ప్రధానాంశాలు
వామపక్షాల ‘చలో రాజ్‌భవన్’ భగ్నం
మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
నాయకులు, కార్యకర్తల అరెస్టు
కవాడిగూడ, న్యూస్‌టుడే: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు చేపట్టిన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. బుధవారం ధర్నా చౌక్ నుంచి రాజ్‌భవన్ వైపు బయలుదేరిన వామపక్షాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి వివిధ ఠాణాలకు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, రైతులకు వ్యతిరేకంగా ప్రధాని మూడు సాగు చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. పెట్రో ధరలకు హద్దు లేకుండా పోయిందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, లీటరు పెట్రోల్ అసలు ధర రూ.30 ఉండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.70 పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది ప్రకటించిన ప్యాకేజీ నిధులను విడుదల చేయకుండానే తాజాగా రూ.ఆరు లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించడం కంటితుడుపు చర్యేనన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి రాజేశ్, ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి మురారి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, పలు వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.
Tags :
ప్రధానాంశాలు