Published : 01/07/2021 02:25 IST
టోక్యోకు ద్యుతి చంద్
టోక్యో ఒలింపిక్స్ ఇంకో 22 రోజుల్లో
దిల్లీ: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులలో ఒలింపిక్ బెర్తులు సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్ కోటాలో 100 మీ పరుగులో 22 స్థానాలు, 200 మీ పరుగులో 15 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. 100 మీ.లలో 44వ, 200 మీ.లలో 51వ ర్యాంకుల్లో ఉన్న ద్యుతికి సునాయాసంగా ఒలింపిక్ బెర్తులు దక్కాయి. పటియాలాలో జరుగుతున్న అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్‌లో 100 మీ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచిన ద్యుతికి ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం చేజారింది. మరోవైపు స్టార్ అథ్లెట్ హిమ దాస్ ప్రపంచ ర్యాంకింగ్ కోటాలో టోక్యో బెర్తు సంపాదించడంలో విఫలమైంది. గతవారం ఇండియా గ్రాండ్‌ప్రిక్స్‌లో 200 మీ పరుగును 22.88 సెకన్లలో పూర్తిచేసిన హిమ.. 00.08 సెకన్ల తేడాతో నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్నీ కోల్పోయింది. జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా గాయపడిన హిమ ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం ఇక లేనట్లే.
స్విమ్మర్ శ్రీహరి కూడా: భారత్ నుంచి తొలిసారి ఇద్దరు స్విమ్మర్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్ ప్రకాశ్ ఇప్పటికే బెర్తు సంపాదించగా.. తాజాగా శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. శ్రీహరి కూడా నేరుగా టోక్యో బెర్తు నెగ్గడం విశేషం. ఇటలీలోని రోమ్‌లో జరిగిన సెట్టె కోలీ ట్రోఫీలో 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ టైమ్ ట్రయల్‌లో శ్రీహరి ఎ- అర్హత ప్రమాణాన్ని అందుకున్నట్లు ఫినా బుధవారం గుర్తించింది. ‘‘సెట్టె కోలీ ట్రోఫీలో శ్రీహరి 53.77 సెకన్ల టైమింగ్‌తో ఒలింపిక్ అర్హత సమయాన్ని అందుకున్నాడు. ఇదే విషయాన్ని ఫినాకు భారత స్విమ్మింగ్ సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) నివేదించింది. టోక్యోలో సాజన్ ప్రకాశ్‌తో పాటు శ్రీహరి బరిలో దిగనున్నాడు’’ అని ఎస్‌ఎఫ్‌ఐ ప్రకటించింది.
Tags :