comparemela.com


మండలి స్థానాలకు త్వరలో ఎన్నికలు?
కరోనా పరిస్థితులపై రాష్ట్రాన్ని ఆరా తీసిన ఈసీ
ప్రభుత్వ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేసులు ఏమైనా వస్తున్నాయా? తీవ్రత ఏమైనా ఉందా? మండలి ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ఏమిటి? తదితర అంశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అధికారి ఒకరు బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందన్న అంశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత పదవీ కాలం ఈ ఏడాది జూన్‌ మూడో తేదీతో ముగిసింది. సాధారణంగా సభ్యుల పదవీ కాలం ముగియటానికి ముందుగానే ఎన్నికలు నిర్వహించటం ఎన్నికల సంఘానికి ఆనవాయితీ. కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో ఉండటంతో మండలి స్థానాల ఖాళీల భర్తీ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. పలు రాష్ట్రాల్లో పరిస్థితులు కుదుటపడటంతో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఏకగ్రీవం కానున్నాయా?
ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత నుంచి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అందులోనూ కేవలం ఎమ్మెల్యేలు మాత్రం ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. పదవీ కాలం ముగిసిన సభ్యులు తెరాస పార్టీకి చెందిన వారే. ఎన్నికలు జరగాల్సిన ఆరు స్థానాలను అధికార తెరాస పార్టీనే దక్కించుకోనుంది. ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.
హుజూరాబాద్‌ ప్రస్తావన లేదు
మండలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు మార్గం సుగమం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల సంఘం రాసిన లేఖలో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ ప్రస్తావన లేదని అధికారులు స్పష్టం చేశారు.
Tags :

Related Keywords

Kadiyam Srihari , ,State Aura ,Main Secretary Central ,கதியம் ஸ்ரீஹரி ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.