Jul 25,2021 06:16
ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల్లో తరచుగా ఏర్పడే ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయాల్లో పరీక్ష వుంటుంది. వీటిలో ఇంగ్లీష్ మరియు హిందీ భాషలకు 20 మార్కులు చొప్పున వుంటాయి. ఇంగ్లీష్ భాషలో ఏ ప్రాంతం వారికైనా మార్కులు దాదాపు సమానంగానే వస్తున్నాయి. కానీ హిందీ భాషలో హిందీ ప్రాంతం అభ్యర్థులకు 80 శాతం పైగా మార్కులు వస్తుండగా హిందీ యేతర ప్రాంతాల వారికి అందులో సగం కూడా రావడం లేదు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీ భాషకు ఇస్తున్న వెయిటేజ్ వలన హిందీ యేతర రాష్ట్రాల ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో గల 9 నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ సిబ్బంది 220 మంది ఉండగా వారిలో సుమారు 50 (22.7 శాతం) మంది మాత్రమే తెలంగాణ వారున్నారు. మిగిలిన వారిలో కొద్దిమంది ఆంధ్రప్రదేశ్ వారున్నా... మెజారిటీ హిందీ ప్రాంతం వారే వున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నవోదయ విద్యాలయాల్లో కూడా అదే పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల 72 శాతం కేంద్రీయ విద్యాలయాల్లో పని చేస్తున్న దాదాపు 2500 మంది ఉపాధ్యాయుల్లో తెలుగువారు 20 శాతం మంది మాత్రమే వున్నారు. కాగా 2015 నుండి జరుగుతున్న నియామకాల్లో నూటికి 10 మంది కూడా తెలుగు వారు లేరు. ఉదాహరణకు 2018 లో నియమితులైన ఉపాధ్యాయుల్లో కొన్ని కేంద్రీయ విద్యాలయాల్లో అందరూ హిందీ ప్రాంతం వారే వున్నారు. ఒక్కరు కూడా స్థానికులు లేరు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపాధ్యాయులుగా ఎంపికవుతున్న అతి కొద్దిమంది తెలుగువారిలో రక్షణ సర్వీసుల్లో పని చేస్తున్న వారి పిల్లలు మరియు కేంద్రీయ విద్యాలయాల్లో చదివినవారే. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ తెలుగు మీడియం పాఠశాలల్లో చదివినవారికి అవకాశం దక్కడం లేదు. 'గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు జాతీయ సమగ్రతను అలవరచాలి' అనే సంకల్పంతో ఏర్పాటు చేయబడిన నవోదయ విద్యాలయాల సిబ్బంది నియామకాల్లోనే పూర్తి అసమగ్ర విధానం అమలు జరుగుతోంది. నియామక ఎంపిక పరీక్షల్లో హిందీ భాష ఆధిపత్యమే ఈ పరిస్థితికి ఒక ముఖ్యమైన కారణమని తెలుస్తోంది.
కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపాధ్యాయ నియామకాల్లో 75 శాతం పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయబడతాయి. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల్లో తరచుగా ఏర్పడే ఖాళీల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జితో పాటు రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయాల్లో పరీక్ష వుంటుంది. వీటిలో ఇంగ్లీష్ మరియు హిందీ భాషలకు 20 మార్కులు చొప్పున వుంటాయి. ఇంగ్లీష్ భాషలో ఏ ప్రాంతం వారికైనా మార్కులు దాదాపు సమానంగానే వస్తున్నాయి. కానీ హిందీ భాషలో హిందీ ప్రాంతం అభ్యర్థులకు 80 శాతం పైగా మార్కులు వస్తుండగా హిందీ యేతర ప్రాంతాల వారికి అందులో సగం కూడా రావడం లేదు. హిందీ మాతభాషతో పాటు హిందీ మీడియంలోనే చదువుకున్న వారికి అడ్వాంటేజ్‌గా వుంది. హిందీ యేతర రాష్ట్రాల్లోని కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో బోధనా మాధ్యమం ఇంగ్లీష్ మాత్రమే. అందువలన నియామక పరీక్షా విషయాల్లో ఇంగ్లీష్ అనివార్యం కావచ్చు. కానీ హిందీ ఎందుకు? ఇంగ్లీషుతో పాటు మరో భాషలో పరిజ్ఞానాన్ని కూడా పరీక్షించదలిస్తే రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషల్లో దేనిలోనైనా రాసే అవకాశం ఇవ్వాలి. ఎవరి మాతృభాషలో వారు లేదా ఎవరికి నచ్చిన భాషలో వారు ఆప్షన్ తీసుకుంటారు. సివిల్ సర్వీసులకు చెందిన యూపీఎస్సీ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం ఉండగా కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఉపాధ్యాయ నియామకాలకు లేకపోవడం చాలా అన్యాయం. నియామకాలు జోనల్ పరిధిలో కాకుండా దేశం మొత్తం ఒకే యూనిట్ గా కేంద్రీకృతంగా నిర్వహించడం కూడా ఈ అసమానతకు మరో ముఖ్యమైన కారణం.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో హిందీ యేతర రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం గురించి రెండు విద్యా సంస్థలకు సంబంధించిన వివరాలు మాత్రమే పైన ప్రస్తావించుకున్నాం. ఈ నష్టం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థలు, అటానమస్ సంస్థల్లోనూ జరుగుతోంది. అవి: ఇండియన్ రైల్వేలు, పోస్టల్, సి.పి.డబ్ల్యు.డి, సెంట్రల్ సెక్రటేరియట్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, డిఫెన్స్, రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్లు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్, సి.సి.ఎం.బి, ఎన్‌ఐఎన్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వగైరా వందలకొలదీ వున్నాయి. పైన పేర్కొన్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాల కంటే ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థల్లోనే చాలా ఎక్కువ ఉద్యోగాలు వుంటాయి. వాటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 40 లక్షల పోస్టులకు నియామకాలు నిర్వహిస్తే అందులో సుమారు 2 లక్షలు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. అమల్లో వున్న ఎంపిక పరీక్షా విధానంలో హిందీకి గల ప్రాధాన్యత తెలుగు భాషకు లేకపోవడం వలన అవి తెలుగువారికి దక్కే అవకాశం లేదు. రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు ఇంత ముఖ్యమైన సమస్యను పట్టించుకోకపోవడం చాలా అన్యాయం. ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ యేతర రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన సమస్య. ప్రభుత్వ రంగంలో వున్న కొద్దిపాటి ఉద్యోగాల్లో సైతం జరుగుతున్న ప్రాంతీయ అన్యాయాన్ని ఎదిరించాలి.
/ వ్యాసకర్త విద్యారంగ నిపుణులు,
సెల్: 9490300577/
తాజా వార్తలు