Jun 28,2021 08:47
స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా
ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్ : గతంలో అత్యా చారానికి, హత్యకు గురైన ప్రీతిబాయి కేసును సిబిఐ ద్వారా విచారణ చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రీతిబాయి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కర్నూలులోని చాణిక్యపురి కాలనీ నేహ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ప్రీతిబాయి తల్లిదండ్రులు ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవిలను కృతికా శుక్లా ఆదివారం కలిసి మాట్లాడారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జిల్లా ఎస్‌పి డాక్టర్ కె.ఫక్కీరప్పతో ఆమె సమావేశమయ్యారు. ప్రీతిబాయి మృతి సంఘటన రిలీఫ్‌కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఈ కేసు వివరాలను ఎస్‌పి ఆమెకు వివరించారు. జాయింట్ కలెక్టర్ (అభివద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, అడిషనల్ ఎస్‌పి గౌతమిశాలి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఐసిడిఎస్ పిడి ప్రవీణ పాల్గొన్నారు.
తాజా వార్తలు