ప్రధానాంశాలు
ఈటలకు మిగిలేది ఓటమే
హుజూరాబాద్‌లో తెరాసకే సంపూర్ణ మద్దతు
ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలంతా తమవైపే ఉన్నారని, ఉప ఎన్నికల్లో తెరాస ఘన విజయం ఖాయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈటల రాజేందర్‌కు మిగిలేది ఓటమేనని పేర్కొన్నారు. ఆయన తెరాస ప్రధాన కార్యదర్శులతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై చర్చించారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 31 నాటికి పూర్తి చేయాలని, కార్యకర్తల వివరాల డిజిటలీకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. సభ్యత్వాల కొత్త జాబితా మేరకు మళ్లీ 60 లక్షలమంది కార్యకర్తలకు ప్రమాద బీమా సదుపాయాన్ని కొనసాగిస్తామన్నారు. అత్యధిక నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు సంతృప్తికరంగా ఉందన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజీనామా చేసినా, కార్యకర్తలంతా పార్టీలోనే ఉన్నారని తెలిపారు. ఆయనకు ప్రజల మద్దతు లభించడం లేదని, ఓటమి ఖాయమని పేర్కొన్నారు. దళితబంధుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ 28 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడారు. సభ్యత్వాలను డిజిటలీకరించి, నెలాఖరులోగా పుస్తకాలను పంపించాలన్నారు.
Tags :