పెల్లుబికిన నిరసన
ఫాదర్ స్టాన్ స్వామి మృతిపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆవేదన
కస్టడీ మరణానికి బాధ్యులెవరో తేల్చండి..
రాష్ట్రపతికి 10 ప్రతిపక్ష పార్టీల నేతల లేఖ
మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదు...
విమర్శలపై కేంద్రం స్పందన
దిల్లీ/ముంబయి: సామాజిక ఉద్యమకారుడు, గిరిజన హక్కుల నేత ఫాదర్ స్టాన్ స్వామి మృతిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర నిరసన, ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ ఘటన తమను తీవ్ర కలతకు, దుఃఖానికి గురిచేసిందని ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాజానికి చెందిన హక్కుల సంఘాల నేతలు పేర్కొన్నారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి మరణానికి బాధ్యులెవరో తేల్చాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి దేశంలోని 10 ప్రతిపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారు. స్వదేశంలో, అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో స్టాన్ స్వామి మృతిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) తొలిసారిగా స్పందించింది. విచారణలో ఉన్న ఖైదీ మృతికి సంబంధించి వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైనే అధికారులు చర్యలు తీసుకున్నారని తెలిపింది. నిందితుడిపై వచ్చిన అభియోగాల తీవ్రత, నేర స్వభావానికి అనుగుణంగానే న్యాయస్థానాలు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయని ఎంఈఏ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకొందని సమర్థించారు. హక్కుల ఉల్లంఘన జరగలేదని పేర్కొన్నారు. స్టాన్ స్వామి అనారోగ్యానికి గురవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరేందుకు న్యాయస్థానం అనుమతించిందని, కోర్టు పర్యవేక్షణలోనే వైద్యం అందించే ప్రయత్నం జరిగిందన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
చర్యలు తీసుకోండి: రాజకీయ పార్టీలు
అంతకు ముందు కాంగ్రెస్ సహా పది ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతికి రాసిన లేఖలో...‘బూటకపు కేసులు బనాయించడంతో పాటు వృద్ధుడైన స్టాన్ స్వామి పట్ల జైలులో అమానవీయంగా వ్యవహరించి ఆయన మరణానికి బాధ్యులైన వారెవరో గుర్తించేలా చర్యలు తీసుకోవాల’ని కోరారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ; ఎన్సీపీ అధినేత శరద్ పవార్; మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత హెచ్.డి.దేవేగౌడ; నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా; పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ; తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం; జీఎంఎం నేత హేమంత్ సొరేన్; సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా; సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి; ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్రపతిని కోరారు. స్టాన్ స్వామి మరణాన్ని వ్యవస్థ చేసిన హత్యగా ఆయన బంధువులు, మిత్రులు, ఎల్గార్ పరిషద్ కేసులో నిందితులు అభివర్ణించారు. ఆసుపత్రిలో చేర్చినా కోలుకోలేని విధంగా అప్పటికే స్టాన్ స్వామి ఆరోగ్యం దెబ్బతిందని, ఇది వ్యవస్థ వైఫల్యమని న్యాయవాది గీతా లూత్రా అభిప్రాయపడ్డారు.
స్టాన్ స్వామి మృతిపై స్పష్టత కావాలి
హక్కుల ఉద్యమ నేత ఏ పరిస్థితుల్లో, ఎలా మరణించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ఐరాస సెక్రెటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజరిక్ వ్యాఖ్యానించారు. స్టాన్ స్వామి మరణం తమ మనసులను కలచివేసిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ మిచెలె బాచెలె తెలిపారు. ప్రాథమిక హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం ఉద్యమించే నేతల్ని, శాంతియుతంగా సమావేశమయ్యే వారిని నిర్బంధించరాదని భారత ప్రభుత్వానికి మరోసారి సూచించినట్లు యూఎన్ మానవహక్కుల హైకమిషన్ అధికార ప్రతినిధి లిజ్ థ్రోసెల్ తెలిపారు. ఐరోపా సమాజంలో మానవ హక్కుల విభాగ ప్రత్యేక రిపోర్టర్ ఎమోన్ గిల్మోర్ కూడా స్టాన్ స్వామి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ముంబయిలో అంత్యక్రియలు
గుండెపోటుతో సోమవారం మృతిచెందిన రోమన్ క్యాథలిక్ మతాచార్యుడైన ఫాదర్ స్టాన్ స్వామి భౌతిక కాయానికి మంగళవారం ముంబయిలో అంత్యక్రియలను నిర్వహించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో బంధువులు, చర్చి ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు కొద్ది మంది హాజరయ్యారు.
అండర్ ట్రయల్స్ విముక్తి కోసం పోరాడాలి: ఆర్థికవేత్త జీన్ డ్రీజ్
ఈనాడు, హైదరాబాద్: ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అండర్ ట్రయల్ ఖైదీల విముక్తి కోసం పోరాడటమే పౌరహక్కుల నేత స్టాన్ స్వామికి ఘన నివాళి అని ఆర్థికవేత్త జీన్ డ్రీజ్ స్పష్టం చేశారు. బీమా కోరేగావ్ కేసులో అరెస్టయి.. కరోనా సోకడం.. తదనంతరం అనారోగ్యంతో సోమవారం ముంబయిలో మరణించిన స్టాన్ స్వామికి సంతాపం తెలిపేందుకు తెలంగాణ మానవ హక్కుల ఫోరం మంగళవారం జూమ్ సమావేశం నిర్వహించింది. స్టాన్ స్వామితో కలిసి ఝార్ఖండ్ ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన జీన్ డ్రీజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాంచీలో మానవహక్కులు, సామాజిక న్యాయం, సమాచార హక్కు వంటి అనేక అంశాలపై ఇద్దరం పనిచేశామన్నారు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ జాతీయ కార్యదర్శి, తమిళనాడు న్యాయవాది సురేష్ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) దుర్మార్గమైందని, మోదీ ప్రభుత్వం దీన్ని రాజకీయ కక్ష సాధింపునకు వాడుకుంటోందని విమర్శించారు. ఎన్.ఐ.ఎ. నమోదు చేసిన మొత్తం 386 కేసుల్లో 312 ఉపా కింద పెట్టినవేనన్నారు. తెలంగాణలో 16 ప్రజాసంఘాలపై నిషేధం ఎత్తివేయడం పెద్ద విజయంగా అభివర్ణించారు. తెలంగాణ మానవహక్కుల ఫోరం నాయకులు జీవన్ కుమార్ సమావేశ సంధానకర్తగా వ్యవహరించారు.
Tags :