comparemela.com


Jun 28,2021 07:32
సంఘ సంస్కరణ ప్రధాన లక్ష్యంగా చేసుకొని కాళ్ళకూరి నారాయణరావు రచించిన మూడు నాటకాలు చింతామణి, వరవిక్రయం, మధుసేవ. ఒకదానిని మించి ఒకటి సంఘంలో పేరుకుపోయిన మూడు దురాచారాలపై సంధించిన మూడు అస్త్రాలివి. వేశ్యావృత్తి, వేశ్యాలోలత వల్ల కలిగే అనర్ధాల్ని వివరిస్తూ చింతామణి నాటకాన్ని, వరకట్న దురాచారంవల్ల జరిగే కష్టనష్టాల్ని వివరిస్తూ వర విక్రయాన్ని, మద్యం రక్కసి కోరల్లో చిక్కి కొంపలను, ఆరోగ్యాన్ని గుల్ల చేసుకొనే వారి జీవితాల్లోని విషాదాన్ని గూర్చి మధుసేవ నాటకం ద్వారాను కాళ్ళకూరి చాలా బలంగా చిత్రీకరించారు. రచనాపరంగా, సాహిత్యపరంగా ఈ మూడు నాటకాలూ ఒకదాని కొకటి ఎంతమాత్రం తీసిపోవు.
   చింతామణి నాటకాన్ని కవి 1920లో రాసారు. అంటే ఈ నాటకానికి వందేళ్లు దాటాయి. పౌరాణిక నాటకాలు ఊరూ వాడా ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో కూడా వాటికి సమాంతరంగా ఈ చింతామణి సాంఘిక నాటకం ప్రదర్శనలో వాటికి చాలా గట్టి పోటీనిచ్చింది. ఇది 10 అంకాల నాటకం. దీనికి మూలం లీలాశుకయోగి కథ. నాటకం మొత్తం అటు చదువుతున్నా, ఇటు రంగస్థలంపై చూస్తున్నా కూడా మనల్ని తన కూడా లాక్కొని పోతుంది. ఆనాటి వేశ్యవాడల వాతావరణం, వారి మనస్తత్వాలు, వారినటనలు, వారి మాటల నిపుణతలు మనల్ని ఒక కొత్త వాతావరణంలోకి తీసుకు పోతాయి. సంభాషణల్లో సహజత్వం కోసం కొన్ని తిట్లు, పదాలు దొర్లుతాయి. అయితే కొందరు నాటక ప్రదర్శకులు జనాకర్షణ కోసమని, కొన్ని సొంత సంభాషణలు చేర్చి నాటకాన్ని కొంత దిగజార్చారు. సుబ్బిశెట్టి, శ్రీహరి, చిత్ర పాత్రలను మరింత ఘోరంగా మార్చేసారు. కాని అసలు చింతామణి నాటకం మాత్రం ఆకాలానికి, ఈకాలానికి కూడ ఒక మంచి ఉపదేశాన్ని ఇచ్చే ఒక అపురూప సాంఘిక నాటకం.
    చింతామణి ఇందులో మొత్తం ముగ్గురు విటుల్ని భ్రష్టు పట్టిస్తుంది. వారిలో మొదటివాడు భవానీ శంకరుడు, రెండు సుబ్బిశెట్టి, మూడు బిల్వమంగళుడు. నాటకం ప్రారంభంలోనే అప్పటికే భవానీ శంకరుడు తన ఆస్తిపాస్తులన్నిటినీ చింతామణికి ధారపోసి, ఇంకా ఆమె మీద మోజు తీరక అప్పులకోసం తిరుగుతుంటాడు. చింతామణి కొంచెం జాలి చూపించినా ఆమె తల్లి శ్రీహరి మాత్రం అతణ్ణి ఇంక వదుల్చుకోమని గట్టిగా చెపుతుంది. భవానీ శంకరుడు అప్పుకోసం తన మిత్రుడైన బిల్వమంగళుడి వద్దకు వెళ్ళి, చింతామణి కోరికపై అతణ్ణి కూడా తీసుకువచ్చి చింతామణికి పరిచయం చేస్తాడు. తన అందంతో, కవితా పాండిత్యాలతో చింతామణి బిల్వమంగళుణ్ణి కూడా వశం చేసుకొంటుంది. విజ్ఞానఖని, భక్తుడు, సకలశాస్త్ర పారంగతుడు అయిన బిల్వమంగళుడు చింతామణికి ఎంతగా దాసుడైపోతాడంటే, తండ్రి చనిపోతే పట్టించుకోడు, ప్రాణప్రదంగా చూసుకొనే ఇల్లాలు చనిపోతే ఆమె శవాన్ని ఆధారంగా పట్టుకొని ఈదుకొంటూ ఏరుదాటి చింతామణి కోసం వచ్చేస్తాడు. సుబ్బిశెట్టి కూడా తన తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని మొత్తం పోగొట్టుకొంటాడు.
   చివరకు ఇందరిని ఇన్ని విధాలుగా వశపరచుకొన్న చింతామణికి కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. హితముప దేశిస్తాడు. అంతే ఆమె పరమభక్తురాలిగా మారిపోయి తనవల్ల ఎవరెవరు? ఎంతెంత పోగొట్టుకొన్నారో ఆయా వ్యక్తులకు ఆ ధనాన్ని తిరిగి పంచేస్తుంది. బిల్వమంగళుడు లీలాశుకయోగిగా మారిపోతాడు. చింతామణి సన్యాసినిగా మారిపోతుంది. ఆమె తల్లి శ్రీహరికి మతిస్థిమితం తప్పుతుంది.
     స్థూలంగా ఇదీ ఇందలి ఇతివృత్తం. రచయిత ఈ కథని చక్కని సంభాషణలలో కూర్చి ఒక గొప్ప దృశ్యకావ్యంగా మలిచారు. ద్వితీయాంకంలో కవి వేశ్యల యొక్క చిత్తవృత్తిని, వారి తత్త్వాన్ని, మరీ ముఖ్యంగా కొత్త విటులను ఆకర్షించటంలోనూ, పాత విటుల్ని వదుల్చుకోవటంలోనూ వేశ్యమాతల జాణతనాన్ని చింతామణీ- శ్రీహరిల సంభాషణలో భలే అద్భుతంగా, కళ్ళతో చూసినట్లుగా వర్ణిస్తారు. ఇక భవానీ శంకరుని వద్ద నుంచి ఏమీ రాదని, అతడు రోడ్డున పడ్డాడని గ్రహించిన తల్లి శ్రీహరి అతణ్ణి ఇంక వదుల్చుకోమని చింతామణికి సలహా ఇస్తుంది. కాని చింతామణి వేశ్య అయినా ఆమెలో ఒకింత జాలి, దయ కనిపిస్తాయి. ఆమె తల్లితో ఇలా అంటుంది. అమ్మా
సీ|| వగలును వలపులు వర్షించి తొలినాడె
తిరుగనిపిచ్చి యెత్తించినాను
వచ్చిన నెలలోన మచ్చికమీర లా
లించి మాన్యమ్ములమ్మించినాను
బన్నసరాలకై పట్టుపుట్టములకై
యిల్లు విక్రయము చేయించినాను
దిన వెచ్చములకని తినుబండరములకని
పెండ్లాము నగలు మార్పించినాను
ఆ|| అన్ని వగలు చూపి యిన్ని రీతుల మాపి
యెట్టులింతలోనె యేగుమందు
అతడుస్సురన్న నాతని కడగొన్న
ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మ !
అని అతణ్ణి బాధ పెట్టటానికి వెనకాడుతుంది. కాని తల్లి వెంటనే అదిగో! అదే నీ దగ్గరున్న లోటు, ఈ శ్రీరంగనీతులే నిన్ను పాడు చేస్తున్నాయి. నీ అందానికి, నీ చందానికి, నీ విద్యకు నీ తెలివికి ఈపాటికి కోట్లు గడించాలి అంతేకాదు ఇన్నేసి రోజులు ఒక్కరిని ఉంచుకోరాదని చెపుతూ ...
''దినమునకొక్క నిందెలివి తేటలతోడను గోచిపాత రా
యనిగనొనర్చి, వేరొకని కాతని స్థానమొసంగి; యింక నొ
క్కనికది మాట యిచ్చి, మఱొకానొక జారుని గూర్చియచ్చులో
గ్గిన నెరజాణయే గణిక కీరితి గాంచుగులంబునందదే!
అలాంటి గణికే కీర్తిమంతురాలవుతుందని మాట్లాడుతుంది. అయితే చింతామణి ఛీ! పాడు వృత్తి? ఏమివృత్తియిది? అని
ఎఱుగవలయు విటునియెడద, శాంతమున, స
హింపవలయు వాని యేహ్య మెల్ల,
మసలవలయు నతని మది కెక్కునట్లాడి,
పడునెయపుడు గాక పైకముఱక -
అంటూ విటుల్ని ఎంత కష్టమయినా, అయిష్టమయినా ఎలా భరించాలో చెపుతుంది. మొత్తం మీద వేశ్యల మనస్తాత్వాలెలా ఉంటాయో, విటులను ఆకర్షించేందుకు వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో, ద్వితీయాంకంలో తల్లీకూతుళ్ళైన శ్రీహరీ చింతామణుల సంభాషణల ద్వారా కవి చాలా చమత్కారంగా ఎంతో సహజంగా వివరిస్తారు.
తృతీయాంకంలో చింతామణీ భవానీశంకరుల సంభాషణలో చింతామణి ప్రౌఢతనం, గడుసుతనం వెల్లడి అవుతాయి. చింతామణి ఇంట్లో సుబ్బిశెట్టి ఉండటాన్ని భవానీశంకరుడు చూసి, అనుమానంతో అతడెందుకువచ్చాడని అడుగుతాడు అందులకామె ఏంచెప్పాలా? ఎలా చెప్పాలా అని సంకోచిస్తూ ఇదే వెలయాలి తెలివి తేటలు వెల్లడించు ఘట్టము అని ఇలా భావిస్తుంది.
''తప్పు పనిసేయ గలుగుట- గొప్పకాదు
చేసినది బైటపడునప్డు - సిగ్గునెగ్గు
విడిచి ధైర్యముతో గోడపెట్టి - నట్లు
బొంకనేర్చుటె వెలయాలి - ప్రౌఢతనము'' అంటూ ఏదో చెప్పి ఆతణ్ణి నమ్మిస్తుంది. మీరు తెస్తానన్న డబ్బు తేలేదు. మా అమ్మ పెట్టే కోత నేను భరించలేక పోతున్నాను అంటుంది. ఆ మాటలకు భవానీ శంకరుడు ఇప్పటి దాకా, ఆమె కోసం తాను ఏమేమి పోగొట్టుకొన్నాడో ఇలా ఏకరవు పెడతాడు.
''తాతలనాటి క్షేత్రములెల్ల తెగనమ్మి
దోసిళ్ళతో దెచ్చి పోసినాను
తండ్రి కట్టిన యిల్లు - దాయాదులకు విక్ర
యించి వస్తువులు చేయించినాను
అత్తవారిచ్చిన - అంటు మామిటి తోట
యీవుకోరగ వ్రాసి యిచ్చినాను
కులసతి మేని సొమ్ములు పుస్తెతో గూడ
గొనివచ్చి నీయింట గుప్పినాను
కులమువారెల్ల నీకిది - కూడదన్న
భార్యనూతికి గోతికి - బరుగులిడిన
లెక్కసేయక నీయిల్లు - కుక్కవోలె
గాచికొని యిట్టులున్నాను - కలికినేను - అని
ఇలా ఆమెకోసం తాను ఏయే త్యాగాలు చేసాడో చెపుతాడు. మరి ఆమె మాత్రం తక్కువ తిందా? అతనికోసం తాను ఏమేమి వదులుకుందో ఇలాచెపుతుంది.
తనకు గల్గినదెల్ల ధారవోసినయట్టి
సీతాపతికి స్వస్తి చెప్పినాను
మెచ్చి ముచ్చట తీరు మేడ కట్టించిన
పోలిసెట్టిని బాఱద్రోలినాను
నిముసంబులోన మాన్యంబు వ్రాసియిచ్చిన
యాదిరెడ్డిని సాగనంపినాను
కోరిన బంగారు కొండనేనియుదెచ్చు
పెద్దిసెట్టికి సొడ్డుపెట్టినాను
క్రొత్త సరసులు చెలరేగి - చిత్తకార్తి
కుక్కలంబలె నిలుచుట్టు గ్రుమ్మరిలుట
కాంచి మాయమ్మ నన్నెంత కసురుచున్న
నీకెలోబడియున్నాను - నిజముగాను - అని అతడి నోరు మూయిస్తుంది.
ఎంత వేశ్యలైనా, వాళ్ళకీ ఒక మనసుంటుంది. ఎంత డబ్బు కోసం వాళ్ళు ఆవృత్తి చేసినా వాళ్ళమనస్సూ ఒక్కోసారి వశం తప్పి ఒక్కొక్కరి వైపు ఆకర్షితమవుతుంది. చింతామణి మనసు అలాగే బిల్వమంగళుడివైపు ఆకర్షితమవుతుంది. సాధారణంగా వేశ్యలకు విటుల అందచందాలతో పని ఉండదు. శాస్త్రపాండిత్యాలతో పనిలేదు. కాని ఇక్కడ చింతామణి బిల్వమంగళుడి అందచందాలకు, శాస్త్రపాండిత్యాలకు లొంగి పోతుంది. ఆతణ్ణి ఎలాగైనా తన వద్దకు తీసుకురమ్మని భవానీ శంకరుణ్ణి కోరుతుంది. అది చాలా కష్టమంటాడు భవానీ శంకరుడు ఎందుకు? అని అడుగుతుందామె. అక్కడ వారిరువురికి జరిగిన సంభాషణ చింతామణి కార్యసాధనతను తెలుపుతుంది. బిల్వమంగుళుణ్ణి తనవద్దకు రప్పించుకొని ఇక తనే లోకంగా అతడిని మార్చేస్తుంది. ఎంతో ప్రేమగా చూసుకొనే తన భార్య రాధని, ఎంతో భక్తిశ్రద్ధలతో చూసుకొనే తండ్రిని కూడా పట్టించుకోనిస్థితికి అతణ్ణి తీసుకువెళుతుంది.
బిల్వమంగళుడు వేశ్యాలోలుడై ఇల్లుపట్టించుకోక పోవటంచేత తండ్రి వాసుదేవమూర్తి మనోవ్యాధితో మంచం పడతాడు. తండ్రి మరణించినా పట్టించుకోకుండా, భార్య శవాన్నే తెప్పగా చేసుకొని ఏరుదాటి వచ్చిన బిల్వమంగళుని జూచి చింతామణి ఎంతో బాధపడుతుంది. భార్యలు బతికి ఉన్నన్నాళ్ళే భర్తలకు సేవచేయగలరు, కాని నీ భార్య చనిపోయి కూడా సేవచేసింది. అటువంటి భార్యను, కన్నతండ్రిని విడిచి రావటం అధర్మం. నా పైపై మెరుగులు చూసి ఈ శరీరాన్ని ఆశిస్తున్నావు అని లోపలికి వెళ్ళి తన అలంకారాలు, మైపూతలు అన్నీ డులిచి అసలు రూపంతో అతనికి దర్శనమిస్తుంది. వన్నెతగ్గి, కళతప్పిన ఆమె అసలు రూపం చూసి ఆతనికి కనువిప్పు కలుగుతుంది. ఇలా బాధపడతాడు
చదివితి సమస్త శాస్త్రముల్‌ చదివియేమి
ఫలము? దుదకిట్లు చెడుదారిబడిచరించి
జనకు నిల్లాలిని గూడజంపుకొంటి
తఱుగ బోనట్టి ఘోరపాతకముగంటి
కాళ్ళకూరి వారు తమ నాటకాల్లో చివరి అంకంలో తానింకా ఏమేమి చెప్పదలచు కొన్నారో వాటిని కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తారు. చింతామణి చివరలో యోగినిగా మారి భవానీ శంకర, సుబ్బిశెట్టిలతో, మీరు 6 నెలలపాటు వేశ్యాసంపర్కము వల్ల పొందిన దుష్ఫలితాల్ని లోకాన చాటితే మీ ధనం మీకు తిరిగి వచ్చేసే ఏర్పాటు చేసాను అంటుంది. భవానీ శంకరుడు ప్రజలకు ఇలా ఉద్బోధిస్తాడు.
ఇంటరంభలవంటి యింతులుండసాని
సంపర్కముగోరు చవటలార!
కొనిపెంచినట్టి తక్కువజాతి ముండల
నెత్తిపైనిడుకొను నీచులార!
యెంతపెట్టిన దృప్తియెరుగని తొత్తుల
మెప్పుగోరెడు వెంగళప్పలార!
యిచ్చకంబుల నమ్మియిండ్లు వాకిళులమ్మి
కొంపోయి యర్పించు కూళలార!
స్వానుభవమిది దెలుపుచున్నాను వినుడు
చచ్చిబ్రతికినవాడును, సానికొంప
జొచ్చి మిగిలినవాడును మచ్చుకేని
వసుధనెందునులేడు! దవంబుతోడు
సుబ్బిసెట్టి కూడా సానివాడ మరిగి తానెన్ని పాట్లు పడ్డాడో వివరిస్తాడు. చింతామణి కూడ తనతోటి వేశ్యలకు ఆ వృత్తి మానుకోమని ప్రబోధిస్తుంది. ఈ నాటకం మంచి ప్రబోధాత్మకమై ఆనాడు ఎందరో విటుల్ని, వేశ్యల్ని కూడ ఆలోచింపచేసింది. కొందరిలో మార్పు తీసుకువచ్చింది. బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, గూడూరు సావిత్రి వంటి రంగస్థల నటులకు ఈ నాటకం ఎనలేని కీర్తిప్రతిష్ఠల్ని సాధించిపెట్టింది.
ఈ చింతామణి నాటకాన్ని తెలుగులో రెండుసార్లు సినిమాగా తీసారు. అయితే రంగస్థల నాటకం హిట్‌ అయినంతబాగా సినిమాలు హిట్‌ కాలేదు. ఆరోజుల్లో కులాంతర వివాహాలు చేసుకోవటమంటే పెద్ద సాహసం. అటువంటిది కాళ్ళకూరి నారాయణరావు ఒక కళావంతురాల్ని పెళ్లి చేసుకొని సంస్కరణని రాతల్లోనేకాక, చేతల్లోనూ చూపించారు. కులం నుంచి తనని వెలివేసినా లెక్కచేయలేదు. ఆయన 1871 ఏప్రిల్‌ 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, మత్స్యపురిలో జన్మించారు. 1927 జూన్‌ 27న మరణించారు.
- డా|| జోశ్యుల కృష్ణబాబు
98664 54340

Related Keywords

West Godavari ,Andhra Pradesh ,India ,Chitra ,Uttar Pradesh , ,Shell ,Peninsula Her ,Her Decorations ,Mari Peninsula ,மேற்கு கோதாவரி ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,சித்ரா ,உத்தர் பிரதேஷ் ,ஷெல் ,மாரி தீபகற்பம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.