ప్రధానాంశాలు
టీవీల్లో పాఠాలు.. వీధుల్లో విద్యార్థులు
సగం మంది చిన్నారులు చదువుకు దూరం
టీవీలు, ఫోన్లు లేకపోవడమూ సమస్యే
‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడి
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటకు చెందిన ఈ చిన్నారులు స్థానిక ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. ఒకవైపు టీవీలో పాఠాలు ప్రసారమవుతుండగా.. ఇలా సైకిళ్లపై వీధుల్లో తిరుగుతున్నారు. వీరిలో ఒకరి తండ్రి మాట్లాడుతూ టీవీలు ఉన్నా చూడటం లేదని చెప్పారు.
ఈనాడు-హైదరాబాద్, ఈనాడు యంత్రాంగం: రాష్ట్ర ప్రభుత్వం జులై ఒకటో తేదీ నుంచి విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సు పాఠాలు ప్రసారం చేస్తున్నా స్పందన అంతంతమాత్రంగానే ఉంది. టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేనివారు కొందరు.. ఉన్నా టీవీ పాఠాలపై ఆసక్తి లేక మరికొందరు.. కుటుంబ సభ్యులతో కలసి పొలం/కూలి పనులకు వెళుతూ ఇంకొందరు.. ఇలా టీవీ పాఠాలను అనేకమంది సద్వినియోగం చేసుకోవడంలేదు. ప్రస్తుతం దూరదర్శన్ యాదగిరి, టీశాట్ విద్య ఛానల్‌లో ప్రసారమవుతున్న పాఠాలను ఎందరు విద్యార్థులు వింటున్నారనే అంశంపై ‘ఈనాడు’ యంత్రాంగం సోమవారం రాష్ట్రంలోని పలు గ్రామాలను పరిశీలించింది. కనీసం సగం మంది విద్యార్థులూ పాఠాలను చూడడంలేదని వెల్లడైంది. గ్రామాల్లో వ్యవసాయ పనుల ఒత్తిడి పెరగడంతో రైతు కుటుంబాలు ఇంటిల్లిపాదీ పొలంబాట పడుతున్నారు. పత్తి చేలో మొక్కలు నాటడం తదితర పనులకు పిల్లలను తీసుకెళ్తున్నారు. దానివల్ల రోజుకు రూ.300 ఆదా అవుతున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామికవాడలోని కంపెనీల్లో కొందరు విద్యార్థులు పనులకు కుదిరారు. గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి 3-10 తరగతుల విద్యార్థులకు టీవీ పాఠాలను ప్రారంభించగా.. ఈసారి జులై 1 నుంచి బ్రిడ్జి కోర్సు పాఠాలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలో దాదాపు 26 వేల పాఠాల్లో 3-10 తరగతుల వారు 18 లక్షల మంది విద్యార్థులున్నారు. గతేడాది వారిలో 1.70 లక్షల మందికి టీవీ సౌకర్యం లేదని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈసారి 1.12 లక్షల మందికి పాఠాలు వినేందుకు టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు లేవని ఇటీవల ప్రకటించింది. అంటే గతేడాది కంటే 58 వేల మందికి ఏదో ఒక సౌకర్యం ఉన్నట్లు అర్థమవుతోంది. టీవీలు ఉన్నా.. పాఠాలను వినని వారే అధికమని అధికారుల లెక్కలే చెబుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం 70 శాతం అంటే పాఠాలను వింటున్నారు. అంటే 30 శాతం దూరంగా ఉంటున్నట్లే. కనీసం 50 శాతం మంది వాటిని ఉపయోగించుకోవడం లేదని ‘ఈనాడు యంత్రాంగం’ పరిశీలనలో వెల్లడైంది.
పదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పేరు గంగరాజు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ఉన్నత పాఠశాలకు గత కొద్దిరోజులుగా వస్తున్నాడు. అతని సొంతూరు కొత్తపల్లి మండలం కమాన్‌పూర్. ఇంట్లో టీవీ లేదు. దీంతో తన అమ్మమ్మ ఊరైన ఒద్యారం వచ్చి ఉంటున్నాడు. అక్కడ కూడా టీవీ లేకపోవడంతో రోజూ బడికి వచ్చి టీవీలో పాఠాలు చూస్తున్నాడు.
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన ఈ బాలిక పేరు అర్చన. స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఇంట్లో టీవీ ఉన్నా ఏ ఛానల్‌లో పాఠాలు వస్తున్నాయో తెలియదని చెబుతోంది.
Tags :