comparemela.com


పారా కోర్సులకు పాతర!
నోటిఫికేషన్‌ లేక ఏటా 43వేల సీట్లు వృథా
ఆరోగ్యసేవలకు వెన్నెముక పారా మెడికల్‌
ఏటా వేలాదిమంది విద్యార్థులు చేరే కోర్సులు
రెండేళ్లుగా భర్తీలు లేక పొరుగు రాష్ట్రాలకు
ఇప్పటికి రెండుసార్లు హైకోర్టు ఆదేశాలు
సహకరించేందుకు పారా కాలేజీలూ రెడీ
తనిఖీ చేశాకే అనుమతి ఇవ్వాలంటున్నా
సాకులతో నోటిఫికేషన్‌ ఇవ్వని వైనం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): పారా మెడికల్‌ కోర్సులకు ప్రభుత్వం పాతరేసింది. కాలేజీలు కోరుతున్నాయి. కోర్టులు ఆదేశాలు ఇస్తున్నాయి. అయినా..ఏళ్ల తరబడి వేల సీట్లు భర్తీ చేయకుండా మొత్తంగా ఈ కోర్సులనే నిర్వీర్యం చేసేసింది. దీంతో పారా మెడికల్‌ చదవాలనుకొనే విద్యార్థులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో దాదాపు 43 వేల సీట్లు అందుబాటులో ఉన్నా, గత రెండేళ్లుగా ఒక్క సీటు కూడా భర్తీ చేయకుండా వృథా చేస్తోంది. కాలేజీలతో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాల్సిన బోర్డు అధికారులు...వాటిని  మరింత జటిలం చేస్తున్నారు. అధికారుల మొండిపట్టు కారణంగా ఏటా వేల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఇప్పటికే రెండేళ్లుగా 80 వేల సీట్లను విద్యార్థులు కోల్పోయారు. 
ఉమ్మడి రాష్ట్రంలో 750 పారా మెడికల్‌ కాలేజీలు ఉండగా...ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఇప్పుడు ఏపీలో 446 కాలేజీలు మిగిలాయి. ఉమ్మడి రాష్ట్రంలో పారా మెడికల్‌ బోర్డు సెక్రటరీగా పని చేసిన ఒక అధికారి కొన్ని కాలేజీలకు అనధికారికంగా అనుమతులిచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి అధికారులు 296 ప్రైవేటు కాలేజీలకు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా నిలిపివేశారు. కేవలం 150 కాలేజీల్లో సీట్లు భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన కాలేజీలు దీనిపై హైకోర్టును ఆశ్రయించాయి. 2017లో తీర్పు ఇచ్చిన కోర్టు.. అన్ని కాలేజీలకు కలిపి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆదేశించింది. అనుమానం ఉంటే వెంటనే 296 కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలని, అన్నీ సక్రమంగా ఉంటేనే ఆయా కాలేజీల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది. కానీ బోర్డు వాటిని కూడా పెడచెవిన పెట్టి కాలయాపన చేస్తూ వచ్చింది. అప్పటి నుంచి ఈ సమస్య కోర్టులో నలుగుతూనే ఉంది.
మళ్లీ అదే పితలాటకం..
చివరిగా 2020లో మరోసారి సదరు ప్రైవేటు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. ఏళ్ల తరబడి నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే అందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరాయి. దీనిపై స్పందించిన కోర్టు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. కౌంటర్‌ వేసిన ప్రభుత్వం.. అన్ని పారా మెడికల్‌ బోర్డు కాలేజీలకు నోటిఫికేషన్‌ ఇస్తామని కోర్టుకు స్పష్టంగా చెప్పింది. దానికనుగుణంగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోర్టు పారా మెడికల్‌ బోర్డుకు 2020 డిసెంబరులో సూచించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం బోర్డు అధికారులు 2021-22 విద్యాసంవత్సరానికి గాను అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో కూడా మళ్లీ కిరికిరి పెట్టారు. హైకోర్టు మొత్తం 446 కాలేజీలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశిస్తే... అధికారులు 150 కాలేజీలకు మాత్రమే ఇచ్చారు. ఈ కాలేజీల్లో కేవలం ఆరు వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. 
మిగిలిన 296 కాలేజీల్లో 37 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని సీట్లను గాలికి వదిలేసిన బోర్డు అధికారుల తీరుపై ప్రైవేటు కాలేజీల  యాజమాన్యాలు భగ్గుమన్నాయి. మరోసారి కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. శాంపిల్‌ సేకరణ నుంచి ల్యాబ్‌లో టెస్టింగ్‌ వరకూ... ఐసీయూలో అత్యవసర కేసులకు వెంటిలేటర్‌ పెట్టే దగ్గర నుంచి ప్రతి విభాగంలో పారా మెడికల్‌ సిబ్బంది అవసరం. అధికారుల నిర్వాకంతో కొవిడ్‌ సమయంలో సేవలు అందించేందుకూ సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. ఎంతకీ నోటిఫికేషన్‌ విడుదల చేయకపోడంతో విద్యార్థులు ఇతర కోర్సుల వైపు మళ్లుతున్నారు. మరికొందరు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు వెళ్లి ఈ కోర్సుల్లో చేరుతున్నారు. పారా మెడికల్‌ బోర్డు అధికారులను మారిస్తే తప్ప పరిష్కారం దొరకదనే అభిప్రాయం ఆరోగ్యశాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తనిఖీలకు సిద్ధమే..
పారా మెడికల్‌ బోర్డుకు అనుమానం ఉంటే మా కాలేజీలన్నింటినీ తనిఖీలు చేసి..అర్హత ఉన్న కాలేజీలకు మాత్రమే అనుమతి ఇవ్వొచ్చు. అలాగే చేస్తామని గతంలో అప్పటి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి మాకు చెప్పారు. ఆయన చెప్పినట్టు తనిఖీలకు ఎవరైనా వస్తారేమోనని మేమంతా ఎదురుచూస్తూనే ఉన్నాం. 2021 -22 విద్యా సంవత్సరానికి బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో అర్హత ఉన్న కాలేజీలను వెంటనే చేర్చాలి. కోర్టు ఆదేశాలను ధిక్కరించకుండా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాం’’ 
- బీఎం రత్నం, ప్రెసిడెంట్‌, పారామెడికల్‌ కాలేజీల సంఘం
తెలంగాణలో ఇలా...
ఏపీలో పారా మెడికల్‌ కోర్సులకు వచ్చిన సంక్షోభమే తెలంగాణలోనూ వచ్చింది. కానీ అక్కడి బోర్డు అధికారులు అప్రమత్తమై ఈ సమస్యను పరిష్కరించారు. అన్ని కాలేజీలను తనిఖీలు చేసి, అనుమతులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు కూడా అక్కడి బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన బోర్డు అధికారులు చకచకా ఆ  ప్రక్రియను పూర్తి చేశారు.

Related Keywords

United States , ,Commission Telangana ,T High Court ,High Court ,Board December ,Tamil Nadu ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,உயர் நீதிமன்றம் ,பலகை டிசம்பர் ,தமிழ் நாடு ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.