ఆర్థిక సేవల్లోనూ మేటి తెలంగాణ
కరోనా సమయంలోనూ భారీగా పెట్టుబడులు
గోల్డ్‌మ్యాన్ శాక్స్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ఐటీ, ఔషధ, ఆతిథ్య రంగాలతో పాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవల పరిశ్రమల రంగంలోనూ తెలంగాణ పురోగమిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇక్కడ ఉన్న అనుకూలతల వల్ల పలు ప్రసిద్ధ బ్యాంకింగ్ సంస్థలు రాష్ట్రంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. కరోనా సమయంలోనూ తెలంగాణ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. బెంగళూరుకు చెందిన ప్రసిద్ధ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్ గ్రూపు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద కార్యాలయాన్ని కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైనా పారిశ్రామిక సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. రాష్ట్రానికి త్వరలో మరిన్ని పెట్టుబడులు తరలిరానున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో లక్షా 80 వేలమంది హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో 350 ఐటీ సంస్థలు తిరిగి తమ కార్యాలయాలను తెరిచేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొదటగా మూడోవంతు ఉద్యోగులతో ప్రారంభించి, క్రమేపీ వారి సంఖ్య పెంచాలి. ఉద్యోగులందరికీ టీకాలు వేయించడం సురక్షితం. ఐటీ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నడిస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. క్యాబ్ సేవలు, సహాయక సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, వంటశాలలు, వినియోగ వస్తువుల వంటి అనుబంధ విభాగాలకు ఊతం లభిస్తుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధిపథంలో నడుస్తున్న తెలంగాణ బ్యాంకింగ్ రంగంలోనూ ముందంజ వేసింది. పెద్ద సంఖ్యలో బహుళజాతి బ్యాంకింగ్ సంస్థలు తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. అతి పెద్ద కంపెనీల పెట్టుబడుల జాబితాలో గోల్డ్‌మ్యాన్ శాక్స్ ఇక్కడ తమ కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఐఎస్‌బీ, ఐఐఎం బెంగళూరు సహకారంతో దేశవ్యాప్తంగా పదివేలమంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలన్న ఆ సంస్థ లక్ష్యం అభినందనీయం. హైదరాబాద్‌లోని వి-హబ్‌తో కలిసి పని చేయాలని కోరుతున్నాను. ఆర్థికరంగంలో మరిన్ని ఆవిష్కరణల రూపకల్పనకు టీహబ్ దోహదపడుతుంది’’ అని కేటీఆర్ అన్నారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ ఛైర్మన్ సీఈవో డేవిడ్ సాల్మన్ మాట్లాడుతూ, తమ రెండో అతి పెద్ద కార్యాలయానికి హైదరాబాద్ అత్యంత అనుకూలంగా ఉందని, దీని ద్వారా ప్రపంచ మార్కెట్‌లో విస్తృత కార్యకలాపాలతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. గోల్డ్‌మ్యాన్ శాక్స్ భారత విభాగాధిపతి గుంజన్ సంతాని మాట్లాడుతూ, ప్రస్తుతం తమ కార్యాలయాన్ని 250 మంది ఉద్యోగులతో ప్రారంభిస్తున్నామని, 2021 చివరి నాటికి 800 మందికి, 2023 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
Tags :