న్యూఢిల్లీ : నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు వివిధ రాజకీయ పార్టీలు టిక్కెట్లను కేటాయించే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గతంలో పలు ఆదేశాలు జారీచేసినా.. ఫలితం కనిపించలేదు. దీంతో తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థులను ప్రకటించిన 48 గంటల్లోగా వారి నేర చిట్టాను పార్టీలు వెల్లడించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ్యర్థుల క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించని రాజకీయ పార్టీల గుర్తులను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది.