డీజిల్... వంద దాటేసింది
ఆదిలాబాద్‌లో లీటర్ ధర రూ.100.18
మరో అయిదు జిల్లాల్లో శతకానికి చేరువలో..
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో డీజిల్ ధర శతకాన్ని అధిగమించింది. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం లీటర్ ధర రూ.100.18లకు చేరుకుంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం కావటం విశేషం. మునుపెన్నడూ ఇంత మొత్తానికి చేరలేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తరవాత నుంచి చమురు ధరలు శరవేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గత నెలలో ఆదిలాబాద్‌లోనే పెట్రోల్ ధర రూ.100 దాటింది. పెట్రోల్, డీజిల్‌లకు అత్యధిక ధరలు పలుకుతున్న జిల్లాగా ఆదిలాబాద్ రికార్డుల్లోకెక్కింది. జిల్లాల్లో డీజిల్ ధరలను పరిశీలిస్తే.. భూపాల్‌పల్లిలో రూ.99.87, నిజామాబాద్‌లో రూ.99.59, నిర్మల్‌లో 99.57, కామారెడ్డిలో 99.54, వనపర్తిలో రూ.99.51లకు చేరుకుంది. గత జనవరిలో డీజిల్ ధర 80.60 ఉండగా.. జూన్ 1న 93.08కి చేరుకుంది. హైదరాబాద్‌లో మంగళవారం డీజిల్ ధర లీటర్‌కు 97.96కు చేరింది. పెట్రోల్ ధర హైదరాబాద్‌లో రూ.105.83గా ఉండగా.. ఆదిలాబాద్‌లో 108.22లకు చేరింది. చమురు ధరల్లో తేడాకు దూరమే కారణం.
Tags :