comparemela.com


పీవీ.. ఢిల్లీకి రాజైనా భాగ్యనగరానికి ముద్దుబిడ్డే..!
ప్రధాని పీఠాన్ని అధిరోహించిన...
తొలి దక్షిణ భారతీయుడు పీవీ నరసింహారావు
భారతదేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు. భారతదేశ ఠీవీ మన పీవీ సామాజిక, రాజకీయ జీవితం తొలి అడుగులకు మహానగరమే సాక్ష్యం. అందుకే హైదరాబాద్‌ అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. ఇవాళ బహుభాషా వేత్త, మాజీ ప్రధాని పీవీ శతజయంతి ముగింపు ఉత్సవం. ఈ సందర్భంగా ఆయనతో ఆత్మీయానుబంధం కలిగిన ప్రముఖుల స్మృతులతో పాటు నగరంతో పీవీకున్న అనుబంధంపై ప్రత్యేక కథనం.!
కాళోజీతో మైత్రి..
ప్రజాకవి కాళోజీతో పీవీ నరసింహారావు స్నేహబంధం ప్రత్యేకమైంది. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం వేదికగా ఆనాటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీ.. కాళోజీ షష్ఠిపూర్తి మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమాన్ని నిర్వహించిన తీరే ఇరువురి మైత్రీబంధానికి ఉదాహరణ. ఆయన దేశానికి నేతైనా తన చిన్ననాటి మిత్రుడు కాళోజీ చేత మాత్రం ‘ఏరా’ అని పిలిపించుకోగలిగిన గొప్ప స్నేహితుడు పీవీ అని ‘‘మన భారత ప్రధాని’’ రచన ద్వారా అవగతమవుతోంది.
పీవీ సహాయంతోనే ఆర్బీఐ డైరెక్టరయ్యాను
చెన్నమనేని హనుమంతరావు, 
పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత
పీవీ నరసింహారావుతో నాది ఆత్మీయానుబంధం. నిజాం వ్యతిరేక పోరాట సమయంలో ఆయన గురించి వినడమేకానీ కలిసింది లేదు. కానీ 1952లో ఆల్‌ హైదరాబాద్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ కార్యదర్శిగా నేను పీవీని చాలాసార్లు కలిశాను. అప్పుడు ఆయన హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా. ఒకటి రెండు సభల్లో నా ఉపన్యాసం విని ఆయన మెచ్చుకున్నారు కూడా. పీవీ కాంగ్రెస్‌ నాయకుడైనా వామపక్ష విద్యార్థి సంఘంతో చాలా ఆప్యాయంగా మెలిగేవారు. ఆ తర్వాత 1966లో చికాగో యూనివర్సిటీలో పోస్టు డాక్టోరల్‌ పీహెచ్‌డీ పట్టాతో తిరిగి వచ్చాను. ఆ సందర్భంగా మా అన్న రాజేశ్వరరావు ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు మంత్రి హోదాలో పీవీ హాజరయ్యారు. అప్పుడు ఆయనతో చాలాసేపు మాట్లాడే అవకాశం దొరికింది. ఆ తర్వాత ప్రణాళికా సంఘం సభ్యుడిగా నేను, కేంద్ర మంత్రి హోదాలో పీవీ కలిసి పలు సందర్భాల్లో చర్చించుకున్నాం. 
కాంగ్రె్‌సలో అత్యున్నత మేధావి పీవీ. ఆయన్ను చివరి నెహ్రూనియన్‌గా అభివర్ణించవచ్చు. పీవీ విశాల దృక్పథం కలిగిన రాజనీతిశాస్త్రజ్ఞుడు. ఆయన భారత ఆర్థికవ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తద్వారా దేశాభివృద్థి పరుగుతీస్తుందని ఆశించాడు. అదే సమయంలో తిరుపతిలోని ఏఐసీసీ సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో అసమానతలు పెరిగే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. విద్య, ఆరోగ్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ రెండు రంగాలపై దృష్టిపెట్టాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు ప్రత్యేక విధానాలు రూపొందించాల్సిన అవసరాన్ని అదే సభలో నొక్కిచెప్పారు. ఉపాధి పథకాల ఆవశ్యకతను ఆనాడే పీవీ నరసింహారావు విశదీకరించారు. ఆయన ప్రధాని హోదాలో దీర్ఘకాల కరువు ప్రాంతాలపై అధ్యయనం కోసం నన్ను చైర్మన్‌గా నియమిస్తూ ఒక కమిషన్‌ నియమించారు. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు ఆఫ్‌ డైరెక్టరుగా నన్ను ఎంపిక చేయడం వెనుక పీవీ నరసింహారావు సహాయం ఉందనుకుంటున్నాను. ఆ తర్వాత కూడా నేను పలు సందర్భాల్లో పీవీని కలిసి, ఆర్థిక సంస్కరణల మీద చర్చించాను. ప్రజాస్వామిక దృక్పథం కలిగిన పీవీ నరసింహారావు వంటి నాయకులు భారత రాజకీయ యవనికపై చాలా అరుదు. అలాంటి మహనీయుడి స్ఫూర్తి ఇవాల్టి పరిస్థితులకు చాలా అవసరం.
‘వందేమాతరం’ నినాదమై..
భారతదేశ స్వాతంత్య్ర కాంక్షకు అద్దంపట్టే గీతం వందేమాతరం. అది నిజాం ఏలికలో నిషిద్ధం. ఉస్మానియా యూనివర్సిటీ వసతిగృహంలోని కొందరు వి ద్యార్థులు ‘వందేమాతర’ గీతాన్ని ఆలపించారు. అది నిజాం అధికారులకు కోపం తెప్పించింది. దాంతో సుమారు 350మంది విద్యార్థులను కళాశాల నుంచి తొలగించారు. రాచరిక ప్రభువుల నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ అంతటా వందేమాతరం ఉద్యమం పెల్లుబికింది. నిజాం పోకడలను నిరసిస్తూ యువత గళమెత్తారు. అందులో హన్మకొండ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదువుతోన్న పీవీ నరసింహారావు కూడా ఉన్నారు. అంతే, కళాశాల నుంచి పీవీని సస్పెండ్‌ చేశారు. అనంతరం ఆయన పుణెలోని ఫెర్గూసన్‌ కాలేజీ నుంచి బీఎస్సీ, నాగ్‌పూర్‌ వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1950లో ‘సాహిత్యరత్న’ పట్టా పొందారు. నిజాం వ్యతిరేక పోరాటంలో స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా పీవీ తనవంతు పాత్ర పోషించారు.
 
వకీలుగా పీవీ..
న్యాయవిద్యను అభ్యసించిన పీవీ తొలినాళ్లలో ప్రముఖ న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు (తర్వాత హైదరాబాద్‌ ముఖ్యమంత్రి) వద్ద కొంతకాలం జూనియర్‌గా ప్రాక్టీసు చేశారు. అప్పుడు ఆయన కార్యాలయం కాచీగూడలో ఉండేది. 1950వ దశకం వరకూ హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌, భారతీయ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలు సుల్తాన్‌బజార్‌లోని అద్దెభవనాల్లో కొనసాగేవి. అలా ఆ ప్రాంతం రాజకీయ, సామాజిక చర్చలకు ఒక అడ్డా. రోజూ సాయంత్రాలు సుల్తాన్‌బజార్‌ చౌరస్తా వద్ద కాళోజీ, పీవీ, వెంకటస్వామి తదితర కాంగ్రెస్‌ నాయకులు కలిసి ముచ్చటించుకునేవాళ్లు అని కొన్ని జీవిత చరిత్ర రచనల ద్వారా తెలుస్తుంది.
నగరం మీద మమకారం.. 
నవ భారత ఆర్థిక సంస్కర్త మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు హైదరాబాద్‌ అంటే వల్లమాలిన ప్రేమ. ఆయన ప్రధానమంత్రి హోదాలో తెలుగు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు తొలిసారిగా నగరానికి వచ్చారు. అప్పుడు ఆయన ప్రసంగం ఇలా సాగింది..‘‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే. ఇవాళ దేశంలో రాజులు పోయారు. అయినా, రాజ్యాలు నడిపించక తప్పదు. ఎవరో ఒకరు నడపాలి. ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ఇక్కడికొస్తే(హైదరాబాద్‌) తల్లి ఒడిలోకి వచ్చిన అనుభూతి కలుగుతోంది. ఈ గడ్డమీదే నేను ఓనమాలు దిద్దుకున్నాను. ఈ నేలపైనే దేశసేవ చేస్తూ తొలి అడుగులేశాను. నాకు ఆప్తమిత్రులు, బంధువులు ఇక్కడే ఉన్నారు. ఇది భిన్న సంస్కృతులు ఎదిగిపూచిన చోటు. ఇక్కడే నా మూలాలున్నాయి’’ అంటూ భాగ్యనగరంతో తనకున్న పేగుబంధాన్ని మననం చేసుకున్నారు. ఆయనకు ఈ నేలపై అంత ప్రేమ కనుకే, అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. నెక్లెస్‌ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేశారు.
రామానందతీర్థ శిష్యరికం..
నిజాం వ్యతిరేక పోరాటంలో స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో పీవీ పని చేశారు. కాంగ్రెస్‌ రాజకీయాల్లో పీవీకి తొలి స్ఫూర్తి స్వామి రామానందతీర్థ. కనుకే తన గురువు పేరుతో బేగంపేటలో స్వామి రామానంద తీర్థ ట్రస్ట్‌ను నెలకొల్పారు.
పీవీ సమక్షంలో నా అవధానం..
à°¡à°¾. మాడుగుల నాగఫణి శర్మ, 
బృహత్‌ ద్విసహస్రావధాని-బ్రహ్మశ్రీ
దేశ ప్రధాని పక్కన కూర్చొని అవధానం చేసే గొప్ప అవకాశం నాకు దక్కింది. అదీ బహుభాషావేత్త పీవీ నరసింహారావు ఆ హోదాలో కొలువుదీరడం వల్లే సాధ్యమైంది. ఢిల్లీలో పీవీగారిని నేను ఒకసారి కలిశాను. అప్పుడు ఆయన ఏ పదవిలోనూ లేరు. కానీ ఆ వెంటనే తాను ఏపీభవన్‌కు ఫోన్‌చేసి ‘శర్మగారి అవధానం పెట్టించండి’ అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు 1996, ఫిబ్రవరి 15న నాంపల్లి లలితకళాతోరణంలో మహా సహస్రావధానానికి ఆయన ప్రధాని హోదాలో పాల్గొనడం నా జీవితంలో మరిచిపోలేని ఒక మధుర ఘట్టం.
అప్పుడు ఆయన సుమారు రెండున్నర గంటలపాటు వేదికపై నా పక్కనే ఆసీనులు అయ్యారు. పృచ్ఛకుడిగా పీవీగారిని ప్రశ్నవేయమని నేను అడిగాను. అందుకు ఆయన ‘నాకు ప్రశ్నలతోనే రోజు మొదలవుతుంది. ఒక్క ప్రశ్నవేస్తే, మిగతా ప్రశ్నలకు అన్యాయం చేసినట్టే కదా.!’ అంటూ చమత్కరించారు. శర్మ అవధానం పూర్తిగా అస్వాదించలేకపోతున్నానని పీవీ విచారం వ్యక్తం చేశారు. ఆ వేళ తన ఉపన్యాసం ఒక పీహెచ్‌డీ టాపిక్‌లా సాగింది. అదే వేదికపై ఆయన ప్రశంసలు అందుకోవడం నాకు మిక్కిలి సంతోషదాయకం. మరొక సందర్భంలో ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ పీవీని కలిశాను. మేమెప్పుడు కలిసినా అవధానం, ప్రాచీన, ఆధునిక సాహిత్యం గురించే మాట్లాడుకునేవాళ్లం. నా పద్యాలంటే ఆయనకు అమితమైన ప్రశంస. విశ్వనాథ సాహిత్యానికి పీవీ వీరాభిమాని. కనుకే ‘వేయిపడగలు’ తెలుగు నవలను ‘సహస్రఫణ్‌’ పేరుతో హిందీలోకి అనువదించారు. పీవీ వచనం చాలా పటిష్ఠమైంది. అలాంటి అసమాన్య వ్యక్తిత్వం కలిగిన నాయకుడు, పండితుడు చాలా అరుదు.
పీవీపై పద్యం :- 
మాడుగుల నాగఫణిశర్మ మహా సహస్రావధానంలో 
‘పెదవి-పదవి-చదివి-ఒదవి’..పదాలతో పీవీ వ్యక్తిత్వాన్ని 
వర్ణించమని ఒక పృచ్ఛకుడు ప్రశ్న సంధించాడు. 
అప్పుడు అవధాని ఆశువుగా పలికిన పద్యం..
‘‘పెదవినో విప్పడు ఎవ్వరేమి యనినన్‌ ప్రేమన్‌ విలోకించు, ఏ
పదవినో గోరడు తానుగా వలచినన్‌ భద్రమ్ముగాజూచు, తాన్‌
పదునాల్గైన సుభాషలనో చదివి శబ్దప్రేధి నిశ్శబ్దుడౌ
ఒదవున్‌ మేరువు అద్దమందువలె నోవా! పీ.వీ ఠీవిన్‌ భువిన్‌’’

Related Keywords

Hyderabad ,Andhra Pradesh ,India ,Osmania University ,Madugula ,Tirupati ,New Delhi ,Delhi ,Pune ,Maharashtra ,Chicago ,Illinois ,United States ,Indian Pv Rao ,Vande Mataram ,Ramanand Tirtha ,Swami Ramanand Tirtha ,Burgula Ramakrishna Rao ,Telugu University ,Planning Commission ,His Office ,His Pune College ,Chicago University ,Delhi Bhagyanagara ,Prime Minister ,This Country Her ,His Main Secretary ,Chicago University Post ,Central Minister ,His India ,India Independence ,India Finance ,Ramanand Tirtha Rural ,Swami Ramanand Tirtha Rural ,February Nampally ,Great His ,New Delhi Prime Minister ,ஹைதராபாத் ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,ஒஸ்மணிய பல்கலைக்கழகம் ,மதுகுலா ,திருப்பதி ,புதியது டெல்ஹி ,டெல்ஹி ,புனே ,மகாராஷ்டிரா ,சிகாகோ ,இல்லினாய்ஸ் ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,வந்தே மாதரம் ,பர்குலா ராமகிருஷ்ணா ராவ் ,தெலுங்கு பல்கலைக்கழகம் ,திட்டமிடல் தரகு ,அவரது அலுவலகம் ,சிகாகோ பல்கலைக்கழகம் ,ப்ரைம் அமைச்சர் ,மைய அமைச்சர் ,அவரது இந்தியா ,இந்தியா சுதந்திரம் ,இந்தியா நிதி ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.