తెలుగు భాషను చిదిమేయడం ఘోరం: రఘురామ
ఈనాడు, దిల్లీ: ‘దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు మాతృ భాష తుళు. పరభాష వారికే తెలుగు ఇంత మధురంగా అనిపిస్తుంటే తెలుగువాడిగా పుట్టి, తెలుగు భాషను నోరారా మాట్లాడుకుంటున్న మనం ఎంత అదృష్టవంతులం? దేశంలో హిందీ తర్వాత అతి ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. అలాంటి తెలుగు భాష ప్రాశస్త్యాన్ని తెలుగు రాష్ట్రంలోనే చిదిమేస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది’ అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. ‘రాష్ట్రంలోని 69,561 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనే మీ నిర్ణయం అమలుకు అవసరమైన యంత్రాంగం ఉందో లేదో అని మీరు ఆలోచించారా? బోధించగలిగే ఉపాధ్యాయులు ఉన్నారో లేదో చూశారా? మీ తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన చట్టాన్ని తెలుసుకున్నా మీరు తెలుగు భాషను అంతం చేయాలనే నిర్ణయం తీసుకుని ఉండరు. విద్యా హక్కు చట్టం, 2009 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ బాలల నిర్బంధ ఉచిత విద్యా చట్టం-2010 తీసుకువచ్చారు. ఆ చట్టంలో ఎంతో స్పష్టంగా, సాధ్యమైనంత వరకూ పిల్లలకు వారి మాతృ భాషలోనే విద్యా బోధన జరపాలని నిర్దేశించారు. మీరు మీ తండ్రి నిర్ణయానికి పూర్తి విరుద్ధంగా వెళుతున్నారు. రాష్ట్ర హైకోర్టు ఆంగ్ల మాధ్యమం జీవోను కొట్టేసిన తర్వాత మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి ఇదే విషయం చెప్పారు. మాతృభాషలోనే విద్యా బోధన జరగాలనే అంశం విద్యా హక్కు చట్టంలో ఎక్కడా లేదని మీరు వాదించారు. రాజ్యాంగంలోని 350 (ఏ) అధికరణలో ఈ విషయం స్పష్టంగా ఉందన్న అంశాన్ని నేను పార్లమెంటులో ప్రస్తావించా. మీరు నాపై ఆగ్రహించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు చెబుతూ నన్ను అనర్హుడిగా ప్రకటించేందుకు ప్రయత్నించారు. తెలుగు పదకోశాన్ని రూపొందించిన సి.పి.బ్రౌన్ మీ సొంత జిల్లా కడపలో పని చేశారు. ఆయన పేరు మీద మీ జిల్లాలో ఉన్న గ్రంథాలయానికి ఎప్పుడూ వెళ్లి ఉండరు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టాలన్న మీ సంకల్పం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. మీరు అనుకున్నదే జరగాలంటే పార్లమెంటులో మూడొంతుల మంది కూర్చుని రాజ్యాంగాన్ని సవరించాలి. మీరు ఇప్పటికైనా తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకోండి. జాతీయ విద్యా విధానాన్ని తు.చ తప్పకుండా అనుసరించి మీ గౌరవం... ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచండి’ అని రఘరామ కోరారు.
Tags :