ప్రధానాంశాలు
ఇన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులకు సాధ్యమా?
గోదావరి, కృష్ణానదీ యాజమాన్య బోర్డుల విధివిధానాలపై నిపుణుల విస్మయం
ఈనాడు, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిని ఖరారుచేస్తూ కేంద్రం తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్‌లోని విధివిధానాలపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాలో 36, గోదావరిపై 71 ప్రాజెక్టులను బోర్డులకు అప్పజెబుతున్నారు. ఇన్ని ప్రాజెక్టులను, వాటి కాలువలను, అవుట్‌లెట్‌లను అప్పగిస్తే వాటి నిర్వహణ బోర్డులకు ఎంతవరకు సాధ్యమని జలవనరులశాఖలో కీలక బాధ్యతల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ‘ఒక ప్రాజెక్టు నిర్వహణకు కనీసం 50 మంది ఇంజినీరింగు, ఇతర సిబ్బంది అవసరం. అన్ని ప్రాజెక్టులకు కలిపి దాదాపు 5,000 మంది ఉద్యోగులు, అధికారులు కావాలి. ఇదంతా చాలా భారం. పైగా బోర్డులకు స్థానిక పరిస్థితులపట్ల అవగాహన లేకపోవడం వల్ల నీటి నిర్వహణ, కాలువలకు వదిలే విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. అదంత సులభం కాదు’ అని విశ్రాంత చీఫ్ ఇంజినీర్ డి.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘ఆ ప్రాజెక్టులన్నింటినీ పర్యవేక్షించడం కష్టం. నీటి విడుదల విషయంలో బోర్డులు సున్నితంగా స్పందించలేవు. ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకు? తొలుత వివాదం ఉన్నవాటికి పరిమితమై, క్రమేణా అవసరాన్నిబట్టి పెంచుకుంటూ వెళ్తేసరిపోయేది. ఇప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రతి చిన్న విషయానికీ బోర్డులపై ఆధారపడాలి’ అని విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ ఒకరు అభిప్రాయపడ్డారు.
సీమ ప్రాజెక్టులకు నీళ్లు ఎలా?
‘రాయలసీమలో కృష్ణా వరదజలాల ఆధారిత ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చుకునేందుకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. శ్రీశైలంలో +834 అడుగుల నీటిమట్టం రాగానే దిగువ సాగునీటి అవసరాలను బట్టి నీటి వినియోగం ప్రారంభమవుతుంది. నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా అవసరాలు తీరితే తప్ప వరదజలాల ఆధారిత ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వలేరు. మాకు అక్కడ అవసరం లేదు... ఇక్కడ తీసుకుంటామని ప్రభుత్వాలు చెప్పలేవు కదా’ అని అంతర్రాష్ట్ర నదీ జలాల విభాగం నిపుణులు గంగాధర్ ప్రశ్నించారు. ‘వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును అందులో చేరిస్తే కొంతవరకు ఈ సమస్య వచ్చేది కాదు. సాగర్‌కు ఆ జలాలు ఇవ్వగలమని చెప్పి వరద జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటిని మళ్లించుకునే వీలుండేది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘వరద జలాల ఆధారంగా నిర్మించిన సీమ ప్రాజెక్టులకు తొలుత నీళ్లు తీసుకెళ్లే విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులూ అనుమానపడుతున్నారు. ‘రాష్ట్రాలకు కేటాయించిన నీళ్లు ఎక్కడైనా వినియోగించుకోవచ్చన్న ఒప్పందం 2015లో కుదిరినందున దాని ఆధారంగా ఇబ్బందులు తొలగించుకోవచ్చని విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ అభిప్రాయపడ్డారు.
11వ షెడ్యూలు ప్రాజెక్టులకు ప్రత్యేక చోటేదీ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో అప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు ఏపీకి చెందినవి వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, వెలిగోడు ప్రాజెక్టులను విభజన చట్టం 11వ షెడ్యూలులో చేర్చారు. వాటిని విభజన సమయానికే గుర్తించారు. దీని వల్ల వాటికి అనుమతుల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త నోటిఫికేషన్‌లో వెలిగొండను విస్మరించారు. నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టుల గాటనే 11వ షెడ్యూలు ప్రాజెక్టులనూ చేర్చడమేంటని విశ్రాంత ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రశ్నించారు. 11 వ షెడ్యూలు ప్రాజెక్టుల ప్రత్యేకమైనవిగా ఆ నోటిఫికేషన్‌లో పేర్కొనేలా నిబంధన ఉంటే, ఆ వివరణ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
* తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులుగా పేర్కొన్నారు. అదే సందర్బంలో రాయలసీమ ఎత్తిపోతలను అలా పేర్కొనకపోవడం వల్ల ఏపీ ఏం సాధించినట్లని విశ్రాంత చీఫ్ ఇంజినీరు రామకృష్ణ ప్రశ్నించారు.
* గతంలో బోర్డుల పరిధిని ఖరారు చేసే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో బోర్డు ఛైర్మన్, సభ్య కార్యదర్శి చర్చలు జరపారని- అప్పట్లోనే ఏమేం చేర్చాలి, ఏమేం వద్దు అన్న విషయంలో ఏకాభిప్రాయంతో ముసాయిదా రూపొందించగలిగామని- ప్రస్తుతం ఆ ప్రతిపాదనలు అన్నీ మాయమై అన్ని ప్రాజెక్టులూ బోర్డుల పరిధిలోకి తీసుకురావడం విస్మయం కలిగిస్తోందని అప్పటి అధికారులు చెబుతున్నారు.
* గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులు, ఉమ్మడిగా నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టులు లేవు. గోదావరి బోర్డులో ఇన్ని ప్రాజెక్టులను చేర్చవలసిన అవసరం కూడా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు, పశ్చిమగోదావరి వద్ద కొన్ని చెరువులు, ఇలా చిన్న చిన్న అంశాల్లోనే ఉభయ రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయని- ఇన్ని ప్రాజెక్టులు గోదావరి బోర్డులోకి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
సీలేరు విద్యుత్తు కేంద్రం ఎందుకు?
* సీలేరు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తుంది. తెలంగాణతో విద్యుత్తు పంచుకుంటున్నదీ లేదు. ఆ విద్యుత్తు కేంద్రాన్ని గోదావరి బోర్డు పరిధిలోకి తేవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు.
* తుంగభద్ర బోర్డు పరిధిలోకి వచ్చే హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి కాలువలను కృష్ణాబోర్డు పరిధిలోకి ఎలా తెస్తారన్నది మరో ప్రశ్న.
* పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకెళ్లే క్రమంలో మళ్లీ బనకచర్ల, అవుకు టన్నెల్ వంటివి బోర్డు పరిధిలోకి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అదే నీరు దిగువనా వినియోగించే క్రమంలో ఉమ్మడి వివాదాల్లోకి ఆ అవుట్‌లెట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
Tags :