comparemela.com


మాతృభాషపై పగబట్టారు!
ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గించేలా పాఠశాల స్థాయిలో విద్యాబోధన విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం గురించి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా తెలుగుభాష ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్త రచ్చ మొదలైంది. రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల మాతృభాషలను పరిరక్షించడం, సుసంపన్నం చేయడం ప్రభుత్వం బాధ్యత. ఆ పని మాని తెలుగును బలహీనపర్చే చర్యలకు పాల్పడడం సబబు కాదు. దేశంలో ఎక్కడా రెండు భాషలకు కలిపి ఒక అకాడమీ ఉన్న దాఖలాల్లేవు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలుగు భాష అభివృద్ధి కోసం 1968లో ప్రత్యేకంగా తెలుగు అకాడమీని ఏర్పాటు చేయగా, దివంగత ఎన్టీ రామారావు తెలుగు భాషకు గుర్తింపు తీసుకొచ్చారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఉమ్మడి ఏపీ వేదికగా తెలుగు అకాడమీ విశేషంగా కృషి చేసింది. దాదాపు రెండు వేలకు పైగా భాషా గ్రంథాలను అకాడమీ ముద్రించింది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ స్థాయిలో పాఠ్యపుస్తకాలను తయారు చేసింది. తెలుగు భాషకు సంబంధించి పలు నిఘంటువులు, వృత్తి పదకోశాలు ఈ అకాడెమీ ద్వారా వెలువడినాయి. ఎన్టీఆర్‌ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఈ అకాడమీకి అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో పేరు మార్చడం గమనార్హం. రెండు రాష్ట్రాలు వేరయినా ఇంకా విభజన పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సుప్రీంకోర్టు మార్చిలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది. తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే విచారణ చేపడతామని నోటీసులు జారీచేసింది. ఆ వివాదం తేలకముందే అకాడమీ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్మీడియెట్ విద్యార్థులు సంస్కృతాన్ని తెలుగులోనే రాసి వందకు వంద మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. ఏపీ ప్రభుత్వం కూడా తెలుగే సంస్కృతం అనుకుందేమో. ఒక్క బోర్డులోనే రెండింటిని కలిపేసి, ఖర్చు తగ్గించుకుంది. తెలుగునే లేకుండా చేయాలనుకున్న ప్రభుత్వం ఇప్పుడు తెలుగు అకాడెమీని నిర్వీర్యం చేయాలనుకోవడం ఊహించని ఉత్పాతమేమీ కాదు. ఇదంతా ఒక పథకం ప్రకారం తెలుగు భాషను నిర్వీర్యం చేసే చర్యల్లో భాగం. భాషకు సైతం కులం అంటగట్టగల ఘనాపాటి నేతలున్న ప్రస్తుత తరుణంలో తెలుగురాష్ట్రంలో మాతృభాషా పరిరక్షణ గురించి మాట్లాడం కూడా నేరమవుతోంది. 
అకాడమిలో తెలుగుతో ఏమాత్రం సంబంధం లేని వారిని పాలకమండలి సభ్యులుగా నియమించటం మరీ విచిత్రం. తెలుగు-సంస్కృత అకాడమిగా పేరు మార్చారు కాబట్టి సంస్కృత భాషలో ప్రవేశం ఉన్నవాళ్ళని పాలకమండలిలో సభ్యులుగా వేశారు బాగానే ఉంది. మరి ఏమి సంబంధం ఉందని కెమిస్ట్రీ రిటైర్డ్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ రాజకుమార్ నేరెళ్ళ, బీఈడీ కాలేజీ లెక్చరర్ కప్పగంతు రామకృష్ణలను నియమించిందో ప్రభుత్వానికే తెలియాలి. ఆ మాట కొస్తే చైర్ పర్సన్‍గా ఉన్న లక్ష్మీపార్వతి తెలుగు భాషాభివృద్ధి కోసం చేసిన సేవలు, కృషి ఏమిటో కూడా చాలామందికి తెలీదు.
సంస్కృత భాష అభివృద్ధికి సంబంధించి తిరుపతిలో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం, సంస్కృత విద్యా పీఠం, ఓరియంటల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, వేద విశ్వవిద్యాలయం, రాష్ట్రంలోని పలుచోట్ల ఓరియంటల్‌ కళాశాలలు, చాలా విశ్వవిద్యాలయాల్లో సంస్కృత విభాగాలూ ఉన్నాయి. టిటిడి ప్రచురణలు, పరిశోధనా సంస్థల్లోనూ సంస్కృతానికి అగ్రపీఠమే! ప్రాచ్య కళాశాలల్లో సంస్కృతం కోర్సులు బోధించి డిగ్రీలు ప్రదానం చేస్తున్నారు. ఇన్ని ఉండగా సంస్కృతానికి తెలుగు అకాడమీలో భాగమెందుకు? ఏ ఛాందస శక్తుల్ని సంతృప్తి పర్చడానికి?
ప్రభుత్వానికి నిజంగా భాషలను అభివృద్ధి చేయాలన్న సంకల్పమే ఉంటే భాషా పండితులు, లెక్చరర్లు, ప్రొఫెసర్‌ పోస్టులలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. మూతబడ్డానికి సిద్ధంగావున్న ఓరియంటల్‌ కాలేజీలను నడిపించాలి. ద్రవిడ విశ్వవిద్యాలయానికి – తెలుగు అకాడమీకి నిధులు కేటాయించి కార్యకలాపాలను విస్తృతం చేయాలి. రాష్ట్ర విభజనతో అంపశయ్యపై ఉన్న రాజమండ్రినిలోని తెలుగు సాహిత్య పీఠాన్ని తెలుగు విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలి. ఇవేవీ చేయకుండా అకాడమీ పేరు మార్చి భాషలను అభివృద్ధి చేస్తామనడం 'అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట' అన్న నానుడిని గుర్తుకు తెస్తోంది.
డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్
తెలుగు అధ్యాపకుడు, తెనాలి

Related Keywords

United States ,Bangaru Gaajulu Anna ,Bed College ,Historya Telugu Academy ,Texts Academy ,Academy Telugu ,Tirupati Central Sanskrit University ,Dravidian University ,Telugu Academy ,Vedic University ,Academy Name ,Supreme Court March ,Prime Minister ,Sanskrit Education ,Telugu Design ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,படுக்கை கல்லூரி ,திராவிட பல்கலைக்கழகம் ,தெலுங்கு கலைக்கழகம் ,வேத பல்கலைக்கழகம் ,உச்ச நீதிமன்றம் அணிவகுப்பு ,ப்ரைம் அமைச்சர் ,சமஸ்கிருதம் கல்வி ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.