comparemela.com


కథలు చెప్పే కళకు వన్నె తెస్తూ...
అది పురుషులకే పరిమితమైన కళ! అయినప్పటికీ ఉర్దూలో కథలు చెప్పే ‘దాస్తాంగోయి’ని ఇష్టంగా ఎంచుకుని, అంతరించే దశలో ఉన్న ఆ కళకు కొత్త జీవం పోసిందా ముస్లిం మహిళ. మొట్టమొదటి దాస్తాంగోయి మహిళా కళాకారిణిగా పేరు తెచ్చుకున్న ఫౌజియా ఆసక్తికరమైన కథల ప్రయాణం ఇది.
పాత ఢిల్లీకి చెందిన ఓ దిగువ తరగతి కుటుంబంలో పుట్టిన ఫౌజియా ఏడో తరగతి నుంచే ట్యూషన్లు చెబుతూ ఆ సంపాదనతో కుటుంబానికి అండగా నిలబడింది. జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ నుంచి సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసి, ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ ముగించి స్టేట్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌లో లెక్చరర్‌ ఉద్యోగంలో చేరింది. అలా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఫౌజియాకు 2006లో దాస్తాంగోయి అనే కళ గురించి తెలిసింది. మొహమ్మద్‌ ఫారూకీ, దానిష్‌ హుస్సేన్‌ల ప్రదర్శన చూసిన తర్వాత తాను స్థిరపడవలసిన వృత్తి విద్యాబోధన కాదనీ, దాస్తాంగోయి అనీ ఆమెకు అనిపించింది. ఉర్దూ మాధ్యమంలో విద్య సాగడం, ఉర్దూ సాహిత్యాభిలాష, కథలు చెప్పే స్వభావం కలిగి ఉండడం వల్ల ఆ సంప్రదాయ కళ మీద తేలికగానే పట్టు సాధించగలిగింది ఫౌజియా. అయితే దాస్తాంగోయి మహిళలు ప్రయాణించని కొత్త మార్గమనీ, ఆ ప్రయాణంలో తానెన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందనీ ఫౌజియాకు తెలుసు. అందుకే వేలెత్తి తప్పును చూపించే అవకాశం ఇతరులకు దక్కే వీలు లేకుండా, మొహమ్మద్‌ ఫారూకీ దగ్గరే దాస్తాంగోయిలో శిక్షణ తీసుకుంది. అలా ఆయన ఆధ్వర్యంలో 2006లోనే తొలి ప్రదర్శన ఇచ్చింది.
మార్గనిర్దేశం లేకపోయనా...
పురుషాధిక్య దాస్తాంగోయి కళా ప్రదర్శనలో ఆమె ఎన్నో అవాంతరాలను కూడా ఎదుర్కొంది. హిజాబ్‌, బుర్ఖా కూడా ధరించకుండా ప్రదర్శనకు హారజరయ్యే ఫౌజియాను చూసి ప్రారంభంలో ప్రేక్షకులందరూ విస్తుపోయేవారు. తన ప్రయాణం గురించి వివరిస్తూ... ‘‘మార్గనిర్దేశం చేసే వ్యక్తులు లేరు. అడుగుజాడల్లో నడవదగిన వాళ్లు కూడా లేరు. గాడ్‌ ఫాదర్లు అంతకన్నా లేరు. నా కుటుంబం కళాకారుల  కుటుంబం కాదు. ఇదంతా నాకు పూర్తిగా కొత్త ప్రపంచం. కాబట్టి ఈ కళకు సంబంధించిన నిబంధనలను అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా నన్ను నేను మలుచుకున్నాను. ఈ ప్రయాణంలో ఎన్నో సార్లు తొట్రుపడ్డాను. తిరిగి నిలదొక్కుకున్నాను. ఆ క్రమంలో ఎన్నో పాఠాలూ నేర్చుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది ఫౌజియా. అలా 2014లో తన లెక్చరర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిగా దాస్తాంగోయి కళకే అంకితమైపోయింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి తొలి మహిళా దాస్తాంగోయి కళాకారిణిగా ప్రశంశలు అందుకుంది.
సమాజ శ్రేయస్సే లక్ష్యంగా....
ప్రారంభంలో ఫౌజియా కథలు చెప్పే ప్రక్రియ ‘ఖార్ఖందారీ జబాన్‌’ రూపంలో సాగేది. బాల్యంలో ఆమె మేనత్తలు, అమ్మ, అమ్మమ్మలు కథలు చెప్పిన తీరు పేరది. ఆ తర్వాత సామాజిక సందేశాలు కలిగిన కథలు చెప్పడం మొదలుపెట్టింది. అలాగే 1947 దేశ విభజన సమయంలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, మానసిక సమస్యలు, స్త్రీవాదంతో కూడిన కథలు కొనసాగించింది. ప్రముఖ స్ర్తీవాద రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయికి చెందిన నన్హీ కి నానీ కథను కూడా ప్రదర్శించింది. అలాగే పర్దా వ్యవస్థ నుంచి ఆవిర్భవించిన, పాత ఢిల్లీకి చెందిన మహిళలు మాట్లాడే బేగమతీ జబాన్‌ భాష సంరక్షణ మీద కూడా ఫౌజియా దృష్టి పెట్టి, ఆ భాషతో కథలు చెబుతూ ఉంటుంది. 
‘దాస్తాంగోయి అనేది ఒక లైవ్‌ ఆర్ట్‌. దీనికి కెమెరా, మైక్‌లతో పని లేదు’ అంటున్న ఫౌజియా కొవిడ్‌ కాలంలో రేడియో మాధ్యమంగా తన కళను కొనసాగించింది. రేడియో రెడ్‌ ఎఫ్‌ఎమ్‌లో దాస్తాన్‌ ఇ బాలీవుడ్‌ పేరుతో మధుబాల, మీనా కుమారి మొదలైన పాత తరం హిందీ నటీమణుల సంగతులను చెబుతూ, శ్రోతలను అలరించింది. టాగూర్‌ వెటరన్‌ ఆర్టిస్ట్‌ అవార్డుతో పాటు, ఇండియాస్‌ ఫస్ట్‌ ఉమన్‌ దాస్తాంగోయి ఆర్టిస్టుగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి గుర్తింపునూ దక్కించుకుంది. దాస్తాంగోయి కళను పౌరాణిక, చారిత్రక కథలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలతో రంగరించి సమాజ శ్రేయస్సుకు దోహదపడవచ్చు అంటున్న ఫౌజియా ఊపిరి ఉన్నంత కాలం దాస్తాంగోయి కళాకారిణిగానే కొనసాగుతానని అంటోంది.
అరేబియా కథల వెనకున్న కథ!
13వ శతాబ్దానికి చెందిన ఉర్దూ కథలు చెప్పే కళ మూలాలు ఇస్లాం మతం ఆవిర్భావానికి ముందునాటి అరేబియాలో ఉన్నాయి. అలా కథలు చెప్పే కళను పర్షియా భాషలో ‘దాస్తాంగోయి’ అంటారు. దాస్తాన్‌ అంటే కథ, గోయి అంటే చెప్పడం అని అర్థం. మొఘల్‌ శకంలో భారతీయ ఉపఖండంలోకి ప్రవేశించిన ఈ కళ, 19వ శతాబ్దం నాటికి ఉన్నత స్థాయికి చేరుకుంది. అప్పటి రోజుల్లో లక్నో వీధుల్లో ఈ కళను ఆదరించే ప్రేక్షకులకు కొదవ ఉండేది కాదు. అయితే 19వ శతాబ్దం తదనంతరం ఈ మౌఖిక కథలు చెప్పే సంప్రదాయం క్రమేపీ క్షీణ దశకు చేరుకుంది. చిట్టచివరి దాస్తాంగోయి కళాకారుడు మీర్‌ బకర్‌ అలీ. అతనితో పాటే ఈ కళ కూడా క్రమేపీ అంతరించిపోయింది. ఇలా ఉనికి కోల్పోతున్న కళను 2005లో ఉర్దూ కవి షమ్‌సూర్‌ రెహ్మాన్‌ ఫారుకి, తోటి రచయిత మహమూద్‌ ఫారుకి సహాయంతో వెలుగులోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ కళ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. ఈ కళకున్న ఆకర్షణ కథలు చెప్పే వ్యక్తి కంఠంలో ఉంటుంది. 40 నిమిషాల పాటు సాగే దాస్తాంగోయిలో కథ చెప్పే వ్యక్తి ఏకథాటిగా తన గాత్రంతో, హావభావాలతో ప్రేక్షకులను కథా ప్రపంచంలో విహరింపజేస్తాడు. భాష, నటనల మీద పట్టున్న వ్యక్తులు మాత్రమే దాస్తాంగోయి కళకు అర్హులు.

Related Keywords

Lucknow ,Uttar Pradesh ,India ,Iran ,New Delhi ,Delhi ,Persia ,Meena Kumari ,Jamia University ,Her Travel ,New World ,லக்னோ ,உத்தர் பிரதேஷ் ,இந்தியா ,இரண் ,புதியது டெல்ஹி ,டெல்ஹி ,பெர்சியா ,மீனா குமாரி ,ஜாமியா பல்கலைக்கழகம் ,புதியது உலகம் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.