comparemela.com


Jul 29,2021 06:55
షేక్‌స్పియర్‌ సుప్రసిద్ధ నాటకం 'మెక్‌బెత్‌'లో ఫ్యూడల్‌ ప్రభువు బాంకోని చంపాక అది భూతంలా అతడిని వెన్నాడినట్టు... నేడు మోడీ ప్రభుత్వాన్ని రాఫెల్‌ కుంభకోణం వెన్నాడుతోంది. రూ. 68 వేల కోట్ల విలువైన రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంపై పెద్దఎత్తున అవినీతి, మనీ లాండరింగ్‌, ఆశ్రిత పక్షపాతం, అక్రమాలు, పన్నుల మాఫీల ద్వారా అనుచిత లబ్ధి వంటి ఆరోపణలు వెలువడ్డాయి. దీనిపై ఈ ఏడాది జూన్‌ 14న ఫ్రెంచ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ పి.ఎన్‌.ఎఫ్‌ కి చెందిన ఆర్థిక నేరాల విభాగం లాంఛనంగా క్రిమినల్‌ దర్యాప్తు ప్రారంభించింది.
ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అకస్మాత్తుగా ఈ ఒప్పందాన్ని ప్రకటించినపుడు భారత్‌లో దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. ఎందుకంటే అప్పటికే రక్షణ పరికరాల సమీకరణ పద్ధతి (డిపిపి) కింద 126 రాఫెల్‌ యుద్ధ విమానాలను సమకూర్చుకునేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. డసాల్ట్‌ నుండి హెచ్‌.ఎ.ఎల్‌ కు సాంకేతికతను బదిలీ చేసుకుని, దానితో వీటిలో 108 విమానాలను భారత్‌లో బెంగళూరుకు చెందిన హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌.ఎ.ఎల్‌) తయారుచేసి ఇచ్చేలా కూడా అంగీకారం కుదిరింది. అయితే ఆ ఒప్పందాన్ని కాదని ఆనాడు మోడీ తాజాగా ఒప్పందాన్ని ప్రకటించడం వివాదాస్పదమైంది. ప్రధాని మోడీ ఆనాడు ఫ్రాన్స్‌ పర్యటనలో ప్రకటించిన ఒప్పందంలో అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఏరో స్పేస్‌ భాగస్వామ్యాన్ని అకస్మాత్తుగా ప్రవేశపెట్టారు. ఏరోనాటిక్స్‌లో రిలయన్స్‌ కంపెనీకి అప్పటికి ఎలాంటి అనుభవం లేదు. పైగా రిలయన్స్‌ కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది, ఇటువంటి ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా లేవు.
దర్యాప్తు చేపట్టాలన్న నిర్ణయానికి సంబంధించిన వార్తను జులై 2న ఫ్రెంచి వార్తా వెబ్‌సైట్‌ 'మీడియా పార్ట్‌' వెల్లడించింది. గత రెండేళ్ళుగా ఈ ఒప్పందానికి సంబంధించిన వివిధ కోణాలు, తెర వెనుక జరిగిన విషయాలతో మీడియా పార్ట్‌ వరుసగా వ్యాసాలు ప్రచురిస్తూ వస్తోంది. ఈ విచారణ కోసం సిట్టింగ్‌ న్యాయమూర్తిని నియమించారు. ఫ్రెంచ్‌ ఎన్‌.జి.ఓ 'షెర్పా' చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ విచారణ చేపట్టారు.
కొత్త ఆరోపణలు
ఈ ఒప్పందంలో తలెత్తిన ఆరోపణల గురించి భారత్‌ లోని పాఠకులందరికీ బాగా తెలుసు. అయితే, ఇప్పటి వరకు బహిర్గతం కాని, మీడియా పార్ట్‌కు అందుబాటులోకి వచ్చిన పత్రాలతో సహా ఈ ఏడాది ఏప్రిల్‌, జులైల్లో మీడియా పార్ట్‌ ఇచ్చిన వార్తలు కొన్ని కొత్త సాక్ష్యాధారాలను వెలువరించాయి. డసాల్ట్‌ కు, ఏవియేషన్‌ రంగంలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్‌ ఏరో స్పేస్‌కు మధ్య అకస్మాత్తుగా ఒప్పందం కుదరడం, పైగా భారత్‌లో పాలక వర్గంతో అనిల్‌ అంబానీకి వున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఒప్పందం చుట్టూ అనేక ఆరోపణలు అలుముకుంటున్నాయి.
పారిస్‌ పర్యటన సందర్భంగా 2015 ఏప్రిల్‌ 10న ప్రధాని మోడీ కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు. భారత్‌లో అయితే ఈ ప్రకటన మొత్తంగా అందరికీ అంటే రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, హెచ్‌.ఎ.ఎల్‌, చివరకు వైమానిక దళం చీఫ్‌ ఇలా అందరికీ ఒక్కసారిగా విస్మయాన్ని కలిగించిందన్నది సుస్పష్టమైంది. పైగా భారత వైమానిక దళానికి 126 విమానాలు అవసరముండగా, ఆ సంఖ్యను అకస్మాత్తుగా 36కు తగ్గించడం కూడా వైమానిక దళం చీఫ్‌కి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఫ్రాన్స్‌ నుండి రావడానికి ముందు పత్రికా సమావేశాల్లోనే హెచ్‌.ఎ.ఎల్‌ తో కుదిరిన ఒప్పందం ఇక వుండకపోవచ్చనే విషయం ప్రస్తావించారు. అయితే మార్చి 25న బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా ఎయిర్‌ షో సందర్భంగా హెచ్‌.ఎ.ఎల్‌ చైర్మన్‌, ఐ.ఎ.ఎఫ్‌ చీఫ్‌ల సమక్షంలో డసాల్ట్‌ సిఇఓ ఎరిక్‌ ట్రాపియర్‌ మాట్లాడుతూ, డసాల్ట్‌, హెచ్‌.ఎ.ఎల్‌ మధ్య అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. కానీ, డసాల్ట్‌, హెచ్‌.ఎ.ఎల్‌ మధ్య సరిదిద్ద లేని విభేదాలు నెలకొన్న కారణంగానే రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం రద్దైందంటూ ఆ తర్వాత నుండి బిజెపి ప్రభుత్వం ప్రతిసారీ చేస్తూ వస్తున్న వాదన పూర్తి విరుద్ధమైనదని, అబద్ధమని దీంతో స్పష్టమవుతోంది.
కొత్త ఒప్పందంలోని ప్రధాన అంశమేమంటే రిలయన్స్‌ ఏరో స్పేస్‌ అనూహ్యంగా ప్రవేశించడం. సెప్టెంబరులో రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత రెండు నెలల్లోగా అంటే 2016 నవంబరులో డసాల్ట్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటైంది. డసాల్ట్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (డి.ఆర్‌.ఎ.ఎల్‌) ఏర్పడింది. అయితే, ఆ తర్వాత పలు విషయాలు వెల్లడయ్యాయి. రిలయన్స్‌ ఈ మొత్తం వ్యవహారం లోకి చాలా ముందుగానే ప్రవేశించిందని తెలిసింది. పారిస్‌లో, డసాల్ట్‌ పాల్గొన్న ఇతర కార్యక్రమాల్లో అనిల్‌ అంబానీ 'యాదృచ్ఛికంగా' ప్రత్యక్షం కావడం ఇందుకు సాక్ష్యం. అయితే, వాస్తవానికి, ప్రధాని మోడీ పారిస్‌లో కొత్త ఒప్పంద ప్రకటన చేయడానికి రెండు వారాలు ముందుగానే 2015 మార్చి 26న సహకార ఒప్పందం లోని పరస్పర బాధ్యతలను పేర్కొంటూ అవగాహనా ఒప్పందం (ఎం.ఓ.యు) మీద డసాల్ట్‌, రిలయన్స్‌లు సంతకాలు చేశాయి. ఇందుకు సంబంధించిన పత్రాలు తన దగ్గర వున్నాయని మీడియా పార్ట్‌ తన తాజా నివేదికలో పేర్కొంది.
2016 నవంబరులో డసాల్ట్‌, రిలయన్స్‌ ఏరో స్పేస్‌ మధ్య కుదిరిన వాటాదారుల ఒప్పందంలో ఆర్థిక వివరాలు లేవు. అందుకు బదులుగా అదే రోజు సంతకం చేయబడిన సైడ్‌ లెటర్‌లో ఈ వివరాలు వున్నాయని చూపించే పత్రాల్లోని ముఖ్య భాగాలను కూడా మీడియా పార్ట్‌ తన నివేదికలో ప్రచురించింది. ఇరు కంపెనీలు హామీ కుదుర్చుకున్న 10 మిలియన్ల (కోటి) యూరోలతో పాటు వాటాల కింద 43 మిలియన్ల (4.3 కోట్ల) యూరోల అదనపు నిధులు, 106 మిలియన్ల (1.6 కోట్లు) యూరోలకు మించకుండా రుణాన్ని డసాల్ట్‌ అందచేసిందని మీడియా పార్ట్‌ పేర్కొంది. ఆ రకంగా, మొత్తం 169 మిలియన్ల పెట్టుబడుల్లో 94 శాతం లేదా 159 మిలియన్ల యూరోల వరకు డసాల్ట్‌ హామీ ఇచ్చిందని మీడియా పార్ట్‌ పేర్కొంది. ఈ జాయింట్‌ వెంచర్‌లో రిలయన్స్‌ ప్రధాన లబ్ధిదారుగా మారేందుకు డసాల్ట్‌ వీలు కల్పించిందని మీడియా పార్ట్‌ పేర్కొంది. ఇందులో ఆశ్రిత పక్షపాతం ఇమిడివుందని నిర్ధారణ అవుతోంది. భారత ప్రభుత్వం పట్టుబట్టడం వల్లనే రిలయన్స్‌ను భాగస్వామిగా ఫ్రాన్స్‌ ఆమోదించాల్సి వచ్చిందని అప్పటి అధ్యక్షుడు హాలెండ్‌ చెప్పిన వీడియో రికార్డింగ్‌తో సహా తదనంతరం జరిగిన పరిణామాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి.
ఇప్పటివరకు భారత్‌లో, ఫ్రాన్స్‌లో రెండు చోట్లా ప్రజలకు తెలియకుండా దాచిన పలు వాస్తవాలు ఫ్రాన్స్‌లో జరుగుతున్న జుడిషియల్‌ దర్యాప్తులో వెల్లడవుతాయని ఆశిద్దాం. ఇక్కడ, బిజెపి ప్రతినిధులు, మద్దతుదారులు మీడియా పార్ట్‌ వెల్లడించిన వాటిని పనికిమాలినవిగా కొట్టిపారేస్తున్నారు. ఇది పూర్తిగా ఫ్రాన్స్‌కి సంబంధించిన వ్యవహారంగా పేర్కొంటున్నారు. భారత్‌కు ఎలాంటి సంబంధం గానీ ఆందోళన గానీ లేదని అంటున్నారు. కానీ వారు ఇక్కడ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్న చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు
భారత రక్షణ, స్వావలంబనకు చిక్కులు!
2015-16 నుండి భారత్‌లో చాలా జరిగాయి. అర్థికపరమైన అవకతవకలు, హెచ్‌.ఎ.ఎల్‌ ను తొలగించడం, ఆ స్థానంలో రిలయన్స్‌ ఏరో స్పేస్‌ను తీసుకురావడం వంటివి చోటు చేసుకున్నాయి. అదే సమయంలో, భారత ప్రభుత్వ రంగ సంస్థలను, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్‌.డి.ఓ) లకు చెందిన లేబరేటరీలను పక్కకు నెట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో రక్షణ తయారీ, పరిశోధనకు వెన్నెముకగా వున్న వీటిని పక్కకు తోసి రక్షణ తయారీ రంగంలో ప్రైవేటు కంపెనీలను ప్రవేశ పెట్టడానికి చూస్తోంది. దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విదేశీ రక్షణ సంస్థలను కూడా ఆహ్వానిస్తోంది. వాటికి మెజారిటీ వాటాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతోంది. దీనివల్ల అధునాతన సాంకేతికతలు దేశానికి వస్తాయని, భారత్‌లో రక్షణ రంగంలో నెమ్మదిగా ప్రవేశించేందుకు భారత కంపెనీలు సామర్ధ్యాలను రూపొందించుకుంటాయని పేర్కొంటోంది. తన సిద్ధాంతాలు, భావజాలం పట్ల ప్రభుత్వానికి అంత నమ్మకం వుంది.
అయితే, ఇలాంటి సిద్ధాంతాల ఫలితంగా తలెత్తిన విధానాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తదనంతర పరిణామాలు చాలా స్పష్టంగా తెలియచేశాయి. రాఫెల్‌ ఒప్పందంలో కూడా రిలయన్స్‌ ఏరో స్పేస్‌ చాలా జూనియర్‌ భాగస్వామి. రాఫెల్‌తో కానీ, రక్షణ తయారీతో కానీ ఏమాత్రమూ సంబంధం లేని రీతిలో పౌర విమానాలైన డసాల్ట్‌ ఫాల్కన్‌ జెట్‌లకు చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయడం, సబ్‌-అసెంబ్లింగ్‌ వంటి పనులకు సబ్‌ కాంట్రాక్టులు మాత్రమే చేసింది. కాగా, అవసరమైన 50 శాతం ఆఫ్‌సెట్‌లకు సంబంధించిన ఇతర అంశాల భవిష్యత్‌ ఏంటనేది కూడా ఇంకా తెలియదు. సవరించిన డిపిపి నిబంధనల ప్రకారం, భారత్‌కు ఎలాంటి బేరసారాల అధికారం లేని విధంగా కాంట్రాక్టు కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా పూర్తిగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విదేశీ సరఫరాదారుకు అనుమతించవచ్చు. దీని ప్రకారం, డసాల్ట్‌, దాని ఫ్రెంచి భాగస్వాములు భారత్‌లో తమ ఆఫ్‌ సెట్‌ పనులను, భాగస్వాములను ఎంపిక చేసుకునేందుకు స్వేచ్ఛ వుంటుంది. దీనివల్ల దేశంలో రక్షణ తయారీ రంగానికి నామమాత్రపు ప్రయోజనాలు వుండవచ్చు.
రక్షణ రంగంలో ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించడానికి గాను రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డి.ఆర్‌.డి.ఓ లను కుదించే ప్రయత్నాలపై ప్రభుత్వం పట్టుదలగా వున్నప్పటికీ, కొంతమంది మాత్రం వాటి పాత్రను (ముఖ్యంగా సాయుధ బలగాల ప్రశంసలను పొందిన వాటి పాత్రను) గుర్తు చేస్తున్నారు. వీరు దేశీయ రక్షణ తయారీ స్థావరం ప్రయోజనాలను నొక్కి చెబుతున్నారు.
సంవత్సరాల తరబడి కఠోర అధ్యయనం తర్వాత...భారత వైమానిక దళ అవసరాల నిమిత్తం బహుళ పాత్ర పోషించే 126 యుద్ధ విమానాలు కావాలనుకున్నారు. ఆ తర్వాత వాటిని ఏకంగా 36 విమానాలకు కుదిస్తూ ఉన్నత స్థాయిలో ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశ రక్షణ సన్నద్ధత, ఐ.ఎ.ఎఫ్‌ ఎంత దుర్బలంగా వుందనేది బట్టబయలవుతోంది. రాఫెల్‌ ఒప్పందంపై సంతకాలు జరిగిన వెంటనే, మరో 114 విమానాల కోసం భారత్‌ మరో ప్రీ టెండర్‌ను తిరిగి జారీ చేయాల్సి వచ్చింది. దీంట్లో కూడా కొంచెం అటూ ఇటూగా అదే పోటీదారులు వుండడంతో మరింత జాప్యం అవుతోంది. కాగా మరోపక్క భారత వైమానిక దళం సామర్ధ్యం మరింతగా క్షీణిస్తూ, ప్రమాదకరమైన స్థాయికి పడిపోతోంది. 114 విమానాల కోసం కుదుర్చుకునే కొత్త ఒప్పందమైనా వాస్తవంగా సాంకేతికత బదిలీ చేస్తుందా? దేశీయ సామర్ధ్యాలను నిర్మిస్తుందా?
బహుళ సేవలందించే సమగ్ర థియేటర్‌, ఫంక్షనల్‌ కమాండ్‌ల కోసం రక్షణ బలగాల చీఫ్‌ మద్దతిచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి భారత వైమానికదళం విముఖత చూపడంపై మిలటరీ, వ్యూహాత్మక నిపుణుల్లో ఇటీవల బాగా చర్చ జరుగుతోంది. విమానాల కొరతే ఐ.ఎ.ఎఫ్‌ విముఖతకు కారణం అనుకోవచ్చు. కాలం చెల్లుతుండడంతో ఇతర విమానాలు చాలా వేగంగా క్షీణిస్తున్నాయి. అందువల్ల ఇక్కడా, అక్కడా విడివిడిగా విమానాలను మోహరించే పరిస్థితిలో ఐ.ఎ.ఎఫ్‌ లేదు. అందువల్లే థియేటర్‌ కమాండ్‌ ఆలోచననే తిరస్కరిస్తోంది. ఈ రకంగా బిజెపి ప్రభుత్వం తీసుకున్న రాఫెల్‌ నిర్ణయం అనేక రకాలుగా వినాశకర నిర్ణయమని రుజువవుతోంది.
                                                                   

Related Keywords

Bangalore ,Karnataka ,India ,France ,Narendra Modi ,Mod India Air ,India Air ,Prime Minister Narendra Modi ,Prime Minister Modi ,July France ,Prime Minister Modi New ,Foreign Minister ,Air Force ,India Air Force ,March Bangalore ,Aero India ,New Main Aero ,Place Aero ,Advanced Country ,Mod India Air Force ,பெங்களூர் ,கர்நாடகா ,இந்தியா ,பிரான்ஸ் ,நரேந்திர மோடி ,இந்தியா அேக ,ப்ரைம் அமைச்சர் நரேந்திர மோடி ,ப்ரைம் அமைச்சர் மோடி ,ஜூலை பிரான்ஸ் ,வெளிநாட்டு அமைச்சர் ,அேக படை ,இந்தியா அேக படை ,வான ஊர்தி இந்தியா ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.