ప్రధానాంశాలు
Revanth Reddy: ప్రజా పునరేకీకరణ జరగాలి
ఉన్నవాళ్లకే కేసీఆర్ పథకాలు
కాంగ్రెస్‌లో ఉమ్మడి నిర్ణయాలే
జులై 7న పీసీసీ బాధ్యతల స్వీకరణ
ఇష్టాగోష్ఠిలో రేవంత్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను విడదీసి తన అధికారాన్ని పదిలం చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు రైతుబంధు అందడం లేదని, భూస్వాములకే ఉపయోగపడుతోందన్నారు. భూమి లేని పేదలకు ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించడం లేదన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఉన్నవాళ్లకే ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఉద్యోగాల భర్తీపై దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారమే రాష్ట్రంలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని.. ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటామని, పార్టీ నిర్ణయం మేరకే ముందుకు వెళ్తామని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటానన్నారు. సంస్థాగతంగా రాష్ట్రంలో బలంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో భాజపా బలహీనంగా ఉందని.. దాని ప్రభావం తక్కువేనన్నారు. రైతులకు సంబంధించి అద్భుతమైన ప్రణాళిక తమ వద్ద ఉందని, పార్టీ ఆమోదం పొందిన తర్వాత దాన్ని వెల్లడిస్తామన్నారు. కృష్ణా జలాలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం కోసమే వైఎస్‌ను విమర్శిస్తున్నారన్నారు. ఆయనను తిట్టడం వల్ల షర్మిల పెట్టబోయే పార్టీకే ఉపయోగమన్నారు. రాజశేఖరరెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయని ఆరోపించారు. జులై 7న మధ్యాహ్నం 1.30కు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు రేవంత్ తెలిపారు.
రేవంత్‌కు అభినందనల వెల్లువ
రేవంత్‌రెడ్డిని ఆదివారం నేతలు మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య, షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంద కృష్ణ మాదిగ ఫోన్ చేసి అభినందించారు. మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి రేవంత్‌రెడ్డి కలిశారు.
Tags :
ప్రధానాంశాలు