితమైన పెన్నులు కనుక్కున్నాడాయన. వృథాగా పారేసి, తగలబెట్టే చొప్పను ఉపయోగించి బెండుతో బాల్‌ పాయింట్‌ పెన్‌ను తయారుచేసి ప్రశంసలు పొందాడు. అతని ఆవిష్కరణలోని పర్యావరణ హితాన్ని గుర్తించిన అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ పమేల సత్పతి రాజును అభినందించడమే గాక, వెయ్యి పెన్నులకు ఆర్డర్‌ కూడా ఇచ్చారు. రాజు ప్రతిభను ఆమె ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యింది. దాంతో తెలంగాణ చొప్ప బెండు బాల్‌ పెన్నులకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. ‘‘మా నాన్న టీవీ మెకానిక్‌. ఆయన రిపేర్లు చేస్తున్నప్పుడు గమనించేవాణ్ణి. నేను కూడా ఏదో ఒక కొత్త పరికరాన్ని కనుక్కోవాలన్న ఉబలాటం మొదలైంది..’’ అన్నాడతను. ఆ కుర్రాడు చదివింది బీఎస్సీనే అయినా చిన్న చిన్న పరికరాలు తయారుచేయడం మొదలుపెట్టాడు. అలా గ్రామీణ ఆవిష్కరణల వైపు అడుగులు వేశాడు. 
మొక్కజొన్న వ్యర్థాలను కాల్చడం వల్ల ఊరంతా పొగలు కమ్మి, చాలా మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయి. ఈ కాలుష్యానికి పరిష్కారంగా చొప్ప  బెండుతో పెన్నులు చేస్తే సమస్య కొంత తగ్గుతుందన్నది రాజు ఆలోచన. అందులోనూ పెన్నుల ఉత్పత్తికి వాడే ప్లాస్టిక్‌ వాడకానికి కూడా అడ్డుకట్ట వేయవచ్చు. కమిషనర్‌ ట్విటర్‌లో పోస్టు పెట్టడం, ప్రచారం లభించడంతో -  నార్వే దేశానికి చెందిన ఒక సెలబ్రిటీ కూడా రీట్వీట్‌ చేయడంతో చొప్ప బెండు పెన్నులకు గిరాకీ పెరిగింది. దీన్ని అత్యంత సృజనాత్మక ఆలోచనగా అందరూ అభినందించారు. దాంతో దాదాపు లక్ష వరకు పెన్నులకు ఆర్డర్లు వచ్చాయి. వీటి తయారీకి ఒక్క యంత్రం కూడా వాడకపోవడం విశేషం. ఒక రీఫిల్‌, చిన్న కట్టర్‌, చొప్పబెండులను ఉపయోగించి... చేతులతోనే ఈ పెన్నులను తయారు చేస్తారు.  చొప్ప బెండు పెన్నులతో పాటు మరిన్ని గ్రామీణ ఆవిష్కరణలను చేసిన రాజు ‘రూరల్‌ ఇన్నొవేటర్‌’గా గుర్తింపు పొందాడు. కేంద్రమంత్రి చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని సైతం అందుకోవడం అద్భుతమే కదా!.
వెదురు తేనీరు
ఒక రోజు సాయంత్రం... అబ్దుల్‌ కలామ్‌ రాసిన పుస్తకం చదువుతున్నాడు సమీర్‌. ‘దూరమైన ప్రకృతిని తిరిగి మనిషికి అందించే ఉదాత్తమైన పనులు పర్యావరణానికి, సమాజానికి మేలు చేస్తాయి’ అన్న కలామ్‌ మాట ఆలోచన రేకెత్తించింది. అలా మొలకెత్తిన వ్యాపార ఆలోచనే ‘వెదురు ఆకుల చాయ్‌’.
త్రిపురలోని గోమతి జిల్లా, గార్జీ గ్రామం వెదురు వనాలకు పెట్టింది పేరు. అక్కడే పుట్టి పెరిగాడు సమీర్‌ జమాటియా (36). కళ్ల ముందు కనిపించే వెదురు వనాలను వాడుకునే పైకి రావాలని తలపోశాడు. ప్రపంచవ్యాప్తంగా వెదురు ఉత్పత్తులపై కోర్సులు నిర్వహించే విశ్వవిద్యాలయాలను అన్వేషించాడతను. చైనాలోని నాన్జింగ్‌ విశ్వవిద్యాలయం వెదురు ఆధారిత ఉత్పత్తుల కోసం డిప్లమో నిర్వహిస్తోందని తెలిసింది. అందులో చేరాడు సమీర్‌. కోర్సు చేస్తున్నప్పుడే కంబోడియా, జపాన్‌, వియత్నాం వెళ్లి వెదురుతో చేస్తున్న వినూత్న ప్రయోగాలను అధ్యయనం చేశాడు. త్రిపుర అటవీప్రాంతం. ఇక్కడ సుమారు ముప్పయి రకాల వెదురుచెట్లు పెరుగుతాయి. వాటిలో కొన్నింటి ఆకుల్ని సేకరించి గ్రీన్‌టీ బ్యాగుల్లా తయారు చేశాడు. ‘‘మేము చిన్నప్పటి నుంచీ వెదురు వనాల మధ్యే పెరిగాం. అయినా వాటి విలువ తెలీదు. విశ్వవిద్యాలయంలో చదువుకున్నాకే తెలిసింది. వెదురు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బయాటిక్‌ లక్షణాలు అధికమని. వెదురు మతిమరుపును పోగొడుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఎముకలు, దంతాలు, జుట్టు, చర్మ ఆరోగ్యానికి వెదురు ఆకుల తేనీరు బలవర్దక ఆహారం..’’ అన్నారు సమీర్‌. త్రిపుర అడవుల్లో మొదలైన ఆయన వెదురు చాయ్‌ దేశాలను దాటింది. ఇంగ్లండ్‌తో పాటు ఐరోపాలోని వివిధ దేశాలకు ఎగుమతి  అవుతోంది. గ్రీన్‌టీ లో ఫ్లేవర్స్‌ ఉన్నట్లే వెదురు ఆకుల టీలో కూడా అనేక రకాల రుచులు లభ్యమవుతున్నాయిప్పుడు. ఇవి విదేశీయులను సైతం ఆకట్టుకోవడం విశేషం. ‘‘కలామ్‌ రాసిన ‘గ్రీన్‌గోల్డ్‌’ చదవకపోతే ఈ ఉత్పత్తులను తీసుకొచ్చేవాణ్ణి కాదు. నేను మారుమూల అటవీప్రాంతంలో పుట్టడం వల్ల అవకాశాలు లేవని బాధపడేవాణ్ణి. ఉన్నచోటే పర్యావరణ హితమైన ఉపాధిని అందిపుచ్చుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు మా బాంబూ టీ అంతర్జాతీయంగా ఆకర్షిస్తోంది..’’ అంటున్న సమీర్‌ గిరిజన యువతకు స్ఫూర్తిదాయకం.
కోకోనట్‌ ఓపెనర్‌ 
కొబ్బరి బొండం తాగినప్పుడల్లా అనుకునేవాడు పాండ్యరాజ్‌... కొబ్బరి కాయలను సులభంగా రంధ్రం చేసే పరికరం వస్తే ఎంత బావుండని.! కూల్‌డ్రింకులను, సోడాలను ఓపెన్‌ చేసే పరికరంలాంటి కోకోనట్‌ ఓపెనర్‌ డిజైన్‌ను తయారుచేశాడు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ చివరి అంచున ఉన్న పదునైన కటింగ్‌ ఎడ్జ్‌తో కొబ్బరి బొండంపైన రంధ్రం చేయవచ్చు. చిన్న స్టెయిన్‌లెస్‌ గొట్టానికి ప్లాస్టిక్‌ హ్యాండిల్‌ అమర్చారు. ఇది చూసేందుకు గ్యాస్‌ లైటర్‌లా అనిపిస్తుంది. కొబ్బరి బొండాల దుకాణాల వారికి పెద్ద సైజ్‌ పరికరాలను తయారుచేశారు. ‘‘మాది తమిళనాడులోని కోయంబత్తూర్‌. ఎంటెక్‌ చదివాను. మెకానికల్‌ ఇంజనీర్‌గా కొన్నాళ్లు పనిచేశాను. నేను ఎప్పుడు బొండాలు తాగినా ఆలోచన వచ్చేది.. ఒక పరికరాన్ని తయారుచేయాలని!. అనేక ప్రయోగాల తరువాత మంచి పరికరం చేశాను...’’ అన్నాడు పాండ్యరాజ్‌. చెరకు గడలను చిన్న చిన్న ముక్కలుగా తయారుచేసే యంత్రాన్ని కూడా రూపొందించాడీయన. ముగ్గురు కార్మికులు నాలుగు గంటల్లో 32 వేల చెరకు ముక్కలను చేయవచ్చు. దీని వల్ల చెరకు రసం తీసే వారికి చాలా సమయం, ఖర్చు ఆదా అవుతాయి.
ధాన్యాన్ని తిరగేసేందుకు...
పంట పండించడం ఒక ఎత్తయితే... దాన్ని ఆరబెట్టి, శుభ్రం చేసి మార్కెట్‌కు తరలించడం మరో ఎత్తు. ఈ ప్రక్రియ మధ్యలో వానలొస్తే ఇక అంతే సంగతి. ధాన్యం మొత్తం చెడిపోతుంది. వరి, జొన్న, కందుల రైతులు పడే తిప్పలే ఇవి. ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టిన తరువాత రోజుకు మూడుసార్లు అయినా తిరగెయ్యాలి. రైతులకు ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ పనిని సులువు చెయ్యడానికి సోలార్‌ గ్రెయిన్‌ రొటేటర్‌ వచ్చింది. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లికి చెందిన గ్రాస్‌రూట్‌ ఇన్నొవేటర్‌ అల్లాడి ప్రభాకర్‌ దీన్ని కనిపెట్టారు. ‘‘ఒక్క మనిషి గంటకు పది టన్నుల ధాన్యాన్ని తిరగేయవచ్చు. దీనికి పెట్రోలు, డీజిల్‌ అవసరం లేదు. పూర్తిగా సౌరవిద్యుత్‌తో పనిచేస్తుంది. ఎలాంటి నిర్వహణ ఖర్చులు ఉండవు. పగలంతా పనిచేస్తే సుమారు యాభై ట్రాక్టర్ల ధాన్యాన్ని తిరగేయవచ్చు. మహిళలు కూడా ఈ యంత్రాన్ని సులువుగా నడపవచ్చు..’ అన్నాడు ప్రభాకర్‌. ఇదొక్కటే కాదు, సేద్యానికి పనికొచ్చే మరో పది రకాల పరికరాలను తయారుచేశాడీయన. మెట్‌పల్లిలో ప్రభాత్‌ ఇండస్ట్రీస్‌ అనే యూనిట్‌ను ఏర్పాటు చేసి, యంత్రాల తయారీలో కొందరు స్థానికులకు ఉపాధిని కల్పిస్తున్నాడు.

Related Keywords

Tripura ,India ,Norway ,Cambodia ,Tamil Nadu ,Vietnam ,Republic Of ,China ,Telangana ,Andhra Pradesh ,Vizag , ,It International ,China University ,Alive Fitness ,Vizag District ,New Delhi ,Her Post ,Norway Country ,Gomti District ,Kodad District ,திரிபுரா ,இந்தியா ,நோர்வே ,கம்போடியா ,தமிழ் நாடு ,வியட்நாம் ,குடியரசு ஆஃப் ,சீனா ,தெலுங்கானா ,ஆந்திரா பிரதேஷ் ,விசாக் ,டி சர்வதேச ,சீனா பல்கலைக்கழகம் ,விசாக் மாவட்டம் ,புதியது டெல்ஹி ,அவள் போஸ்ட் ,நோர்வே நாடு ,கொம்டி மாவட்டம் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.