ఏడు వరసల సేద్యం.. ఏడాదంతా ఆదాయం!
సుస్థిర సాగుకు ‘పర్మాకల్చర్’
నానక్‌రాంగూడలో ప్రయోగాత్మక సాగు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మిద్దెతోటల సాగు తర్వాత మరో కొత్త సాగు విధానం రాష్ట్రంలో అంకురిస్తోంది. హైదరాబాద్ నానక్‌రాంగూడ చౌరస్తాలో హెచ్‌ఎండీఏ స్థలంలో స్రాకో గ్రూపు ఆర్గనైజేషన్ సంస్థ చేపట్టిన పర్మాకల్చర్ సేద్యం నగరవాసులను ఆకర్షిస్తోంది. ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల నడుమ 1.4 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం స్వల్ప, ధీర్ఘకాలిక పంటలు సాగు చేస్తున్నారు. ఉసిరి, గోరింటాకు, బంతిపూల మొక్కలూ పెంచుతున్నారు. రోజూ ఈ క్షేత్రం నుంచి 60 కుటుంబాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు.
ఏమిటీ విధానం..
వైవిధ్యమైన పంటలతో సేంద్రియ పద్ధతుల్లో స్వయం సమృద్ధ, సుస్థిర సేద్యం ఈ విధానం ప్రత్యేకత. మొక్కలకు 7 రకాల బ్యాక్టీరియాలు, వివిధ సేంద్రియ ఎరువులు అవసరం. వీటన్నింటినీ ‘ఏడు వరుసల విధానం’లో విభిన్న పంటల ద్వారానే సమకూరుస్తారు. ఉదాహరణకు కంది, బీన్స్, గోరుచిక్కుడు సాగుతో భూమిలో నైట్రోజన్ పెరిగి ఇతర మొక్కలకు అందుతుంది. ఎర పంటలుగా పూల మొక్కలు పెంచి.. కీటకాలను నిరోధిస్తారు.
చక్కటి ఆదాయ వనరు
‘‘ఏడు వరుసల విధానం ఓ వినూత్న సుస్థిర సాగు ఆవిష్కరణ. ముందుగా నేలను గుల్ల చేసి మడులుగా విభజిస్తాం. మొదటి లేయర్‌లో మునగ, కరివేపాకు వంటి ఎత్తుగా పెరిగే చెట్లు, రెండో వరుసలో మధ్య తరహా ఎత్తు ఉండే బొప్పాయి, అరటి, జామ, దానిమ్మ.. మూడో వరుసలో బీర, కాకర, సొర, పొట్ల వంటి తీగ జాతి పంటలు, నాలుగో లేయర్‌లో బంతి, చామంతి, ఇతర పూలు, ఆ తర్వాత వంగ, టమాట, బెండ, పచ్చిమిరప వంటి కూరగాయ మొక్కలు.. ఆరో వరుసలో ఆకుకూరలు, ఏడో లేయర్‌లో బీట్‌రూట్, ముల్లంగి, క్యారెట్ వంటి దుంపకూరలు పండిస్తున్నాం. 30 రోజుల్లోపు మొదటి పంట కాపు వస్తుంది. ప్రతి రోజు 20 కిలోల కూరగాయలు లభిస్తాయి. కిలో రూ.30 చొప్పున విక్రయించినా రూ.600 ఆదాయం వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఓ సేంద్రియ నమూనాగా చూపడానికి దీనిని తీర్చిదిద్దాం’’ అని స్రాకో గ్రూపు ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సునితాప్రసాద్ తెలిపారు. ఈమె ఆస్ట్రేలియాలో పర్మాకల్చర్‌లో శిక్షణ పొందారు.
త్వరలో విభాగినులపై పశుగ్రాసాల పెంపకం
హరితహారంలో భాగంగా ప్రధాన రహదారుల మధ్యలో విభాగినులపై ఆరు రకాల పశుగ్రాసాలు పెంచేందుకు స్రాకో గ్రూపుతో ఒప్పందం చేసుకోనున్నట్లు హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ తెలిపారు. ప్రతి అంగుళం భూమిలో ఉత్పత్తి, ఉద్పాతకత వచ్చే మొక్కలు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
Tags :