TS News: వైద్యశాఖలో కలకలం
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో డిప్యుటేషన్ల రద్దు
1000 మందికి పైగా సొంత స్థానాలకు వెళ్లాలని ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది డిప్యుటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియమితులైన స్థానాల్లో కాకుండా డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లపై వేర్వేరు చోట్ల పనిచేస్తున్న వారందరూ తక్షణమే తమ నియమిత స్థానాల్లో చేరాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు సోమవారం ఆదేశాలు జారీచేశారు. అన్ని స్థాయుల డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వైద్యశాఖలో కలకలం రేగింది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్ల పేరిట 1000 మందికి పైగా ఉద్యోగులు వేర్వేరు చోట్ల పనిచేస్తున్నట్లు అంచనా. వారిలో చాలామంది పైరవీలు చేయించుకొని, ముడుపులు ముట్టజెప్పి తమకు అనుకూల ప్రదేశాల్లోనో పనిచేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వారు పనిచేయాల్సిన ప్రదేశాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దీనిపై ఇప్పటికే ‘ఈనాడు’ కథనాలను ప్రచురించింది. డిప్యుటేషన్ల వల్ల నష్టాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్, వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని డిప్యుటేషన్లపై చర్యలు తీసుకుంటే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags :