comparemela.com


నీళ్ల చుట్టూ నయా రాజకీయం!
చెట్టుఎక్కుదామంటే ఆకులు అడ్డొస్తున్నాయని వెనుకటికి ఎవడో అన్నాడట! కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నప్పటికీ... హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల భద్రత, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటించవలసి వస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేసిన ప్రకటన కూడా ఇలాగే ఉంది. జగన్‌ రెడ్డి పుట్టక ముందు నుంచే సీమాంధ్రులు తెలంగాణలో ఉంటున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా వారికెవరూ ఎటువంటి అపకారమూ చేయలేదు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులకు వచ్చిన కష్టం కూడా ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఆంధ్రాలో ఉంటున్న వారి కంటే తెలంగాణలో ఉంటున్న సీమాంధ్రులే ఎక్కువగా అభివృద్ధి చెందారు. తమ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణలో ఫిర్యాదు చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇందుకు విరుద్ధంగా కంపెనీలను, సంస్థలను గుంజుకుని అస్మదీయులకు కట్టబెడుతున్నారు. విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోపై అధికార పార్టీ పెద్దలు కన్నేశారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలజగడంపై ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యతిరేకించే దమ్ము, ధైర్యం లేని జగన్‌ అండ్‌ కో ఇప్పుడు హైదరాబాద్‌లోని సీమాంధ్రులను రక్షణ కవచంగా వాడుకోవాలని చూడటం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసిన జగన్‌ రెడ్డి, తాను అగ్రజుడిగా భావిస్తున్న కేసీఆర్‌కు మాత్రం ఫోన్‌ చేసే సాహసం చేయలేదు. తాను సంయమనం కోల్పోతే హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు ఏమవుతుందోనని ఇప్పుడు ఆందోళన పడుతున్న జగన్‌ రెడ్డి, 2016లో తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో జలదీక్ష చేసిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదు. అప్పుడు జగన్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో నివసించేవారు. అప్పటికి తాడేపల్లికి మకాం మార్చలేదు. అయినా తాము చేపట్టిన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన జగన్‌ రెడ్డికి నష్టం చేయడానికి తెలంగాణవాదులు ప్రయత్నించిందేమీ లేదు. అప్పట్లో ఓటుకు నోటు కేసుకు భయపడి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించడానికి చంద్రబాబు ప్రయత్నించలేదని జగన్‌ అండ్‌ కో నిందించారు. అవన్నీ గుర్తున్నవాళ్లు హైదరాబాద్‌లో ఉన్న తన ఆస్తులను కాపాడుకోవడానికే జగన్‌ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఇప్పుడు నిందిస్తున్నారు. ఇంతకూ కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తొండిగా వ్యవహరిస్తున్నదా? లేక రాయలసీమకు నీటిని తరలించడం కోసమే ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నదా? ఈ విషయంలో ఎవరి వాదనలు వారికి ఉంటాయి కనుక నిజం ఎప్పటికీ బయటకు రాదు. ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పరిస్థితి సహజంగానే పైచేయిగా ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ మధ్య మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల మధ్య జల వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజల ప్రయోజనాలు పక్కకు జరిగి రాజకీయ ప్రయోజనాలు చొరబడతాయి. ఇప్పుడు ఆంధ్రా–తెలంగాణ మధ్య జరుగుతున్నది ఇదే! 
ఆనాడే మేల్కొని ఉంటే...
పులిచింతల ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి చేయడం అన్యాయం అని, దీనివల్ల నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి పోతున్నాయని జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి ఏర్పడటానికి సీమాంధ్రకు చెందిన నాయకులకు చిత్తశుద్ధి, దూరదృష్టి లేకపోవడమే కారణం. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు పూర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం. వరదలొచ్చినప్పుడు నాగార్జునసాగర్‌ నుంచి విడుదల చేసే నీటి నుంచి 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడం కోసం పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్‌ చేశారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. తొలుత ఎన్టీఆర్‌ హయాంలో ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంది. పులిచింతలకు కుడివైపున విద్యుత్‌కేంద్రాన్ని నిర్మించడానికి ఎన్టీఆర్‌ శంకుస్థాపన చేశారు. అప్పుడు నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు తమ ప్రాంతం ముంపునకు గురవుతుందంటూ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత విద్యుత్‌కేంద్రాన్ని ఎడమవైపున నిర్మించాలని వైఎస్‌ రాజశేఖర రెడ్డి నిర్ణయించారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచన చేసింది. దీంతో పులిచింతల ఎడమ వైపున, అంటే తెలంగాణ భూభాగంలో విద్యుత్‌ కేంద్రం నిర్మితమైంది. రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణానదికి కుడి వైపున ఉన్న విద్యుత్‌కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌కు, ఎడమ వైపున ఉన్నవాటిని తెలంగాణకు పంచారు. ఈ కారణంగానే పులిచింతల వద్ద విద్యుత్‌ ఉత్పత్తి చేసే అధికారం, వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి లభించాయి. పులిచింతల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు చెందినప్పటికీ విద్యుత్‌కేంద్రం మాత్రం తెలంగాణకు దక్కింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణవాదులు తమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి పెట్టగా, సీమాంధ్రకు చెందిన నాయకులు మాత్రం సమైక్య ఉద్యమం పేరిట సొల్లు కబుర్లు చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యమని అప్పుడే గుర్తించి, తమ భూభాగంలో నిర్మితమైన పులిచింతల ప్రాజెక్టులో భాగమైన విద్యుత్‌ కేంద్రాన్ని కూడా తమకే కేటాయించాలని పట్టుబట్టి ఉంటే దక్కి ఉండేదేమో! అంటే నాయకులకు చిత్తశుద్ధి, దూరదృష్టి లేకపోవడం వల్ల ఈ విద్యుత్‌కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌ కోల్పోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఏడిస్తే ఏం ప్రయోజనం? తమకు దక్కిన విద్యుత్‌కేంద్రం నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణకు ఉండదా? ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలోకి వచ్చే కుడివైపున ఆనాడే విద్యుత్‌కేంద్రాన్ని నిర్మించినా ప్రస్తుత పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. ఈ విషయం అలా ఉంచితే, పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించిన తర్వాత పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ప్రకాశం బ్యారేజీకి తరలించడం వల్ల కృష్ణాజిల్లాకు సాగునీటి సమస్య తీరిపోయింది. కృష్ణాజలాల కోసం వేచిచూడకుండా రైతులు సకాలంలో పంటలు వేసుకుంటున్నారు. వేసవిలో మంచినీటి కొరత ఏర్పడినప్పుడు మాత్రమే పులిచింతల ఉపయోగపడుతోంది. ఈ సీజన్‌లో వరదలు రాని పక్షంలో పులిచింతల ఖాళీ అయిపోతుంది. అప్పుడు మంచినీటి కొరత ఏర్పడినా నీళ్లు ఉండవు. అయితే కాళేశ్వరం నుంచి వర్షాకాలంలోనే నీటిని ఎత్తిపోస్తున్నారు కనుక విద్యుత్‌ అవసరం తెలంగాణకు ఎక్కువగా ఉంటుంది. అందుకే పులిచింతల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఎవరిని తప్పుబట్టాలి?
రాజకీయమే పరమావధి!
హైదరాబాద్‌లోని సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని బాధ్యత నుంచి తప్పుకోవడానికి జగన్‌ రెడ్డి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆహ్వానించిందే తడవుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై ఫొటోలకు పోజులిచ్చిన జగన్‌ రెడ్డి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నించలేదో తెలియడం లేదు. ప్రధానికి ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ లేఖను ప్రధాని నరేంద్ర మోదీ చూసి స్పందించేలోపు పులిచింతల ఖాళీ అవుతుంది. పులిచింతలలో నిల్వ ఉన్న నీరు ఎండాకాలం అవసరాలకు కావలసి ఉంటుందని జగన్‌ రెడ్డి భావించే పక్షంలో కేసీఆర్‌కు ఫోన్‌ చేసో, లేక వ్యక్తిగతంగా కలిసో... ‘మీకు విద్యుత్‌ కావాలనుకుంటే పులిచింతలలో ఎంత ఉత్పత్తి చేస్తున్నారో అంత విద్యుత్‌ను శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి ఉత్పత్తి చేసి ఇస్తాం. నీళ్లను మాత్రం వృథా చేయవద్దు’ అని కోరవచ్చు కదా! ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా తెలంగాణ మంత్రులు నోరు జారడం, ఆంధ్రా ప్రాంత మంత్రులు లేస్తే మనుషులం కాదన్నట్టుగా ఉత్తుత్తి హెచ్చరికలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా? చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోగల సమస్యలను కూడా జటిలం చేస్తూ రాజకీయ అవసరాల కోసం ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇరువైపులా జరుగుతోంది. రాయలసీమకు మేలు చేయడానికి తాను ప్రయత్నిస్తుంటే కేసీఆర్‌ అండ్‌ కో ఇబ్బందులు సృష్టిస్తున్నారని సీమప్రజలు భావించాలని జగన్‌ రెడ్డి కోరుకుంటున్నట్టుగా ఉంది. తెలంగాణకు చెందిన నీటిని జగన్‌ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తరలిస్తూ ఉంటే తాను పోరాడుతున్నానని తెలంగాణ ప్రజలు భావించాలని కేసీఆర్‌ కోరుకుంటున్నట్టుగా ఉంది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరిగే వరకు ఇదే తంతు కొనసాగవచ్చు. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడం ద్వారా ఇంటి పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితి అవసరం ఇంకా ఉందని ప్రజలు భావించేలా కేసీఆర్‌ ఎత్తుగడలు ఉన్నాయి. అనుమతులు, నిధుల కేటాయింపులు లేని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చూపెట్టి సీమప్రజల మనసు చూరగొనవచ్చునన్నది జగన్‌ రెడ్డి కోరిక కావచ్చు. మొత్తానికి ఇద్దరికీ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి కనుక ప్రస్తుత ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా పులిచింతలను ఖాళీ చేయడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతోందంటే అది కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకే. వచ్చే వేసవిలో తాగునీటి కొరత ఏర్పడితే ఇబ్బంది పడేది వారే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ రెడ్డి బలహీనతలు, బేలతనం బయటపడుతున్నాయి. నిన్నటిదాకా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని బీరాలు పలికి ఇప్పుడు ‘మనం చేయగలింది ఏమీ లేదు’ అని చేతులెత్తేశారు. ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా తన వ్యాపార ప్రయోజనాలు, ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్‌కు లొంగిపోక తప్పని పరిస్థితి జగన్‌ రెడ్డికి ఏర్పడింది. అంతేనా, ఎన్నికల సమయంలో కేసీఆర్‌ పలు రూపాల్లో చేసిన సహాయాన్ని మర్చిపోయి రాష్ట్ర హక్కుల కోసం ఎలా పోరాడగలరు? అందుకే హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్రులను బూచిగా చూపిస్తున్నారు. సర్వ అనర్థాలకూ చంద్రబాబు నాయుడే కారణం అని చెబుతూ వస్తున్న జగన్‌ అండ్‌ కోకు ప్రస్తుత వివాదానికి కూడా చంద్రబాబే కారణమని చెప్పవచ్చునన్న ఆలోచన ఎందుకు రాలేదో!? పొరుగు రాష్ర్టాలతో, ముఖ్యంగా తెలంగాణతో సఖ్యతగా ఉండాలని తరచుగా చెప్పే జగన్‌ రెడ్డి.. ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వంపై ప్రధానికి ఫిర్యాదు చేయడం ద్వారా చేతులు దులుపుకొన్నారు. రాయలసీమను కూడా కోనసీమగా చూడాలని ఉందని ఏడాదిన్నర క్రితం గొప్పగా చెప్పి ఔదార్యాన్ని చాటుకోవడమే కాకుండా నగరిలో ఉండే ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లి విందు ఆరగించి వచ్చిన కేసీఆర్‌, ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం ప్రస్తుత వివాదానికి తెర తీశారు. జగన్‌ రెడ్డి కాకుండా ఇప్పుడు మరెవరు అధికారంలో ఉన్నా రాయలసీమ నుంచి కొన్ని వృద్ధపులులూ, సింహాలూ సీమ హక్కుల కోసం రోడ్డు మీదకు వచ్చి గాండ్రించేవి. ఇప్పుడు తమవాడే అధికారంలో ఉన్నందున వారికి రాయలసీమలో ఎనలేని అభివృద్ధి కనిపిస్తూ ఉండవచ్చు. సీమాంధ్ర నాయకుల గురించి కేసీఆర్‌కు బాగానే తెలుసు కనుక ఆయన ఇలాగే ముందుకు వెళుతూ ఉంటారు. నిజానికి ఈ నీళ్ల జగడం వెనుక ఇంకేదో మతలబు కూడా ఉంది. తెలంగాణ గడ్డ మీద జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల సొంత పార్టీ పెట్టుకోవడంపై కేసీఆర్‌ ఆగ్రహంగా ఉన్నారట. సోదరిని కట్టడి చేయలేకపోతున్న జగన్‌ రెడ్డిపై ఆయన మండిపడుతున్నారట. ఈ వ్యవహారంలో జరగబోయేది ఏమిటి? జరిగింది ఏమిటి? అన్నది వచ్చే వారం చెప్పుకొందాం!
పంథా మార్చుకునే ప్రసక్తే లేదు!
గత వారం నేను వెల్లడించిన కొన్ని అంశాలపై నీలిమీడియాలో భాగంగా ఉంటున్న జగన్‌ రెడ్డి భక్తులు గుండెలు బాదుకున్నారు. జగన్‌బాబును బాధపెడతారా? ఇదేమి జర్నలిజం అంటూ చిందులు తొక్కారు. మంత్రి కొడాలి నాని యథావిధిగా బూతులు తిట్టారు. ‘ఆంధ్రజ్యోతి’కి, ‘ఏబీఎన్‌’కూ విశ్వసనీయత లేదని నోరు పారేసుకున్నారు. జగన్‌ రెడ్డి–షర్మిల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయని, తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారని కొంతకాలం క్రితం నేను బహిర్గతం చేసినప్పుడు కూడా ఇలాగే నిందించారు. అప్పుడు నేను చెప్పిందే నిజమైంది. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. కరోనా గురించి భయపడాల్సింది లేదని ఏసు ప్రభువు తనకు చెప్పారని జగన్‌ రెడ్డి అధికారులతో ఎప్పుడు అన్నదీ తేదీతో సహా గత వారం నేను వెల్లడించాను. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తూ ఆ సమయంలో అక్కడే ఉన్న అధికారి ద్వారా సదరు విషయం నాకు తెలిసిందని కూడా చెప్పాను. మాజీ ఐఏఎస్‌ అధికారి చెప్పారు అని అంటే, ఆ అధికారి ఎవరో బయటపెట్టాలని సవాలు విసిరారు. సమాచారం అందించే వారి పేర్లను జర్నలిస్టులు వెల్లడించాల్సిన అవసరం లేదని నన్ను విమర్శించిన వారికి తెలియకపోవడం విషాదం! ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఏం జరిగినా అదంతా దేవుడు రాసిన స్ర్కిప్టు ప్రకారమే జరుగుతోందని నమ్మే వ్యక్తి జగన్‌ రెడ్డి. అలాంటప్పుడు అదే దేవుడు ఐఏఎస్‌ అధికారితో ఆ సమాచారాన్ని నాకు చెప్పించి ఉంటారని భావించకుండా నీలిమూకను ఉసిగొల్పడం ఎందుకో? దారిన పోయే దానయ్య చెబితే రాస్తారా? అంటూ జర్నలిస్టులుగా చలామణి అవుతున్న కొందరు వ్యాఖ్యలు చేశారు. కాలమిస్టులు సమాచారం ఎలా సేకరిస్తారో ఇలాంటి వాళ్లు మరచిపోయి ఉంటారు. తాము అమితంగా ప్రేమించే జగన్‌ రెడ్డికి నష్టం జరుగుతుందని భావించే వాళ్లు బాధపడడంలో, నన్ను విమర్శించడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. నేను జర్నలిజంలోకి ప్రవేశించిన కొత్తలో ‘హిందూ’ బ్యూరో చీఫ్‌గా రాజేంద్రప్రసాద్‌, ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు సుందరం, ‘దక్కన్‌ క్రానికల్‌’కు రవీంద్రనాథ్‌, ‘ఈనాడు’కు ఎస్‌.ఎన్‌.శాస్ర్తి, ‘ఆంధ్రజ్యోతి’కి ఐ.వెంకట్రావ్‌, ‘ఆంధ్రపత్రిక’కు పాపయ్యశాస్ర్తి బ్యూరో చీఫ్‌లుగా ఉండేవారు. వీరంతా ప్రతి వారం తమ పేరిట కాలమ్స్‌ రాసేవారు. ఆ వారంలో జరిగిన పరిణామాలకు తాము సేకరించిన సమాచారాన్ని జోడించి కాలమ్స్‌ రాసేవారు. ఆనాడు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్లు సైతం రాజకీయాల్లో ఏం జరుగుతోంది, సొంత పార్టీలోని తమ ప్రత్యర్థుల ఎత్తుగడలు ఏమిటి అనేవి తెలుసుకోవడానికి సదరు కాలమ్స్‌ పైనే ఆధారపడేవారు. అప్పుడు నీకా సమాచారం చెప్పింది ఎవరు? అని వారెవరూ అడిగేవారు కాదు. కాలమిస్టులు రాసిన దాంట్లో నుంచి తెలుసుకోవలసిన సమాచారాన్ని తీసుకునేవారు. ఇప్పుడు వారి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. తెలిసినవాళ్లు కూడా ఎవరో ఐఏఎస్‌ అధికారి చెబితే మాత్రం రాసేయడమేనా? అని తెగ బాధపడిపోవడమే ఆశ్చర్యంగా ఉంది. మీడియాలో ఉండే వారికి వివిధ మార్గాల ద్వారా సమాచారం అందుతూ ఉంటుంది. మనకుండే పరిచయాలను బట్టి రహస్య సమాచారం కూడా అందుతూ ఉంటుంది. జాతీయ మీడియాలో కూడా ఇలాగే సమాచారం వస్తుంది. నాకు సమాచారం ఇచ్చిన ఐఏఎస్‌ అధికారిని దారిన పోయే దానయ్య అని నిందించే వాళ్లను చూసి జాలిపడాల్సిందే. ఏ కాలమిస్ట్‌కు అయినా వారికి ఉండే విశ్వసనీయతను బట్టి సమాచారం అందిస్తారు. నీకు మాత్రమే ఎందుకు చెప్పారు అంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. జగన్‌ రెడ్డిని విమర్శించడమే మహాపాపం అన్నట్టుగా నీలిమీడియాలో భాగమైన కొంతమంది విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుకు మేలు చేయడం కోసమే జగన్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారని విమర్శించడం ఫ్యాషన్‌ అయింది. తప్పుడు వార్తలు రాస్తే ‘ఆంధ్రజ్యోతి’పై కేసులు పెట్టమని ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి ఆదేశించడమే కాకుండా జీవో కూడా జారీ చేశారు కదా! మేం నిజంగా తప్పుడు వార్తలే రాసి ఉంటే ఈపాటికి మాపై కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టేవారు కాదా? చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ‘ఆంధ్రజ్యోతి’కి అయాచితంగా వందల కోట్లు దోచి పెట్టారని ఇదే నీలిమూక ప్రచారం చేసింది. అదే నిజమై ఉంటే జగన్‌ రెడ్డి ఇప్పుడు మమ్మల్ని నిద్రపోనిచ్చే వారా? మేం అధికారంలోకి వచ్చాక అది చేస్తాం, ఇది చేస్తాం, జైల్లో వేస్తాం అన్నారు. రెండేళ్లు గడచినా ఏమీ చేయలేదే! అంటే మేం ఏ తప్పూ చేయలేదనే కదా! ‘ఆంధ్రజ్యోతి’ని పునఃప్రారంభించి 19 ఏళ్లు అవుతోంది. నాపై విమర్శలు చేసేవారి మాటలు నిజమే అనుకుందాం. ఈ పందొమ్మిదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఐదేళ్లు మాత్రమే మాతో ఘర్షణకు దిగని ప్రభుత్వం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు తెలంగాణలో గానీ ప్రభుత్వాలు మా సంస్థలపై కత్తిగట్టి వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనల రూపంలో మాకు న్యాయంగా రావాల్సిన వాటా కూడా ఇవ్వకపోయినా మేం ఎవరినీ దేబిరించడం లేదు. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు మాకు ఎంత నష్టం చేస్తున్నాయో నన్ను విమర్శించే వారికి తెలియదా? చంద్రబాబు కోసమో మరొకరి కోసమో మేం ఇంతలా నష్టపోవాల్సిన అవసరం లేదు. మేం నమ్మిన విలువలకు మాత్రమే కట్టుబడి ఉంటాం. పేటీఎం బ్యాచ్‌లో చేరిపోయి పారితోషికం కోసం నన్ను విమర్శించే వారివలె నేను ఎవరి వద్దా చేయి చాచను. అలాగైతే నేను కూడా జగన్‌ రెడ్డి, కేసీఆర్‌ వద్దకు వెళ్లి రాజీపడిపోవచ్చు కదా! మీడియా కూడా నిర్వీర్యం అయితే నోరు లేని వారికి దిక్కే ఉండదు. అందుకే ప్రశ్నించే గొంతుకగా ఉండటానికే నేను ఇష్టపడతాను. ప్రతి వారం నేను రాసే కాలమ్‌కు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యాఖ్యానాల వీడియోలను యూట్యూబ్‌లో పెట్టుకొని పలువురు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. ఇదొక రకంగా నాకు గర్వకారణమే అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి పాలన ఎలా ఉందో బుద్ధిజీవులు గ్రహించారు. వారంతా మాకు మద్దతుగా ఉన్నారు. మాకు సమాచారం ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు. జగన్‌ రెడ్డిపై అంతులేని ప్రేమతో పాటు చంద్రబాబుపై నిలువెత్తు విషం నింపుకొన్న వారు తమ మెదళ్లకు పట్టిన బూజును వదిలించుకోకుండా విమర్శిస్తే మాకు పోయేది ఏమీ లేదు. అటువంటి వాళ్లు రాష్ట్రప్రజలకు అపకారం చేసిన వారవుతారు. మీకు నచ్చిన నాయకుడిని మీరు పొగుడుకోండి. పల్లకీలో ఊరేగించుకోండి. మీ బాటలోనే అందరూ నడవాలని కోరుకోవడం సరికాదు. జగన్‌ రెడ్డితో ఏసు ప్రభువు మాట్లాడారా? లేదా? అన్న విషయాన్ని ఏసు ప్రభువు చెప్పాలి, లేదా జగన్‌ రెడ్డి చెప్పాలి. జగన్‌ నోటి నుంచి ఆ మాటలు వచ్చాయని ఒక అధికారి చెప్పిన విషయాన్ని మాత్రమే నేను రాశాను. అది నిజం కాదని చెప్పే అర్హత ఇతరులకు ఉండదు. ఇక మంత్రి కొడాలి నాని అయితే మేం ఏం రాసినా తమకు ఏమీ ఊడదు అనీ, ఏమీ రాలదు అనీ అన్నారు. కొడాలి నాని నోటి నుంచి వచ్చే దుర్గంధపూరిత భాష వల్ల మాకు కూడా ఏమీ ఊడదు. ఈ 19 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎన్నో దాడులను భరించాం. కిరాయి సైనికులుగా మారిన కొంతమంది నీలిమీడియా భాగస్వాములు చేస్తున్న విమర్శలు మా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. ‘ఆంధ్రజ్యోతి’ సాగిస్తున్న ప్రయాణం సరైన దారిలోనే ఉందని మేం భావిస్తున్నాం. అది నిజం కాని పక్షంలో ఫలితాన్ని కూడా మేమే అనుభవిస్తాం. అంతేగానీ ఆర్థిక ప్రయోజనాల కోసం మా పంథాను మార్చుకోబోం!
ఆర్కే
యూట్యూబ్‌లో 
‘కొత్త పలుకు’ కోసం
QR Code

Related Keywords

Narendra Modi ,Telangana Gary ,Kodali Nani ,Supreme Court ,Chandra Co ,Cm Office ,Vijayawada Center ,Visakhapatnam Naidu ,Prime Minister ,Andhra Pradesh ,Pulichinthala Project ,Nalgonda District ,River Krishna ,Pulichinthala Project Although ,Prime Minister Narendra Modi ,Reddy His ,Minister Kodali Nani ,Telangana Sharmila New ,New Bureau ,Mem More ,Freddy Jesus ,நரேந்திர மோடி ,கோடலி நானி ,உச்ச நீதிமன்றம் ,செ.மீ. அலுவலகம் ,ப்ரைம் அமைச்சர் ,ஆந்திரா பிரதேஷ் ,நல்கொண்டா மாவட்டம் ,நதி கிருஷ்ணா ,ப்ரைம் அமைச்சர் நரேந்திர மோடி ,அமைச்சர் கோடலி நானி ,புதியது பணியகம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.