comparemela.com


కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం ఎవరో చెప్పేసిన రేవంత్! (ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ)
కేసీఆర్‌ నుంచి ఇక గుంజుకొనుడే
ప్రజలు ఇవ్వాల్సిన దానికంటే వెయ్యింతలు ఎక్కువిచ్చారు
ఆయనకు శ్రమ కంటే ఎక్కువ ఫలితం వచ్చింది
మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఇస్తే దివాలాగా మార్చాడు
బంగారు బాతును ఇస్తే కోసుకు తింటున్నారు
బాప్‌ ఔర్‌ బేటావి బడాయి మాటలు
కేసీఆర్‌ రాష్ట్రంలో నియంత కిమ్‌లా తయారైండు
కేసీఆర్‌ నిర్బంధంలో రాష్ట్రం.. స్వేచ్ఛ కోసమే కొట్లాట
ఏడేళ్లలో 85 వేల ఉద్యోగ ఖాళీలు పెరిగాయి
సర్కారును మార్చాలని ప్రజలు నిర్ణయించేశారు
కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం.. త్వరలో ఘర్‌ వాపసీ
పార్టీ నుంచి ఫిరాయిస్తే ఇక రాళ్లతో కొట్టి చంపుడే
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరలో సుప్రీం కోర్టుకు
దూకుడు నా సహజ లక్షణం.. అది మారదు
నేను సీఎం అవుతాననే నినాదాలతో నాకు నష్టమే 
ఆధారాలుండీ సంజయ్‌ బయట పెట్టకపోవడం నేరమే
హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నిజాం నవాబుల నుంచి సమైక్య పాలకుల వరకూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసమే కొట్లాడారని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కొట్లాడాల్సింది కూడా స్వేచ్ఛ కోసమేనని టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం ప్రస్తుతం నిర్బంధంలో ఉందని, స్వేచ్ఛను కోరుకుంటోందని చెప్పారు. బాప్‌.. బేటా ఇద్దరివీ బడాయి మాటలేనని అన్నారు. కాంగ్రెస్‌ నేతల ఘర్‌ వాపసీ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని, ఇకపై ఎవరైనా హస్తం గుర్తుపై గెలిచి పార్టీ మారితే.. రాళ్లతో కొట్టి చంపుడేనని, తెలంగాణ ఆవలి వరకూ తరుముడేనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ సర్కారు మారడం ఖాయమని, ఈ మేరకు ప్రజలు ఇప్పటికే నిర్ణయించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు.టీఆర్‌ఎ్‌సను గద్దె దించే సత్తా కాంగ్రె్‌సకే ఉందని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌ రెడ్డి గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ అసమ్మతి మొదలు భవిష్యత్తు కార్యాచరణ వరకూ వివిధ అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు రేవంత్‌ మాటల్లోనే..
టీపీసీసీ చీఫ్‌గా నియమితులవడంపై ఎలా ఫీలవుతున్నారు?
నాకున్న అనుభవం కంటే ఇది పెద్ద బాధ్యత. గతంలో అనుభవజ్ఞులు, రాజకీయ దురంధరులు ఈ బాధ్యతను నిర్వహించారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు పోవాల్సిన బాధ్యత నాపై ఉంది.
పార్టీకి పూర్వ వైభవం ఎలా తీసుకొస్తారు?
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు సహజం. 1994 నుంచి పదేళ్లపాటు టీడీపీ అధికారంలో ఉంటే.. 2004 నుంచి పదేళ్లపాటు కాంగ్రెస్‌ పాలన సాగింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ 2023 వరకూ ఉండనుంది. గత అనుభవాలు, తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే ప్రభుత్వాన్ని మార్చాలన్న ప్రజల నిర్ణయం ఇప్పటికే జరిగిపోయింది. ఇది సీఎం కేసీఆర్‌కూ అర్థమైంది. కాంగ్రె్‌సనే ప్రత్యామ్నాయమని ప్రజలు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజీగూడ డివిజన్‌ ఉప ఎన్నికే దీనికి ఉదాహరణ. ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్‌ మూడో స్థానంలో ఉంటే, బీజేపీ, టీఆర్‌ఎస్‌ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి పోటీ చేస్తే.. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రజలు గెలిపించారు. సాగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి కేవలం ఏడు వేల ఓట్లే వచ్చాయి. అంటే, ప్రతిపక్షంలో బీజేపీనా, కాంగ్రెసా అన్న చర్చ వచ్చినప్పుడు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెసేనని ప్రజలు భావిస్తున్నారు.
వరుస ఓటముల నేపథ్యంలో.. పార్టీకి జవసత్వాలు ఎలా అందిస్తారు?
కేసీఆర్‌ సీఎం అయ్యాక పోలీసు, రెవెన్యూ, విజిలెన్స్‌ తదితర యంత్రాంగాలు టీఆర్‌ఎస్‌ అనుబంధ విభాగాలుగా మారాయి. పోలీస్‌స్టేషన్లు మండల స్థాయి పార్టీ కార్యాలయాలుగా మారాయి. ఇతర పార్టీల నుంచి గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులపై అన్ని రకాల ఒత్తిడులు తీసుకొచ్చి.. పోలీస్‌స్టేషన్లలోనే కండువాలు మార్చే పరిస్థితి వచ్చింది. తన తప్పుడు విధానాలను ప్రశ్నించకుండా, ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేయకుండా ఇతర పార్టీల వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. కానీ, సందర్భం వచ్చినప్పుడు ప్రజలూ అంతే వేగంగా స్పందిస్తున్నారు. కొడంగల్‌లో నన్ను, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పట్టుబట్టి ఓడిస్తే.. మల్కాజ్‌గిరి, భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు గెలిపించారు.
పార్టీని వీడినవారిని వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం ఉందా? 
ఘర్‌ వాపసీ కార్యక్రమాన్ని చేపడతాం. కొన్ని కారణాల వల్ల కాంగ్రె్‌సను వీడిన వారిని; టీడీపీ నుంచి బెదిరించి తీసుకున్నోళ్లను కూడగడతాం. సీనియర్‌ నాయకులతో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా తిరిగి వచ్చే వారితో చర్చించి రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి హామీ ఇవ్వాలన్నది నిర్దిష్టంగా తెలుసుకుంటాం. వారి నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే పార్టీ కండువా కప్పుతాం. ఇక, నా వరకూ కార్యకర్తలే కథానాయకులు. నా బలం, ప్రాధాన్యం వారే. బూత్‌ స్థాయి నుంచీ పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకుని ముందుకు వెళతాం.
కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులు అధికార పార్టీలో చేరతారంటూ ప్రజల్లో ఏర్పడిన ముద్రను ఎలా తొలగిస్తారు?
ఇక నుంచి కాంగ్రెస్‌ ఇచ్చే బీ ఫారంపై గెలిచిన తర్వాత ఎవడైనా పార్టీ మారితే.. వాడిని రాళ్లతో కొట్టి చంపాలని, గడ్డపార తెచ్చి వాడి గుండెల్లో దింపాలని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. వారు గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తే అక్రమ కేసులు, సొంత అవసరాలకు భయపడి పార్టీ మారుతున్నారు. దాంతో, కాంగ్రె్‌సకు సంస్థాగతంగా చాలా దెబ్బ తగులుతోంది. ఇక ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీలో ఉంటడా.. పోతడా అని నిర్ధారణ చేసుకున్నంకనే ఇస్తం. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారితే తెలంగాణ సరిహద్దులు దాటే వరకూ కార్యకర్తలతో తరిమి కొట్టిస్త. ఫిరాయింపుదారులపై తీసుకునే కఠిన చర్యల్లో నేనే ముందుంట. పార్టీ మారేవాని సంగతి చెబుత.
ఇప్పటికే పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా?
దీన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటా. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశమై ఈ కేసు న్యాయస్థానంలో ఏ స్థాయిలో ఉందో చర్చిస్తా. సుప్రీం కోర్టులో కేసు వేసి అతి తక్కువ సమయంలో విచారణకు వచ్చేలా ప్రయత్నం చేస్తాం. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాలు అనర్హత వేటు వేశాయి.
పార్టీ పగ్గాలు చేపట్టగానే మొదటి సవాలు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక.. à°Ÿà±€à°†à°°à±â€Œà°Žà°¸à±â€Œ వర్సెస్‌ ఈటల అన్న పరిస్థితిని మీరు ఎలా ఎదుర్కొంటారు?
పంపకాల తగాదాతో ఈటలపై కేసీఆర్‌ వేటు వేశారు. ఆయన నుంచి తప్పించుకోవడానికి ఈటల బీజేపీ చాటున దాక్కున్నారు. ఎన్నికల్లో.. ఈ ఏడేళ్లలో మోదీ ఏం చేశారు.. కేసీఆర్‌ ఏం చేశారన్న చర్చ వస్తుంది. కోట్లాదిమంది కొవిడ్‌ బారినపడి.. ఆస్పత్రి బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. కేంద్రం టీకాలనూ ఇవ్వలేకపోయింది. రైతుల ఆదాయం డబుల్‌ చేస్తమని చెప్పి చేయలేదు. ఇక, రాష్ట్రం ఏర్పడినప్పుడు 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. 1.91 లక్షల ఖాళీలు ఉన్నట్లు ఇటీవల బిశ్వాల్‌ కమిటీ ప్రకటించింది. ఈ ఏడేళ్లలో 85 వేల ఖాళీలు పెరిగాయి. దీనికి ఏం సమాధానం చెబుతారు? బాబు, బేటా బడాయి మాటలు చెబుతున్నరు.   
బీసీలను దగ్గర చేసుకునే కార్యక్రమాలతో బీజేపీ దూసుకు వస్తోందన్న ప్రచారం ఉంది. దీన్ని ఎలా ఎదుర్కొంటారు?
బీజేపీ ప్రత్యామ్నాయం కానే కాదు. అది టీఆర్‌ఎ్‌సకు బీ టీమ్‌. కేసీఆర్‌ను జైలుకు పంపుతమని బండి సంజయ్‌ అంటడు. కేసీఆర్‌ను జైలుకు పంపే మాట దేవుడెరుగు. ఆయన అవినీతిపై సీబీఐ, ఈడీ, ఐటీ, సెంట్రల్‌ విజిలెన్స్‌లతో విచారణకు ఎప్పుడు ఆదేశిస్తారో కటాఫ్‌ డేట్‌ చెప్పండి. కావాలంటే ఆధారాలతో కూడిన ఫిర్యాదును నేను ఇస్తాను. సంజయ్‌ చేతిలో కేసీఆర్‌ బండారం ఉండి కూడా బయట పెట్టడం లేదంటే ఏం బేరసారాలు చేసుకుంటున్నట్టు? బండారం ఉండి కూడా దానిని బయట పెట్టకపోవడమూ నేరమే. ప్రజల్లో వారిపై నమ్మకం కలగాలంటే ఒక విచారణ సంస్థనైనా క్షేత్రస్థాయికి పంపాలి.
కొత్త బాధ్యతలోనూ కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై దూకుడు కొనసాగుతుందా?
అంశాల ప్రస్తావన వచ్చినప్పుడు వాటికి బాధ్యుడైన కేసీఆర్‌పై పదునైన పదజాలాన్ని వాడుతుంటానే కానీ నేను ఎప్పుడూ వల్గర్‌ లాంగ్వేజ్‌ వాడలేదు. భాష పదునుగుండి అది గుచ్చుకున్నట్టు ఉంటది. ఆధారాలు లేకుండా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అప్పుడు ప్లేయర్‌ను. ఇప్పుడు టీమ్‌కు కెప్టెన్‌ను. ఈ పెద్ద బాధ్యతలో వ్యూహాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. దూకుడనేది నా సహజ లక్షణం. దాంట్లో మారేది ఏమీ ఉండదు. ఇప్పుడు పాసింజర్‌ వెహికిల్‌ నడుపుతున్న డ్రైవర్‌ను కాబట్టి.. చిన్న తప్పు చేసినా పాసింజర్లకు ప్రమాదం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు ఇవ్వాల్సిన దాని కంటే వెయ్యింతలు ఎక్కువ ఇచ్చారు. ఇక ఆయన్నుంచి గుంజుకోవడమే మిగిలింది. కేసీఆర్‌కు శ్రమ కంటే ఫలితం చాలా ఎక్కువగా వచ్చింది. ఆయన కుటుంబానికి సీఎం, మంత్రులు, ఆస్తులు, విలాస జీవితం వచ్చాయి. కానీ ప్రాణాలు కోల్పోయిన 1200 మంది అమర వీరుల కుటుంబాలకు గుర్తింపు  దక్కలేదు. వారి కుటుంబాలకు కనీసం ఎంపీపీ స్థాయి పదవి కూడా ఇవ్వలేదు. సిద్ధాంతకర్త జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీలనూ మర్చిపోయాడు. అమరవీరులకు స్తూపమూ కట్టలేదు.
రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను ఎలా ఆకర్షిస్తారు?
ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ బీసీలే. అసలు కాంగ్రెస్‌ ఫ్యాబ్రికే స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం. తెలంగాణలో ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదు. కేసీఆర్‌ చేతిలో బందీ అయి ఉంది. గతంలో ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వ్యవసాయానికి ఉచిత కరెంటు, ఉపాధి హామీ తదితర పథకాలు తీసుకు వచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా? వాటి లబ్ధిదారుల్లో అత్యధికులు బడుగు బలహీన వర్గాలు కాదా? కేసీఆర్‌ వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఎత్తేసిండు. సంక్షేమం గురించి కాంగ్రె్‌సకు ఒకరు నేర్పాలా? పెన్షన్‌ను కనిపెట్టింది కాంగ్రెస్‌ కాదా? మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని ఇస్తే దివాలా రాష్ట్రంగా కేసీఆర్‌ మార్చాడు. బంగారు బాతును ఇస్తే కోసుకు తింటుండ్రు. అనుబంధ సంఘాల సంగతి సరే.. అసలు రాజకీయ పార్టీలే రాష్ట్రంలో క్రియాశీలంగా లేవు. గృహ నిర్బంధాలు చేస్తున్నారు. కేసీఆర్‌ నియంత కిమ్‌లా తయారైండు. చైనాలో ఒక విధానం ఉంది. వ్యాపారం, వ్యభిచారం, తాగుడు, తిరగడం ఏమి చేసినా ఏమీ అనరు. కానీ, అధ్యక్షుడు ఏం చేస్తున్నాడన్న ఆలోచన రాగానే బుల్డోజర్‌ ఎక్కించి చంపేస్తరు. కేసీఆర్‌ కూడా తెలంగాణలో ఇసుక దోపిడీ, భూముల ఆక్రమణలు వంటివి ఏం చేసినా ఏమీ అనడు. కేసీఆర్‌ ఏం చేస్తున్నడు అనగానే కేసులు కడుతుంటడు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల ప్రోగ్రెస్‌ రిపోర్టు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రోగ్రెస్‌ రిపోర్టుపై శాఖలవారీగా చర్చకు సిద్ధమా?  
కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొందరు టీఆర్‌ఎస్‌, బీజేపీల్లోకి 
వెళుతున్నట్లుగా ప్రచారంలో ఉంది?
నాకున్న సమాచారం ప్రకారం ఎవరూ వెళ్లట్లేదు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే కచ్చితంగా పరిష్కరిస్తాం. వారి హోదాను బట్టి పెద్దలతో మాట్లాడి అవకాశాలు కల్పిస్తాం. కాంట్రాక్టులు, డబ్బులు కావాలని పోతే మాత్రం చేయడానికి ఏముంటది?
టీఆర్‌ఎస్‌ నేతలు తరచూ ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తుంటారు. దీనికి మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా?
ఇది ఆరేళ్ల కిందటి కేసు. న్యాయస్థానాల్లో నడుస్తోంది. తీర్పులు ఇవ్వాల్సింది పార్టీలు కాదు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్లాను. ఎంపీగా గెలిచా. ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవీ ఇచ్చింది. ఇంక దీనిపై చెప్పేది ఏమైనా ఉంటే కోర్టుకే చెబుతాను కదా? జగన్మోహన్‌ రెడ్డిపై కేసులు 2011లో నమోదయ్యాయి. ఇప్పటికీ నడస్తున్నయి. నాపై కేసులు 2016లోవి. జగన్‌ వెనక ఉన్నోళ్లు.. ముఖ్యంగా విజయసాయిరెడ్డి వంటి వారు నా కేసు గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది. ఆయన పేరు ఎక్కడ రాసుందో ఆయనకు తెలియనట్లు ఉంది పాపం. వారిని వారు అద్దంలో చూసుకుని మాట్లాడితే మంచిగుంటది. నిన్నగాక మొన్న టీడీపీ నుంచి వచ్చి కాంగ్రె్‌సలో అధ్యక్షుడయ్యానని షర్మిల అన్నట్లు చూశాను. వైఎ్‌సఆర్‌ ఏ పార్టీ.. కాంగ్రెసా? మొదట ఆయన రెడ్డి కాంగ్రెస్‌. జగన్‌ ఏ పార్టీ? కాంగ్రెస్‌. వీరు బయటికి పోవచ్చు. ఆయన లోపలికి రావచ్చా!?
పార్టీ విజయానికి నాలుగు సూత్రాలు
క్షేత్రస్థాయిలో కేడర్‌ కోసం నిలబడతా. పార్టీ జెండా మోసినోళ్లను.. కష్టపడిన వారిని గుర్తు పెట్టుకుంటాం. పడిన కష్టానికి పదింతలు పార్టీ సహాయపడుతుంది. ఇక పార్టీని ప్రధానంగా నాలుగు విధాలుగా నడుపుతాం. అవి.. పాలసీ, కాలిక్యులేషన్‌, కమ్యూనికేషన్‌, ఎగ్జిక్యూషన్‌. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఏ విధానాలు అవలంబించాలన్నది పాలసీ. ఎన్నికల్లో గెలవడానికి ఏ పార్టీలను, ప్రజా, కుల సంఘాలు, వ్యక్తులను కూడగట్టాలన్న కాలిక్యులేషన్‌ చేస్తాం. నిర్ణయాలను నేతలు, మాధ్యమాల ద్వారా ప్రజలకు కమ్యూనికేట్‌ చేస్తం. పార్టీని బూత్‌స్థాయి నుంచీ నిర్మించి ఎగ్జిక్యూట్‌ చేస్తాం.
కోమటిరెడ్డి ఎపిసోడ్‌పై మీ స్పందన?
గందరగోళాన్ని గమనించి ఆయన ఇప్పటికే ఇవ్వాల్సిన వివరణ ఇచ్చేశారు. కోమటిరెడ్డి సోదరులు మా కుటుంబం. రాజగోపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డిలతో మాట్లాడాను. మా కుటుంబం సోనియా నిర్ణయాన్ని గౌరవిస్తుందని, వెంకట్‌రెడ్డితోనూ మాట్లాడతామనీ చెప్పారు. వారి కుటుంబం నాకు, కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది.
సీనియర్లను ఎలా కలుపుకొనిపోతారు?
వరుసగా సీనియర్లను కలుస్తున్నా. సోనియాగాంధీ నిర్ణయం జరగనంత వరకు ఏ అభిప్రాయాలైనా చెప్పవచ్చు. ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీలో ఎవరైనా వ్యతిరేకిస్తారని అనుకోవట్లేదు. పార్టీలో ఏది వచ్చినా టీ కప్పులో తుపానే. ఏదో జరుగుతుందని గోతికాడ గుంటనక్కల్లా ఎదురు చూస్తున్న వారి ఆశలు నెరవేరవు.
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ తొలి కాంగ్రెస్‌ సీఎం మీరేనా?
అందరి అభిప్రాయాలు సేకరించి పార్టీ అధ్యక్షుడిని ఎలా నిర్ణయించారో.. అలాగే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏ స్థానంలో ఉండాలన్నది పార్టీ, అధినేత సోనియా గాంధీ నిర్ణయిస్తారు. కొందరు అభిమానులు, ఉత్సాహవంతులు ఎక్కడికైనా పోతే సీఎం సీఎం అంటూ నినాదాలు ఇస్తున్నరు. దానిని ఇతర నాయకులను అగౌరవపరిచినట్లుగా కొందరు భావిస్తున్నారు. ఈ నినాదాలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది. కొన్ని అంశాల్లో సహచర నాయకులకు ఫోన్లు చేసి తిడుతున్నారనీ ప్రచారం ఉంది. వారు ఎవరో 90 శాతం నాకు తెలియనోళ్లే. వారు ఎవరిని తిడుతున్నారో వారికి నష్టం లేదు. తిట్టినోళ్లకీ లాభం ఉండదు. చర్చ నాపై జరగడం వల్ల నా ఇమేజీకి నష్టం జరుగుతుంది. కాబట్టి, ఎవరూ ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడొద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనకంటే చాలా సీనియర్లు, అనుభవం ఉన్నవాళ్లు, ప్రజల కోసం కొట్లాడినోళ్లు ఉన్నారు. వారికి ఏ మాత్రం ఇబ్బంది కలిగేట్లు మాట్లాడినా నన్ను అవమానించినట్లే. అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దు. ఇవి పార్టీకి, వ్యక్తిగతంగా నాకూ ప్రయోజనం చేకూర్చేవి కావు.

Related Keywords

China ,Nalgonda Komatireddy ,Nizam Terai ,Sonia Gandhi ,Advertising Committee ,Cm Assembly ,His Closed ,President How ,சீனா ,சோனியா காந்தி ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.