comparemela.com


మోదీ vs భారత్‌
దేశంలో ఎమర్జెన్సీ కంటే ప్రమాదకర పరిస్థితి 
పార్లమెంటు సమావేశాల తర్వాత ప్రతిపక్షాల ఐక్యతపై చర్చలు
‘కూటమి’కి ఎవరు నేతృత్వం వహించినా అభ్యంతరం లేదు: మమత
కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశం
న్యూఢిల్లీ, జూలై 28: కేంద్రంలో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలను ఐక్యం చేసే పనిలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేసి వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన దీదీ .. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె బుధవారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌లను విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సోనియా తనను టీకి ఆహ్వానించారని, రాహుల్‌ కూడా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత, కొవిడ్‌, పెగాసస్‌ అంశాలపై సోనియాతో చర్చించానని తెలిపారు.
‘‘పిల్లి మెడలో గంట కట్టే విషయంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటికీ సాయం చేయాలనుకుంటున్నాను. నేను నాయకత్వం వహించాలనుకోవడం లేదు. ఒక కార్యకర్తగా ఉంటాను. ఎవరు నేతృత్వం వహించినా నాకేమీ అభ్యంతరం లేదు. ఆ అంశం చర్చకు వచ్చినప్పుడే నిర్ణయిస్తాం. నేనేమీ పట్టుబట్టను’’ అని మమత చెప్పారు.
పెగాసస్‌ గురించి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీ కంటే అత్యంత ప్రమాదకరంగా తయారైందన్నారు. పెగాస్‌సపై కేంద్రమే ముందుకు వచ్చి దర్యాప్తు జరిపితే బాగుండేదని, ప్రజాస్వామ్యంలో ప్రతిస్పందన అవసరమని హితవు పలికారు. ప్రతి విషయంలోనూ ఈడీ, సీబీఐలను రంగంలోకి దింపుతున్నవారు ఈ విషయంలో ఎందుకు విచారించరని ప్రశ్నించారు. కేంద్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందని నిందించారు. రాత్రికి రాత్రే రాజకీయ భవితవ్యం మారిపోయిన ఘటనలు మన దేశంలో ఎన్నో చూశామని మమత చెప్పారు.
‘‘1977లో ఏం జరిగింది? ఇందిరాగాంధీ పదవి కోల్పోయారు. వాజ్‌పేయి ఏడాదిలోపే పాపులారిటీ కోల్పోయారు. మన ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి.  ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా కృషి చేస్తే ‘ఆరు నెలలు చాలు’. రాజకీయ తుఫాను వస్తే నిలబడటం కష్టం. ఖేలా హొబే(ఆట కొనసాగుతోంది) ఇక దేశవ్యాప్తంగా మారుమోగనుంది. ఇక మోదీ వర్సెస్‌ భారతదేశం. వచ్చే ఎన్నికల్లో దేశంతోనే మోదీ  పోరాడాల్సి ఉంటుంది. యూపీలో కొవిడ్‌ మృతుల అంత్యక్రియల కోసం కుటుంబసభ్యుల ప్రదక్షిణలు, గంగానదిలో కొట్టుకొచ్చిన శవాలను ప్రజలు మరిచిపోగలరా? వాళ్లు మళ్లీ మోదీకి ఓటేస్తారా?’’ అని మమత ప్రశ్నించారు.
అచ్చే దిన్‌(బీజేపీ నినాదం) చాలా భరించాం.. ఇక సచ్చే(సత్య) దిన్‌ చూడాలనుకుంటున్నా అన్నారు. ప్రతిపక్షాల ఏకీకృతంపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల అనంతరం చర్చలు ప్రారంభించాల్సి ఉందని ఆమె చెప్పారు. ఏకీకృత ప్రతిపక్షం ఉండాలని సోనియాగాంధీ కూడా కోరుకుంటున్నారన్నారు. వైసీపీ, బీజేడీ పార్లమెంటులో ప్రతిపక్షాలకు దూరంగా ఉంటున్నాయని, ఆ పార్టీలనూ కలుపుకెళ్లేలా కృషి జరుగుతోందా? అని ప్రశ్నించగా, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌లతో తనకు మంచి పరిచయం ఉందని చెప్పారు.
‘‘ఈ రోజు వారిద్దరూ మాతో లేకపోవచ్చు. రేపు ఆ పరిస్థితి మారదని ఎవరు చెప్పగలరు?’’ అన్నారు. అన్ని పార్టీల నేతలతోనూ తాను మాట్లాడుతున్నానని మమత చెప్పారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా కలుస్తారా? అని ప్రశ్నించగా, ఆ ప్రశ్న వాళ్లని అడగాలని మమత సూచించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రె్‌సలో చేరుతున్నారనే ఊహాగానాలపై స్పందించేందుకూ మమత నిరాకరించారు. ‘‘ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే సామర్థ్యం అతనికి ఉంది. ఎక్కడికి వెళ్లాలో? ఎక్కడ పనిచేయాలో? నిర్ణయించుకునే స్వేచ్ఛ అతనికి ఉంది’’ అన్నారు.

Related Keywords

Delhi ,India ,New Delhi ,Mamata Banerjee ,Banerjee Sonia Gandhi ,Sonia Gandhi , ,Her Wednesday ,Modi India ,டெல்ஹி ,இந்தியா ,புதியது டெல்ஹி ,மாமத பானர்ஜி ,சோனியா காந்தி ,அவள் புதன்கிழமை ,மோடி இந்தியா ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.