ప్రధానాంశాలు
దళితుల హామీలు కేసీఆర్ అమలు చేయలేదు
అఖిలపక్ష భేటీకి మోత్కుపల్లి హాజరు ఆయన వ్యక్తిగతం
భాజపా నేత వివేక్ వెంకటస్వామి
ఈనాడు, హైదరాబాద్: దళితుల పట్ల తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఓట్ల రాజకీయం కోసమే ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహిస్తున్నారని భాజపా ఆక్షేపించింది. ప్రభుత్వ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ దళిత నేతలతో ఆదివారం సమావేశం నిర్వహించింది. కోర్ కమిటీ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారుశ్రుతి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి తదితరులతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో ఈటల గెలుస్తారన్న భయం కేసీఆర్‌కు పట్టుకుందని, ఆ నియోజకవర్గంలో ఉన్న 45 వేల దళితుల ఓట్లు సంపాదించడానికే సీఎం అఖిలపక్ష సమావేశం పెట్టారని విమర్శించారు. దళిత సీఎం హామీని నిలబెట్టుకోవాలని, దళితులకు మూడెకరాల భూపంపిణీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘దళిత ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, కడియం శ్రీహరిని తొలగించారు. ఇచ్చిన మాట తప్పిన దళిత వ్యతిరేకి’ అంటూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దళితులపై ప్రేమ ఉంటే 2014 అఖిలపక్షం నిర్ణయాల్ని అమలు చేయాలన్నారు. అఖిలపక్ష భేటికి మోత్కుపల్లి వ్యక్తిగతంగా వెళ్లారని.. పార్టీకి సంబంధం లేదని వివేక్ చెప్పారు.
Tags :
ప్రధానాంశాలు