comparemela.com


తెలుగు రాష్ట్రాల్లో అకాడమీలు అదే నా కల
క్రీడారంగంలో తెలుగు వారి ఖ్యాతిని దశదిశల వ్యాపింపజేసిన దిగ్గజాలలో అగ్రగణ్యురాలు కరణం మల్లీశ్వరి. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌ వరకు సాగిన ఆమె ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు. అనితర సాధ్యమనుకున్న ఒలింపిక్‌ పతకాన్ని ముద్దాడి భారత క్రీడా చరిత్రలో ‘కరణం మల్లీశ్వరి’ అనే పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఆ పతక కాంతులు దేశంలోని ఎందరో మహిళల్లో క్రీడా కారిణి కావాలనే స్ఫూర్తిని రగిల్చింది. తాజాగా ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్‌గా బాధ్యతలు తీసుకున్న మల్లీశ్వరి హరియాణాలో స్థిరపడినా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోలేదంటుంది. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన తాను తెలుగింటి ఆడపడుచునని గర్వంగా చెప్పుకుంటా అంటున్న మల్లీశ్వరితో  ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ...
ముందుగా ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీగా ఎంపికైనందుక అభినందనులు.. ఎలా ఉంది ఈ కొత్త బాధ్యత?
ఒలింపిక్స్‌ పతకం సాధించినప్పుడు ఎంత సంతోషం కలిగిందో ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి వైస్‌ చాన్సెలర్‌గా నన్ను నియమించారనే తెలియగానే అంతే ఆనందపడ్డా. నాలాంటి క్రీడాకారులను కనీసం వంద మందినైన తయారు చేయాలనేది నా ఇరవై ఏళ్ల కల. వీసీగా పనిచేసే అవకాశం వచ్చిందని తెలియగానే అది నిజమయ్యే రోజులు సమీపించాయని ఉద్వేగానికి లోనయ్యా. నామీద నమ్మకంతో పెట్టిన ఈ గురుతర బాధ్యత వందశాతం న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా.
బయోపిక్‌ నిర్మాణం ఎంతవరకు వచ్చింది?
బయోపిక్‌లో నేను పడిన కష్టంతో పాటు నా ఎదుగుదలకు తోడ్పడిన వారి కృషి లోకానికి తెలియజేస్తామంటూ కొందరు సినీ ప్రముఖులు నన్ను సంప్రదించారు. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల నుంచి కొందరు ప్రముఖులు నా  జీవితకథ తెరకెక్కిస్తామని వచ్చారు. కొన్ని కథల విన్నా. ఒక్క కథ కూడా నాకు నచ్చలేదు. అందుకే సినిమా తీయడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదు. కమర్షియల్‌, మసాల అంశాలు లేకుండా స్ఫూర్తిదాయక చిత్రంగా కథను తీర్చిదిద్దితే తప్పకుండా ఆ సినిమా తీసేందుకు అంగీకరిస్తా. గ్రామాల్లోని.. మారుమూల ప్రాంతాల్లోని వర్ధమాన క్రీడాకారులకు ఈ చిత్రం ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆడపిల్లలను బడికి పంపడానికే సంకోచించే కాలంలో నేను క్రీడాకారిణిగా చాలా శ్రమించాల్సి వచ్చింది. సాధన చేస్తున్న క్రమంలో శరీర ఆకృతిలో వచ్చిన మార్పులు కనిపించకుండా ఉండడానికి వదులుగా ఉండే దుస్తులు వేసుకునే దానిని.. ఈ తరం లిఫ్టర్లకు అలాంటి బాధలు లేవు కానీ, మన సమాజంలో ఇంకా చైతన్యం రావాలి.
తెలుగు సంస్కృతిని మిస్సవుతున్నారా?
తెలుగుదనంలోని కమ్మదనం ఎందులోనూ ఉండదు.  ఏ చోట ఉన్నా.. మన వారితో మాట్లాడుతుంటే ఏదో తెలియని  అనుభూతి కలుగుతుంది. హరియాణా వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా తెలుగు సంప్రదాయాలను ఇప్పటికి పాటిస్తా. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లిన నేను తెలుగింటి ఆడపడచునని గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే అది నా జన్మ భూమి. హరియాణాలో మాకు ఒక ఫామ్‌ హౌస్‌ ఉంది. అందులో పండ్లు, కూరగాయాలు సాగు చేస్తూంటాం. ఆవులు, దూడలు, మేకలను కూడా పెంచుతుంటాం. అక్కడే వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతుంటా. ఈ ఫామ్‌హౌ్‌సకి వచ్చినప్పుడల్లా మా ఊర్లోని వాతావరణం గుర్తు వస్తుంది. ఇప్పటికి మా స్కూల్‌మేట్స్‌తో టచ్‌లోనే ఉంటా. మాకో వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది.
ఎఫ్‌సీఐకి గుడ్‌బై చెప్పారా?
ఇంకా చెప్పలేదు. ప్రస్తుతానికి డిప్యుటేషన్‌పై ఢిల్లీ స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి వచ్చా. భవిష్యత్‌ ప్రణాళికలు బట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటా.
మీ ప్రస్థానంలో ఎదురైన ఒడిదుడుకులు గురించి?
మాది శ్రీకాకుళం జిల్లాలోని ఊసవానిపేట అనే మారుమూల గ్రామం. నేను పెరిగిన వాతావరణం, ఆ రోజుల్లో క్రీడలకు అక్కడున్న సదుపాయాలు తలుచుకుంటే ఇప్పుడు నవ్వుకుంటా. కెరీర్‌ ప్రారంభంలో ఆర్థికంగా, సామాజికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ప్రొఫెషనల్‌ లిఫ్టర్‌గా ఎదుగుతున్న క్రమంలో ‘హిందూజ’ సంస్థ 1991లో దత్తత తీసుకొని 1994లో ప్రపంచ చాంపియన్‌ అయ్యే వరకు స్కాలర్‌షిప్‌ ఇచ్చి ప్రోత్సహించింది. ఆ తర్వాత భారత ఆహార గిడ్డంగి సంస్థ (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగం లభించింది. అప్పటి నుంచి అందులోనే వివిధ హోదాల్లో పనిచేస్తూ తాజాగా జీఎంగా అయ్యా. తల్లిదండ్రులు శ్యామల-మనోహర్‌,  భర్త రాజేష్‌, ఆప్తులు, మిత్రుల సహకారం, దేవుడి దయతో ఈస్థాయికి చేరుకున్నా.
స్పోర్ట్స్‌ యూనివర్సిటీ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
నా అధ్యక్షతన ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ వారంలోనే మేము పని చేయడం ప్రారంభిస్తాం. రెండేళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ ఆరంభించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఐదారేళ్లలో యూనివర్సిటీ నిర్మాణం  పూర్తి చేస్తాం.
మాకు ఇద్దరు మగ పిల్లలు. పెద్దబాబు ఎల్‌ఎల్‌బీ, చిన్నబాబు పదో తరగతి చదువుతున్నారు. పెద్దబాబు శరద్‌ చంద్ర షూటింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. పలు జాతీయ పోటీల్లో కూడా పాల్గొన్నాడు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకునే పట్టుదల, సత్తా వాడిలో ఉన్నాయి. ఇక, మా ఆయన రాజేష్‌ త్యాగి అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు.
ఎలా ఉండబోతుంది ఈ యూనివర్సిటీ?
ఆరో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు ఇందులో చదువుకోవచ్చు. క్రీడాకారుడికి నచ్చిన క్రీడలో డిగ్రీ చేసే విధంగా కరికలమ్‌ తయారు చేస్తున్నాం. సింగపూర్‌, రష్యా, జపాన్‌లోని ప్రముఖ క్రీడా విశ్వవిద్యాలయాల పనితీరును, మౌలిక సదుపాయాలను అధ్యయనం చేసి త్వరలో ఒక నివేదికను రూపొందించనున్నాం. 2032 ఒలింపిక్స్‌ నాటికి భారత్‌ క్రీడా రంగంలో బలమైన శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
మీ టీమ్‌లో తెలుగువారెవరైనా ఉన్నారా?
ఎవరు లేరు. కానీ, తెలుగు రాష్ట్రాల్లోని క్రీడా ప్రముఖులు, కోచ్‌లు, నిపుణులు ఎవరైన సలహాదారులుగా, బోర్డు సభ్యులుగా పనిచేయాలని ఆసక్తి, సామర్థ్యం ఉంటే అవకాశమిస్తా. అలాంటి వారు నన్ను సంప్రదించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో అకాడమీ పెట్టే ఆలోచన ఉందా?
ప్రస్తుతం హరియాణాలోని యమునానగర్‌లో ఒక అకాడమీని నడుపుతున్నా. అందులో 50 మంది పిల్లలకి శిక్షణ ఇస్తున్నా. ఒలింపిక్స్‌లో పతకం సాధించినప్పుడు అప్పటి ప్రభుత్వం అకాడమీ పెట్టడానికి భూమి ఇస్తా అని ప్రకటించింది. ఆ తర్వాత ఎందుకు అది ఆగిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అకాడమీలు ప్రారంభించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వం స్థలం కేటాయించి ప్రోత్సహిస్తే త్వరలోనే పని ప్రారంభిస్తా.
- సంజయ్‌ శంకా, హైదరాబాద్‌

Related Keywords

Delhi ,India ,Sydney ,New South Wales ,Australia ,Russia ,Srikakulam ,Andhra Pradesh , ,Academy To Earth ,Telugu States Academy ,Delhi University ,Telugu States ,Srikakulam District ,India Sports ,Sports Carry ,Hindi Chitra ,Chandra Training ,His Tyagi ,Telugu States Sports Celebrities ,டெல்ஹி ,இந்தியா ,சிட்னி ,புதியது தெற்கு வேல்ஸ் ,ஆஸ்திரேலியா ,ரஷ்யா ,சிரிக்ாகுலம் ,ஆந்திரா பிரதேஷ் ,டெல்ஹி பல்கலைக்கழகம் ,தெலுங்கு மாநிலங்களில் ,சிரிக்ாகுலம் மாவட்டம் ,இந்தியா விளையாட்டு ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.