comparemela.com


పద్మవ్యూహం
పద్మావతి ఆస్పత్రి ముందు బాధితుల సహాయకుల ఆందోళన
పద్మావతి కొవిడ్‌ కేంద్రంలో  బాధితుల పరిస్థితి అగమ్యగోచరం
సిబ్బంది నిర్లక్ష్యంపై సహాయకుల మండిపాటు 
తిరుపతి: రాష్ట్రస్థాయి కొవిడ్‌ కేంద్రమైన స్విమ్స్‌ పద్మావతి ఆస్పత్రి బాధితుల పట్ల పద్మవ్యూహంలా మారింది. చికిత్స కోసం లోపలకు వెళ్లిన వారు ఎలా వున్నారో సమాచారం తెలియక బయటున్న పేషెంట్ల సహాయకులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 337 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇటీవల బ్లాక్‌ఫంగస్‌ బాధితులు పెరుగుతుండడంతో ఆస్పత్రిలోని నాల్గో అంతస్తులో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. అక్కడ 121మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల నుంచి కూడా బాధితులు ఇక్కడకు వస్తున్నారు. వారి వెంట వస్తున్న కుటుంబసభ్యులు ఆస్పత్రి బయట పడిగాపులు పడుతున్నారు. లోపలున్న వారి ఆరోగ్య పరిస్థితి ఎలావుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. పేషెంట్ల పట్ల వైద్య సిబ్బంది విపరీతమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ బాధితులు చెప్పడం వారిని కలవరపరుస్తోంది. ఫస్ట్‌ వేవ్‌లో కూడా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొన్న స్విమ్స్‌లో ఇంకా పరిస్థితి మారలేదు.
ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున  బ్లాక్‌ ఫంగస్‌తో చికిత్స పొందుతున్న నెల్లూరుకు చెందిన జయమ్మ అనే మహిళ మరుగుదొడ్డిలో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం, కొవిడ్‌తో చికిత్స పొందుతున్న కలికిరి మండలం రంగనాథపురానికి చెందిన వినోద్‌కుమార్‌(27)మృతి చెందడం తెలిసి పేషెంట్ల సహాయకులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. జయమ్మ ఆత్మహత్యకు, వినోద్‌కుమార్‌ మృతికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని లోపల చికిత్స పొందుతున్న వారు సిబ్బంది నిర్లక్ష్యం గురించి ఎప్పటికప్పుడు ఫోన్‌లో సమాచారం ఇస్తున్నారని ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితుల సహాయకులు కొవిడ్‌ కేంద్రం ముందు ఆందోళన చేశారు. దీంతో  ఆర్డీవో కనకనరసారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని జయమ్మ మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన్ను బాధితుల సహాయకులు చుట్టుముట్టి వారి బాధలను వెలిబుచ్చారు. ఇక్కడ బాధితులను ఎవరూ పట్టించుకోవడంలేదని వారి నిర్లక్ష్యం కారణంగానే రోజూ ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఇందుకు జయమ్మ ఆత్మహత్య, వినోద్‌కుమార్‌ మృతదేహాలే సాక్ష్యమని వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇలాగే కొనసాగితే లోపల చికిత్స పొందుతున్న తమ వారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి నెలకొంటుందని వారు ఆయనకు మొరపెట్టుకున్నారు. వైద్య సిబ్బంది చేయాల్సింది చేస్తున్నారని రోగుల ప్రాణాలను కాపాడటం కోసమే వారు ప్రయత్నిస్తున్నారని ఆయన వారికి  నచ్చజెప్పారు. ఈ నేపథ్యంలో కొందరు బాధితుల సహాయకులు నోరు విప్పారు. 
ఆర్డీవోను చుట్టుముట్టి బాధలు చెప్పుకుంటున్న బాధితుల సహాయకులు
చంద్ర
నిర్లక్ష్యంతోనే మా అబ్బాయి చనిపోయాడు
మా అబ్బాయి వినోద్‌కుమార్‌కు కరోనా సోకడంతో మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాం. కొంత కోలుకున్నాక రెండు వారాల క్రితం ఇక్కడకు తీసుకొచ్చాం. చేరినప్పటి నుంచి లోపల సిబ్బంది ఏమీ పట్టించుకోవడంలేదని కనీసం ఆహారం కూడా సక్రమంగా పెట్టడంలేదని ఫోన్‌లో చెప్పేవాడు. ఈ విషయాన్ని డాక్టర్ల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. శనివారం రాత్రి కూడా ఫోన్‌లో బాగానే మాట్లాడాడు. రాత్రి లోపల ఏం జరిగిందో తెలీదు... తెల్లవారుజామున మీ కొడుకు చనిపోయాడని చెబుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నా కొడుకు చచ్చిపోయాడు. 
-చంద్ర, రంగనాథపురం, కలికిరి మండలం 
 
వెంకటేశ్వర్లు
మా నాన్నకు తిండి పెట్టి మూడు రోజులైంది 
మాది తరిగొండ పక్కనున్న చింతలవారిపల్లె. మా నాన్న వెంకటసుబ్బయ్యకు ఆయాసం, ఛాతీలో నొప్పితోపాటు ఒక చేయీ, కాలూ పనిచేయకపోవడంతో మదనపల్లెలోనిఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించాం. అక్కడ వైద్యం కోసం రూ. 8 లక్షలు ఖర్చు పెట్టాం. చివరకు  స్విమ్స్‌కు తీసుకువెళ్లాలని చెప్పడంతో వారం క్రితం ఇక్కడకొచ్చాం. ఆ రోజు మా నాన్నను లోపలకు తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఆయనకు ఎలా ఉందో ఎవరూ చెప్పడంలేదు. మా నాన్న లోపల నుంచి ఫోన్‌ చేసి ఇక్కడ తిండి పెట్టి మూడు రోజులవుతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నాడు. ఇక్కడే ఉంటే నేను చచ్చిపోతాను... తీసుకెళ్లండని రోజూ ఫోన్‌లో ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.
- వెంకటేశ్వర్లు, చింతలవారిపల్లె, గుర్రంకొండ మండలం
 
శివారెడ్డి
ఇక్కడకు ఎందుకొచ్చామా అన్పిస్తోంది
మా అన్న మునెప్పరెడ్డికుమార్‌ కొవిడ్‌ బారిన పడితే పది రోజుల కిందట ఇక్కడ చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన లోపల ఎలా ఉన్నారో చెప్పే వారు లేరు. లోపల వేరే వాళ్ల ఫోన్‌ ద్వారా ఆయనతో మాట్లాడితే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడంలేదని చెబుతున్నాడు. వైద్యం కాదు కదా తాగేందుకు శుద్ధమైన నీళ్లు కూడా లేవంటున్నాడు. తనకంటే అధ్వాన పరిస్థితుల్లో ఎందరో వున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని చెబుతున్నాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
 - శివారెడ్డి, పిచ్చాటూరు
వినోద్‌
డబ్బులిస్తేనే ఆహారం తినిపిస్తున్నారు 
మా నాన్న వీరయ్య బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడడంతో మూడు రోజుల కిందట ఇక్కడకు తీసుకొచ్చాం. అసలే ఆయన వికలాంగుడు. దీనికితోడు బ్లాక్‌ ఫంగస్‌ రావడంతో సొంతంగా ఆహారం కూడా తీసుకోలేడు. ఈ పరిస్థితిలో ఇక్కడకు వచ్చిన రెండు రోజులు లోపల ఆహారం తినిపించే వారు లేక పస్తులున్నాడంట. ఈ విషయాన్ని సిబ్బందికి చెబితే డబ్బులు ఇస్తే మేమే తినిపిస్తాం అంటున్నారు. దీంతో పూట పూటకూ సిబ్బంది చేయి తడపాల్సి వస్తోంది.  
- వినోద్‌, బద్వేలు
రమణమ్మ,
24 రోజులుగా ఒంటిపై ఉన్న బట్టలతోనే  
మా ఆయన తిరుపాలు కొవిడ్‌ బారిన పడడంతో 24 రోజుల క్రితం ఇక్కడకు తీసుకొచ్చాం.కొవిడ్‌తో పాటు బ్లాక్‌ ఫంగస్‌ కూడా ఉందని చెప్పారు. సరే చికిత్స చేసి తగ్గిస్తారులే అనుకుంటే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడంలేదు. ఆయన వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఒంటిపై ఉన్న బట్టలతోనే ఉన్నారు. కొత్త బట్టలు ఇచ్చి పంపినా అవి ఆయనకు చేరలేదంట. ఏది పంపినా చేరలేదని చెబుతున్నాడు. పది రోజుల వరకు వేరే వాళ్ల ఫోన్‌తో మాట్లాడే వాడు.పది రోజులుగా ఫోన్‌ లేదు. ఇక్కడ ఎవర్ని అడిగినా లోపల చికిత్స పొందుతున్నాడు ఏం కాదులే అని కసురుకుంటున్నారు. లోపల అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు.
-రమణమ్మ, వెంకటగిరి
సుధ
ఫోన్‌ కూడా మాయం చేసేశారు 
మా నాన్న కొవిడ్‌ బారిన పడడంతో 5 రోజుల కిందట ఇక్కడ చేర్పించాం. లోపల ఉన్న ఆయనతో మాట్లాడేందుకు కొత్త ఫోన్‌ కూడా కొనిచ్చాం. కానీ ఆ మరుసటి రోజే ఆ ఫోన్‌ కనిపించడంలేదని మా నాన్న లోపల నుంచి వేరే వాళ్ల ఫోన్‌ ద్వారా చెప్పారు. ఈ విషయంపై సిబ్బందిని అడగ్గా మాకేం తెలుసు అంటున్నారు. అప్పటి నుంచి ఇంత వరకు ఆయనతో మాట్లాడింది లేదు. కనీసం ఆయన లోపల ఎలా ఉన్నారో కూడా తెలియడం లేదు. ఏం జరిగిందోనని ప్రతి నిమిషం భయాందోళనతో గడుపుతున్నాం.
- సుధ, శ్రీకాళహస్తి
Advertisement

Related Keywords

Siva Reddy ,Srikalahasti Chittoor ,Center Padmavati Hospital ,Padmavati Hospital ,State Center Padmavati Hospital ,Tamil Nadu ,His Tirupati ,சிவா சிவப்பு ,பத்மாவதி மருத்துவமனை ,தமிழ் நாடு ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.