comparemela.com


వయసే చిన్నది.. ఆశయం కాదు!
వయసే చిన్నది.. ఆశయం కాదు!
నెలసరి, ఆ సమయంలో పాటించాల్సిన శుభ్రత గురించి ప్రస్తావించడమే తప్పుగా భావిస్తుంటారు. కానీ ఓ 20 ఏళ్ల అమ్మాయి వీటిపై అవగాహన కల్పించడమే కాకుండా ఆ సమయంలో అవసరమైన ఉత్పత్తులనూ అందిస్తోంది. ఇందుకోసం రుతుచక్ర పేరిట ఓ ఎన్‌జీఓనే ఏర్పాటు చేసింది. ఆమే సంజనా దీక్షిత్‌.
తన పదహారో పుట్టినరోజును ఓ ఎన్‌జీఓలో నిర్వహించుకోవడానికి వెళ్లింది సంజనా దీక్షిత్‌. అక్కడ అపరిశుభ్రంగా ఉన్న టాయ్‌లెట్‌లు, నిర్వహణ సరిగా లేని గదులు చూసి షాక్‌కు గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎలా జీవించగలుగుతారని తీవ్ర ఆవేదనకు లోనైంది. ఆ సమయంలో కొందరు అమ్మాయిలు నెలసరి రోజుల్లో స్కూలు, కాలేజ్‌లకు దూరమవ్వడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, మూఢనమ్మకాలు వంటి విషయాలపై వార్తాపత్రికలో కథనం చదివాక ఈ విషయాలపై యువతులకు అవగాహన కల్పించాలనుకుంది. మొదట తను వెళ్లిన ఎన్‌జీఓకే వెళ్లి నిర్వాహకులతో మాట్లాడి, అక్కడి అమ్మాయిలకు అవసరమైన శానిటరీ న్యాప్కిన్లను అందించాలనుకుంది. తెలిసినవారు, బంధువులు, స్నేహితుల నుంచి నిధులు సేకరించింది. రూ.15వేల లక్ష్యంతో మొదలుపెడితే రూ.50 వేలు వసూలయ్యాయి. వాటితో ప్యాడ్‌లను కొని బెంగళూరులోని వివిధ ఎన్‌జీఓలకు అందించింది.
కేవలం శానిటరీ న్యాప్కిన్లకే పరిమితమైతే సరిపోదనిపించిందామెకు. గైనకాలజిస్టులతో మాట్లాడి ముందుగా తను పూర్తి అవగాహన తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రుతుచక్ర’ పేరిట సంస్థను ప్రారంభించింది. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు అపరిశుభ్రత కారణంగా వచ్చే జబ్బులు, దానిపై ఉన్న అపోహలు, గర్బధారణ సమస్యలపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. మొదట ఎన్‌జీఓల్లో వర్క్‌షాప్‌లను నిర్వహించింది. క్రమంగా చుట్టూ ఉన్న గ్రామాలకూ విస్తరించింది. బోధనలా ఉంటే వినడానిక్కూడా ఇష్టపడరని గ్రహించింది. వాళ్లతో మాట్లాడుతూ, చర్చిస్తూ అవగాహన కల్పించేది. మొదట్లో కుటుంబ సభ్యులే సాయం చేసేవారు. తర్వాతర్వాత ఎంతోమంది వాళ్లే వచ్చి చేరడం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ పదిలక్షలకుపైగా శానిటరీ ప్యాడ్‌లు, టాంపూన్‌లను అందించింది. దాదాపుగా 10వేల మందికి వీటిపై అవగాహన కల్పించింది. కొవిడ్‌ సమయంలోనూ దీన్ని కొనసాగించింది.
ఈ క్రమంలో సంజన ఎన్నో సవాళ్లనూ ఎదుర్కొంది. చిన్నమ్మాయి అనే ఉద్దేశంతో కొందరు తన మాటనే పట్టించుకునేవారు కాదు. కష్టపడి కొంతమందిలో మార్పు తెచ్చినా కొద్దిరోజులకే మళ్లీ పాత పద్ధతుల్లోకి మారేవారు. కొందరు సాయం చేయకపోగా ‘నీకెందుకివన్నీ.. బుద్ధిగా చదువుకో’మని సలహాలిచ్చేవారు. కానీ తాను ఇవేమీ పట్టించుకోలేదు. ప్రతి ప్రాంతానికీ తిరిగి ఆరు నెలలకోసారి వెళ్లి పరిశీలించడం మొదలుపెట్టింది. అవసరమైతే సూచనలూ ఇచ్చేది. ఈమె చేస్తున్నదాన్ని గమనించి కొన్ని ఎన్‌జీవోలతోపాటు అశోకా ఇండియాస్‌ యంగ్‌ ఛేంజ్‌ మేకర్‌ వాళ్లు కలిసి పనిచేసే అవకాశమిచ్చారు. దీంతో నెట్‌వర్క్‌ను పెంచుకోవడం, సేవలను విస్తృతం చేయడం సులువైంది. అంతేకాదు.. విమెన్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి ‘యంగ్‌ లీడర్‌’ అవార్డునూ పొందింది. ‘ఏదైనా పనిని బలంగా చేయాలనుకుంటే దానికి వయసేమీ అడ్డు కాద’ంటుంది సంజన. నిజమే.. తను చేసి నిరూపించింది కూడా. ఇప్పుడు 12 నుంచి 60 ఏళ్ల వారి వరకూ 200కుపైగా శాశ్వత వలంటీర్లు తన సంస్థలో పనిచేస్తున్నారు. మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, ఫైనాన్స్‌, క్యాంపెయినింగ్‌లకు తన స్నేహితులు, 20 ఏళ్లలోపు వారినే నియమించుకుంది. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను అందించడమే కాకుండా.. తాజా గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలనూ కల్పిస్తోంది. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో మాలిక్యులర్‌ బయాలజీ, బిజినెస్‌ ఎకనామిక్స్‌ల్లో మేజర్స్‌ చేస్తోంది. ఓవైపు చదువుతూనే సంస్థ కార్యకలాపాలు చూసుకుంటోంది. తను బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా... వాలీబాల్‌ క్రీడాకారిణి, కీబోర్డ్‌ ప్లేయర్‌, భరత నాట్యం నేర్చుకోవడంతోపాటు తైక్వాండోలో బ్లాక్‌ బెల్ట్‌నూ సాధించింది.
Tags :

Related Keywords

California ,United States ,Bangalore ,Karnataka ,India ,Bharata Natyam ,University California Biology ,கலிஃபோர்னியா ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,பெங்களூர் ,கர்நாடகா ,இந்தியா ,பாரத நாட்டியம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.