Jul 11, 2021, 12:41 IST
హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు. కమలాపూర్ మండలంలోని బత్తినివాని పల్లె నుంచి ప్రారంభించి, 350 నుంచి 400 కిలోమీటర్లు చేస్తానని చెప్పారు. దీనిపై మరో మూడు రోజుల్లో వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. శనివారం హుజూరాబాద్‌లోని ఆయన నివాసంలో మాట్లాడారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక తన అభిప్రాయం కూడా తీసుకోకుండానే అరగంటలోనే ఆమోదించారని అన్నారు. రాజీనామా పత్రాన్ని తీసుకోడానికి స్పీకర్ ముందుకు రాకపోతే, అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చానని తెలిపారు.
అరగంటలోనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఒక్క తన విషయంలోనే జరిగి ఉండొచ్చన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కానిస్టేబుల్ మొదలుకొని అన్ని స్థాయిల అధికారులను బదిలీ చేశారని, వందల మంది ఇంటిలెజెన్స్, ఇతర పోలీస్ అధికారులను రంగంలోకి దింపారని చెప్పారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను అంగట్లో సరుకులుగా వెలకట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కుల సంఘాల నాయకులను సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు పట్టుకుపోయి అడిగిందే తడవుగా డబ్బులిస్తున్నారని మండిపడ్డారు.ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రలోభాలతోపాటు దొంగ ఓట్ల నమోదుకు శ్రీకారం చుట్టారన్నారు.
హుజూరాబాద్ ఆర్డీవో కేంద్రంగా స్పెషల్ రెవెన్యూ అధికారిని పెట్టి ఈ తతంగం జరిపిస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్ చైర్‌పర్సన్ ఇంట్లోనే 34 ఓట్లు ఉన్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారని.. పథకాలను ఆపడం ఎవరి తాత జాగీరు కాదన్నారు. ఈటల ఒంటరి వాడు కాదని, తన వెంట ఉద్యమకారులు, సంఘాలు, ప్రజలు ఉన్నారని స్పష్టం చేశారు.
కమలాపూర్‌లో ఓ మహిళా అధికారిపై ఓ మంత్రి సంస్కార హీనంగా మాట్లాడారని, మంత్రులకు మతిభ్రమించి కల్లుతాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, ఉమ్మడి వరంగల్‌మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడి ఉన్నారు.