comparemela.com


House: బిల్డర్‌ దగ్గర ఇల్లు కొంటున్నారా?
ఈ సమాచారాన్ని ముందే తెలుసుకోండి!
సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దీన్ని సాకారం చేసుకునేందుకు అందరూ కష్టపడుతుంటారు. ఎంతో శ్రమకోర్చి, సమయం వెచ్చించి సరైన ఇంటి కోసం వెతుక్కుంటారు. అదే సమయంలో జీవితంలో అతి పెద్ద పెట్టుబడి కూడా ఇల్లే. మరి, ఇంత ప్రాముఖ్యం ఉన్న ఇంటిని కొనేముందు.. పరిశోధించాలి. ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్న ఇల్లుని ముందే బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. కొంత మంది డబ్బు కట్టి ఇంటిని సొంతం చేసుకునేందుకు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులను చూస్తున్నాం. పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించిన తర్వాత కొంత మంది డెవలపర్లు ప్రాజెక్టులను మధ్యలోనే ఆపేస్తుంటారు. కట్టిన డబ్బులను తిరిగి చెల్లిస్తారన్న నమ్మకం కూడా ఉండదు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకుంటే మంచిది. మరి సమాచారం సేకరించేందుకు ఉన్న మార్గాలేంటో ఓసారి చూద్దాం..!
రెరా వెబ్‌సైట్‌
స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) ప్రకారం.. డెవలపర్లు వారి ప్రాజెక్టులకు కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ నంబరు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబరు ఉండాలి. కొనుగోలుదారులకు ప్రాజెక్టు వివరాలు తెలియజేసేటప్పుడు అదే నంబరు చెప్పాలి. అలాగే కరపత్రాలు సహా వివిధ రూపాల్లో చేసే వాణిజ్య ప్రకటనల్లోనూ అదే నంబరు ఉందో.. లేదో.. సరిచూసుకోవాలి.
అలాగే ఈ వెబ్‌సైట్‌లో ప్రమోటర్లు, బిల్డర్లకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది. వారిని సంప్రదించేందుకు కావాల్సిన సమాచారంతో పాటు గత ఐదేళ్లలో వారి ప్రాజెక్టుల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. వీటిని క్షుణ్నంగా పరిశీలించడం వల్ల బిల్డర్ సామర్థ్యం ఏంటో తెలుస్తుంది. అలాగే ప్రాజెక్టు పేరు, రకం, చిరునామా, వైశాల్యం, ధ్రువీకరించిన సంస్థ, పార్కింగ్ ఏరియా, ప్రాజెక్టు స్థితి, ప్రాజెక్టు అంచనా వ్యయం, ఎప్పటికి పూర్తవుతుంది వంటి వివరాలు కూడా రెరా సైట్లో బిల్డర్లు పొందుపరచాల్సి ఉంటుంది. వీటిని బట్టి బిల్డర్‌ లేదా డెవలపర్ల విశ్వసనీయతను అంచనా వేయొచ్చు.
ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు లభించాయో.. లేదో.. కూడా సైట్లో ముందే చెక్ చేయాలి. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బిల్డర్‌ సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి ఏవైనా పోలీసు కేసులు ఉంటే ఆ సమాచారాన్ని కూడా సైట్లో అందుబాటులో ఉంచాలి. ఇలా ఇల్లు కొనే ముందే ఈ సమాచారాన్నంతా సేకరించి పెట్టుకుంటే మంచిది. తర్వాత ఏవైనా ఇబ్బందులు తలెత్తినా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. పైన తెలిపిన వివరాలు రెరా సైట్లో లేనట్లయితే కచ్చితంగా జాగ్రత్తపడాల్సిందే.
బిల్డర్‌ ఆర్థిక పరిస్థితి
బిల్డర్లు, వారి కంపెనీకి సంబంధించిన ఆర్థిక స్థితిగతుల్ని ముందే తెలుసుకోవాలి. చాలాసార్లు బిల్డర్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రాజెక్టును ముందే ఆపేస్తుంటారు. కొనుగోలుదార్ల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత చేతులేత్తేసిన సందర్భాలూ మనం చూస్తున్నాం. అసలు ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందా? ముందు చెప్పినట్లుగా సరైన మన్నికతో పూర్తి చేస్తారా?అన్న విషయాలు పూర్తిగా బిల్డర్‌ ఆర్థిక స్థితిగతులపైనే ఆధారపడి ఉంటాయి.
ఈ నేపథ్యంలో లిస్టెడ్‌ బిల్డర్లు అయితే, స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమర్పించే సమాచారంలో అన్ని వివరాలు ఉంటాయి. లిస్టెడ్‌ కాకపోయినట్లయితే. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ(ఎంసీఏ) వెబ్‌సైట్లో ‘వ్యూ పబ్లిక్‌ డాక్యుమెంట్స్‌’ అనే సెక్షన్‌లోకి వెళితే బిల్డర్లు, వారి ప్రాజెక్టుల ఆర్థిక వివరాలు తెలిసే అవకాశం ఉంది. లేదంటే ‘సెంట్రల్‌ రిజిస్ట్రీ ఆఫ్‌ సెక్యూరిటైజేషన్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ సెక్యూరిటీ ఇంట్రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా (సీఈఆర్‌ఎస్‌ఏఐ)’ వెబ్‌సైట్లో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాపర్టీని మోర్టగేజ్ చేసినట్లయితే బ్యాంకు లేదా గృహరుణ సంస్థల వివరాలు ఉంటాయి.
గత ప్రాజెక్టులను సందర్శించండి
బిల్డర్‌ గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టు వివరాలను కనుక్కొని వాటిని నేరుగా సందర్శించాలి. తద్వారా బిల్డర్‌ విశ్వసనీయత తెలుస్తుంది. కరపత్రాలలో, వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న పలు రకాల వసతులు, నాణ్యత వివరాలు, సాంకేతికత అంశాలు ఆ ప్రాజెక్టుల్లో సరిగ్గా ఉన్నాయో..లేదో..చూసుకోవాలి. అలాగే అక్కడి కొనుగోలుదారులు ఆ బిల్డర్‌తో వారికున్న అనుభవాలను కూడా పంచుకునే అవకాశం ఉంది.
సామాజిక, వార్తా, ప్రసార మాధ్యమాలు
ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ఇప్పుడు అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇలా ప్రాజెక్టుకు సంబంధించి ఆయా బిల్డర్లు పోస్టు చేసే సమాచారాన్ని పరిశీలించాలి. వాటి కింద కామెంట్లను కూడా చూడడం వల్ల ఏమైనా లోపాలుంటే తెలిసిపోతుంది. గతంలో వారి వద్ద ఇల్లు కొన్నవారు ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వార్తా పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రాజెక్టుకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటారు. అందులో ఇచ్చిన సమాచారం.. మనకు చెప్పిన వివరాలతో పోల్చుకొని చూడాలి. 
ఇంటిని ఎప్పుడూ తొందరపాటుతో కొనుగోలు చేయొద్దు. కరపత్రాలలో, వాణిజ్య ప్రకటనల్లో పేర్కొన్న పలురకాల వసతులు, నాణ్యత వివరాలు, సాంకేతికత అంశాలకు చట్టబద్ధత ఉంటుంది. లోపాలుంటే వీటిని ఆధారంగా చూపి న్యాయం పొందవచ్చు. ఆయా కరపత్రాలు, ప్రకటనలపై కచ్చితంగా రెరా నంబర్‌ ఉండాలి. నిర్మాణ ప్లాన్‌ను కొనుగోలుదారుని ప్రమేయం లేకుండా వ్యాపారి మార్పులు, చేర్పులు చేస్తుంటారు. అనుమతి ఒకటి తీసుకుని మరో విధంగా నిర్మిస్తుంటారు. ఒకవేళ మార్పు చేస్తే కొనుగోలుదారుడికి సమాచారం ఇవ్వాలి. లేకపోతే వారు రెరాలో ఫిర్యాదు చేయవచ్చు.
- ఇంటర్నెట్‌ డెస్క్‌
ఇవీ చదవండి

Related Keywords

India , ,Security India ,இந்தியா ,பாதுகாப்பு இந்தியா ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.