comparemela.com


ప్రధానాంశాలు
లైసెన్సు లేకుండా వాణిజ్య కార్యకలాపాలా?
ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ వైఖరి చట్టవిరుద్ధం
ఏపీఈఆర్‌సీని పక్కన పెట్టడం సరి కాదు
సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల కేసు తీర్పులో హైకోర్టు వ్యాఖ్యలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) రూపొందించిన రిక్వెస్ట్‌ ఫర్‌ సెలెక్షన్‌ (ఆర్‌ఎఫ్‌ఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు విద్యుత్‌ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. తాము కేవలం విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసి, రైతులకు ఉచితంగా అందజేసేందుకు నోడల్‌ ఏజెన్సీగానే వ్యవహరిస్తున్నామని, దానిలో వాణిజ్య కార్యకలాపాలేవీ లేవని ఏపీజీఈసీఎల్‌ పేర్కొనడాన్ని తప్పుబట్టింది. ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలుకయ్యే వ్యయాన్ని ఏపీజీఈసీఎల్‌కి ప్రభుత్వమే చెల్లిస్తుంది కాబట్టి... అది వాణిజ్య లావాదేవీయే అవుతుందని, ఆ సంస్థ లైసెన్సు లేకుండా అలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు వీల్లేదని ఈ నెల 17న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. తీర్పు పూర్తిపాఠం మంగళవారం అందుబాటులోకి వచ్చింది. దాని ప్రకారం... వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నందున ఏపీజీఈసీఎల్‌ చర్యలు పారదర్శకంగా, సముచితంగా ఉండాలని, ఇష్టానుసారం చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఏపీజీఈసీఎల్‌ నిర్వహించిన టెండరు ప్రక్రియ విద్యుత్తు చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఆ తీర్పు వెలువరించింది. తీర్పులోని మరిన్ని ముఖ్యాంశాలు..
* ప్రభుత్వం ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్‌ఎఫ్‌ఎస్‌, డ్రాఫ్టు పీపీఏల రూపకల్పనలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల రాబోయే ప్రభుత్వాలు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌ 63 నిబంధనలకు లోబడి టెండర్లను పిలవకపోవడం వల్ల ఎక్కువ మందికి బిడ్‌ దాఖలుచేసే అవకాశం లభించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నాం. సీబీజీ నిబంధనలకు లోబడి టారిఫ్‌ బేస్డ్‌ బిడ్డింగ్‌ విధానంలో కొత్తగా టెండర్లు పిలిచే విషయాన్ని ఏపీజీఈసీఎల్‌ నిర్ణయానికే వదిలేస్తున్నాం.
* టెండరు నిబంధనలు రూపొందించాక, ఏపీజీఈసీఎల్‌ వాటిని న్యాయసమీక్షకు పంపించి, వారి అనుమతి తీసుకున్నా.. నిబంధనలు అతిక్రమించినట్లు దాఖలైన పిటిషన్లపై విచారించే అధికారం న్యాయస్థానానికి ఉంది.
* ఈ కేసు విషయంలో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) దగ్గరకు వెళ్లాలని పిటిషనర్‌ను ఆదేశించలేం.
* ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పీపీఏల వ్యవధి పెంచింది. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన మొత్తానికి రాష్ట్రప్రభుత్వం హామీగా ఉంది. ప్రైవేటు, అసైన్డు భూములకు లీజు, విద్యుత్తు ఉత్పత్తి, బ్యాక్‌డౌన్‌ చేసిన సమయంలో పరిహారాన్ని చెల్లించడానికి వీలుగా డ్రాఫ్టు పీపీఏల్లో నిబంధనలను చేర్చింది. 5 మెగావాట్లకు మించి విద్యుత్తు ఉత్పత్తిచేసే ప్రాజెక్టుకు విద్యుత్తు చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి.
* టెండరు దాఖలు చేయడానికి పిటిషనర్‌ టాటా సంస్థకు అన్ని అర్హతలూ ఉన్నాయి. ప్రభుత్వ చర్యల వల్ల తమ హక్కులకు భంగం కలగడం వల్లే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్‌ఎఫ్‌ఎస్‌, డ్రాఫ్టు పీపీఏలు నిబంధనల మేరకు ఉన్నాయా.. లేదా? అనేదే ముఖ్యం. ప్రభుత్వం పేర్కొన్నట్లుగా టాటా సంస్థ బిడ్‌ దాఖలు చేయలేదని, దీనివల్ల పిటిషన్‌ దాఖలుచేసే అర్హత లేదన్న వాదనను పరిగణనలోకి తీసుకోం.
* విద్యుత్తు టారిఫ్‌ను నిర్ణయించే అధికారం చట్టప్రకారం ఏపీఈఆర్‌సీకే ఉంది. ఆర్బిట్రేషన్‌ కింద వివాదాలనూ పరిష్కరిస్తుంది. కానీ, డ్రాఫ్టు పీపీఏల్లో వివాదాల పరిష్కారానికి ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు, ఉత్పత్తి సంస్థల నుంచి ఒకరు ఉంటారని పేర్కొంది. ఇది సెక్షన్‌ 86(10(ఎఫ్‌) కింద నిబంధనలకు విరుద్ధం. ఈ చర్య ద్వారా ఏపీఈఆర్‌సీకి ఉన్న అధికారాన్ని పక్కన పెట్టినట్లయింది.
Tags :

Related Keywords

Amravati ,Maharashtra ,India , ,Stata Energy ,Zap Energy ,High Court ,Act Regulations ,அமராவதி ,மகாராஷ்டிரா ,இந்தியா ,டாடா ஆற்றல் ,அப் ஆற்றல் ,உயர் நீதிமன்றம் ,நாடகம் ஒழுங்குமுறைகள் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.