ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ
సీఎస్‌కు ఈ మెయిల్
వ్యక్తిగత కారణాల వల్లనే ఈ నిర్ణయమని లేఖ
హుజూరాబాద్‌లో పోటీ యోచన లేదని స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తన నిర్ణయాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా తెలిపారు. ప్రజల పేరుతో రాసిన బహిరంగ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. పోలీసుశాఖలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన ఆయన గత తొమ్మిదేళ్లుగా డిప్యుటేషన్‌పై గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉంది. 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా సొంత రాష్ట్ర క్యాడర్‌కు ఎంపికైన ప్రవీణ్‌కుమార్ 26 ఏళ్లుగా ప్రభుత్వ విధుల్లో ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్లనే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నానన్నారు. ఇక మీదట ఎలాంటి పరిమితులు లేకుండా తన మనసుకు నచ్చిన పనులు, నచ్చిన రీతిలో చేయబోతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ‘‘మారుమూల ప్రాంతంలో, పేద కుటుంబంలో పుట్టి, ఎంతో శ్రమించి, ప్రతిష్ఠాత్మకమైన ఐపీఎస్‌కు ఎంపికై రెండున్నర దశాబ్దాలు సేవలు అందించాను. లక్షలాది పేద విద్యార్థులు, వారి కుటుంబాలకు సేవలు చేసి, చిన్నారులను తీర్చిదిద్దాలన్న నా నిర్ణయాన్ని స్వాగతించి, నాకు స్వేచ్ఛనిచ్చిన ఆయా సంక్షేమ శాఖా మాత్యులకు ధన్యవాదాలు. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందాలని భావించి, నా మూలాలు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నాయి కాబట్టి వాటికి సేవచేయాలనే లక్ష్యంతోనే అంకితభావంతో పనిచేశాను. చిన్నారి స్వేరోల్లారా, తొమ్మిదేళ్లుగా నాతోపాటు ప్రయాణించారు. మీ బంగారు కలలను నిజం చేయాలని నేను పడ్డ ఆరాటానికి మీరు, ఉపాధ్యాయులు, మీ తల్లిదండ్రులు అందించిన సహకారం మరిచిపోలేనిది. మన సంకెళ్లను మనమే తెంచుకోవాలనే స్వేరో సిద్ధాంతాన్ని కాపాడాల్సింది మీరే. పదవీ విరమణ తర్వాత శేష జీవితాన్ని మహాత్మ పులే దంపతులు, అంబేడ్కర్, కాన్షీరాంలు చూపిన మార్గంలో నడిచి, పేదలు, పీడితులకు అండగా ఉంటా’’ అని ఆయన లేఖలో తెలిపారు.
రాజకీయాల్లోకి ఇప్పుడే కాదు
రాజకీయాల్లోకి వస్తానని, అయితే ఎప్పుడనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రవీణ్‌కుమార్ ‘ఈనాడు’కు తెలిపారు. హుజూరాబాద్‌లో పోటీ చేసే యోచన లేదన్నారు. తన రాజీనామాకు తక్షణ కారణాలేవీ లేవన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం ఆయన హుజూరాబాద్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తారని సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం గురించి ప్రశ్నించగా భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించలేదని తెలిపారు. ఉద్యోగం మానేసినా ప్రజల మధ్యే ఉంటానని వెల్లడించారు. జీవితంలో ఇప్పటికీ స్థిరపడలేదని, తనకు సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు.
Tags :