Jun 29,2021 08:32
సిఎఫ్‌టియుఐ స్టీల్‌ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొగలేశన్
137వ రోజుకు 'ఉక్కు' దీక్షలు
ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖ) : విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా (సిఎఫ్‌టియుఐ) స్టీల్‌ప్లాంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొగలేశన్ అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 137వ రోజుకు చేరాయి. సోమవారం దీక్షల్లో సిఎఫ్‌టియుఐ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. దీక్షలనుద్దేశించి మొగలేశన్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక కర్షకులందరినీ కష్టాలపాల్జేస్తోందని విమర్శించారు. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. సిఎఫ్‌టియుఐ అధ్యక్షలు సత్యంనాయుడు, ప్రధాన కార్యదర్శి దాసరి సురేష్ మాట్లాడుతూ కార్మికుల ఐక్య పోరాటాలతోనే హక్కుల్ని సాధించుకోగలమని తెలిపారు. ప్రాణాలకు తెగించి ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికులకు న్యాయమైన వేతన ఒప్పందం చేయాలని అడిగితే యాజ మాన్యం నిర్లక్ష్యధోరణిలో వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు, డి.ఆదినారాయణ, కర్రా ప్రకాష్, చీకటి రామారావు, చీకటి దీవెన రాజు, ఎల్‌వి.రమణ పాల్గొన్నారు.
తాజా వార్తలు