నడవని నడవాలు
వరంగల్, నాగ్‌పుర్ పారిశ్రామిక కారిడార్ల సాకారం ఎప్పుడో!
11,500 ఎకరాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ సంసిద్ధత
ఆరేళ్ల కిందటే కేంద్రానికి ప్రతిపాదనలు
ఇప్పటికీ రాని అనుమతులు
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రతిపాదించిన హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్- నాగ్‌పుర్ పారిశ్రామిక నడవా (కారిడార్)లు ఇంకా కాగితాలపైనే నానుతున్నాయి. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,500 ఎకరాల భూమిని సేకరించింది. సమగ్ర సమాచారం అందించి, కారిడార్ల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా 2015లో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు 146 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పుర్ సరిహద్దు వరకు 320 కిలోమీటర్ల మేర కారిడార్లను ప్రతిపాదించింది. హైదరాబాద్-జహీరాబాద్-నాగ్‌పుర్ కారిడార్‌లో మొదటి దశగా 3500 ఎకరాలు, హైదరాబాద్- వరంగల్ కారిడార్‌కు 8 వేల ఎకరాల్లో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనను ప్రతిపాదించింది. వీటికి సంబంధించిన సమగ్ర నివేదికలను రూపొందించి కేంద్రానికి పంపింది. జాతీయ పారిశ్రామిక నడవాల పథకం (ఎన్‌ఐసీపీ) కింద దీన్ని మంజూరు చేయాలని కోరింది. ఈ కారిడార్లు వస్తే తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు లబ్ధి కలుగుతుందని, వీటిని జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.
అనుమతుల్లో జాప్యం
ఈ పథకం కింద 2015 తర్వాత దేశవ్యాప్తంగా 16 పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం అనుమతులిచ్చింది. వాటి కోసం రూ. 60 వేల కోట్లు వెచ్చించింది. తెలంగాణ ప్రతిపాదనలకు మాత్రం సత్వర ఆమోదం లభించలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తరచూ లేఖలు రాసింది. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు అందించారు. ప్రాజెక్టు ప్రతిపాదించిన అయిదేళ్లకు కేంద్రం గత ఏడాది జూన్‌లో సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసింది. వాటికి సంబంధించిన వ్యాపార ప్రణాళికలు పంపాలని సూచించగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలో వాటిని కూడా అందించింది. వీటి ఆధారంగా పూర్తిస్థాయి అనుమతులను ఆశించినా ఇప్పటికీ ఆమోదం లభించలేదు.
పారిశ్రామిక కారిడార్లకు పూర్తిస్థాయి అనుమతుల అనంతరం వాటిపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తద్వారా పారిశ్రామిక సంస్థల పెట్టుబడులకు మార్గం సుగమమవుతుంది. ఈ కారిడార్లకు దేశంలోని ఇతర కారిడార్లతో అనుసంధాన వ్యవస్థ ఉంటుంది. వాటిలో మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం 1.57 లక్షల ఎకరాల భూబ్యాంకును సిద్ధం చేసినందున భవిష్యత్తులో నడవాల విస్తరణకు కూడా స్థల సమస్య ఉండబోదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర, రాష్ట ప్రభుత్వ రాయితీలు
కారిడార్లలో స్థాపించే పరిశ్రమలకు సత్వర అనుమతులు లభిస్తాయి. కేంద్రప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు అదనం. తయారీ సహా అన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు. రోడ్లు, విద్యుత్తు, నీటిపారుదల సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. రైల్వే, రహదారి, వైమానిక రవాణా వ్యవస్థ ఉంటుంది. కార్మికులకు టౌన్‌షిప్ ఏర్పాటవుతుంది. ఆసుపత్రులు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలుంటాయి. దిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ ప్రారంభమయ్యాక ఆ మార్గంలోని రాష్ట్రాలు వృద్ధి చెందాయి. ఇదే రీతిలో తెలంగాణ ప్రతిపాదించే రెండు కారిడార్లు పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిస్తాయని అంచనా వేస్తున్నారు.
త్వరలో అనుమతులు వస్తాయని ఆశిస్తున్నాం
- జయేశ్‌రంజన్, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి
రెండు పారిశ్రామిక కారిడార్లు తెలంగాణకు ఎంతో కీలకమైనవి. కేంద్రం పూర్తిస్థాయి అనుమతులు ఇస్తే పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. జహీరాబాద్ నిమ్జ్‌ను సైతం నాగ్‌పుర్ కారిడార్ పరిధిలో చేర్చాం. దానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Tags :